Winter Foods: చలికాలంలో జలుబు, జ్వరం సహా వ్యాధులు రాకూడదంటే ఏం తినాలి? డాక్టర్ చెప్పిన విషయాలు ఇవే
Winter Foods: వ్యాధుల రిస్క్ ఎక్కువగా ఉండే చలికాలంలో తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండే ఫుడ్స్ కచ్చితంగా తీసుకోవాలి. శీతాకాలంలో ఏ ఆహారాలు తీసుకోవాలో ఓ డాక్టర్ వెల్లడించారు. ఆ వివరాలు ఇవే
ప్రస్తుతం శీతాకాలం తీవ్రమైంది. వాతావరణం చల్లగా మారిపోయింది. ఈ చలికాలంలో జలుబు, జ్వరం లాంటి సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు సోకే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే రోగ నిరోధక శక్తిని బాగా పెంచే ఆహారాలు తినడం చాలా ముఖ్యం. ఇవి తినడం వల్ల రోగాలు దరిచేరకుండా జాగ్రత్త పడొచ్చు. చలికాలంలో ఎలాంటి ఆహారాలు తినాలో హెచ్‍టీ లైఫ్‍స్టైల్‍తో ఇంటర్వ్యూలో చెప్పారు గ్రేటర్ నొయిడా యాథార్థ్ ఆసుపత్రి ఆరోగ్య, పోషకాహార విభాగం హెడ్ డాక్టర్ కిరణ్ సోనీ. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
రోగ నిరోధక శక్తి పెరగాలంటే పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాలు తినాలని కిరణ్ సోనీ తెలిపారు. ఇలాంటివి తీసుకోవడం వల్ల శరీరానికి వెచ్చదనం, ఎనర్జీ కూడా అందుతుందని, సీజనల్ వ్యాధుల నుంచి శరీరం పోరాడేందుకు సహకరిస్తాయని వెల్లడించారు.
చలికాలంలో తినాల్సినవి ఇవే
చలికాలంలో రోగ నిరోధక శక్తి పెరిగి, వ్యాధులు దరి చేరకుండా ఉండేందుకు డైట్‍లో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో డాక్టర్ కిరణ్ సోనీ వెల్లడించారు. అవేవంటే..
కూరగాయలు, ఆకుకూరలు
చలికాలంలో క్యారెట్లు, చిలకడదుంపలు, ముల్లంగి లాంటి దుంప కూరగాయలు తినాలి. వీటిలో విటమిన్ సీ, విటమిన్ ఏ మెండుగా ఉంటుంది. ఇవి రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. పాలకూర, మెంతికూర, ఆవ ఆకులు లాంటి ఆకుకూరలు తీసుకోవాలి. బ్రోకలీ, క్యాలిఫ్లవర్, క్యాబేజీలో ఫైబర్ సహా మిగిలిన పోషకాలు మెండుగా ఉంటాయి. చలికాలంలో వీటిని తీసుకోవడం ఇమ్యూనిటీ పెరుగుతుంది. సీజనల్ రోగాల దరి చేరే ప్రమాదం తగ్గుతుంది.
చిరుధాన్యాలు
చలికాలంలో చిరుధాన్యాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రాగులు, క్వినోవా, సజ్జలు, ఓట్స్, బ్రౌన్ రైస్ లాంటివి ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిలో ఉండే పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచితే.. జీర్ణక్రియను, ఎనర్జీని ఫైబర్ అధికం చేస్తుంది. చిరుధాన్యాలతో బ్రేక్ ఫాస్ట్ చేసుకోవడం మంచి ఆప్షన్‍గా ఉంటుంది. వైట్ రైస్‍తో అన్నం బదులు వీటితో చేసుకోవచ్చు.
ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉండేవి
ఒమేగా ఫ్యాటీ-3 యాసిడ్స్ పుష్కలంగా ఉండే బాదం, ఆక్రోటు, అవిసె, చియా లాంటి నట్స్, సీడ్స్ చలికాలంలో తీసుకోవాలి. ఇవి గుండె, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి. నెయ్యి, కొబ్బరినూనెలోనూ ఇవి ఉంటాయి. సాల్మన్ లాంటి ఫ్యాటీ ఫిష్‍లు కూడా రోగ నిరోధక శక్తిని పెంచగలవు.
ఇవి తప్పనిసరిగా..
రోగ నిరోధక శక్తిని పసుపు, అల్లం మెరుగ్గా పెంతాయి. వీటిలో యాంటీఇన్‍ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. సీజనల్ వ్యాధులను ప్రమాదాన్ని తగ్గించగలవు. వీటితో టీలు చేసుకొని తాగొచ్చు. పసుపును నీరు, పాలల్లో వేసుకొని తీసుకోవచ్చు. ఆహారాల్లోనూ వీలైనంత మేర తీసుకుంటే మేలు. విటమిన్ సీ పుష్కలంగా ఉండే నారింజ, నిమ్మ, ఉసిరి లాంటివి కూడా ఇమ్యూనిటీని బాగా పెంచగలవు.
ప్రోటీన్ పుష్కలంగా ఉండేవి
ప్రోటీన్ ఎక్కువగా ఉండే కాయధాన్యాలు, పప్పులు, పన్నీర్ టోఫు, కోడిగుడ్లు, చేపలు లాంటివి చలికాలంలో తినాలి. వీటివల్ల ఎనర్జీ, కండరాల దృఢత్వం పెరగడంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా మెరుగవుతుంది.
తగినంత నీరు
చలికాలంలో శరీరానికి సరిపడా నీరు తాగడం చాలా ముఖ్యం. దాహం వేయడం లేదనే కారణంతో నీరు తక్కవగా తాగకూడదు. శరీరంలో హైడ్రేటెడ్‍గా ఉండేలా సరిపడా నీరు తీసుకోవాలి. దీనివల్ల ఇమ్యూనిటీ మెరుగ్గా ఉంటుంది.
ఇవి తాగాలి
గ్రీన్ టీ, అల్లం టీ, పుదీన టీ లాంటి హెర్బల్ టీలు చలికాలంలో తాగాలి. గోరువెచ్చని పాలలో పసుపు వేసుకొని తీసుకోవాలి. కూరగాయలతో చేసి సూప్‍లు తీసుకోవాలి. వీటి వల్ల శరీరానికి వెచ్చదనంతో పాటు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
సంబంధిత కథనం