Amla Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. తయారీ ఇలా
Amla Pickle Recipe: ఉసిరికాయ పచ్చడి వగరుగా, కారంగా మంచి రుచితో ఉంటుంది. నిల్వ పచ్చడి పెట్టుకుంటే ఏడాది పాటు తినేందుకు బాగుంటుంది. ఈ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఇక్కడ చూడండి.
Amla Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. తయారీ ఇలా (Pinterest)
ప్రస్తుతం ఉసిరికాయల సీజన్ నడుస్తుంది. ఇప్పుడు వీటితో నిల్వ పచ్చడి పెట్టుకుంటే ఏడాదంతా తినేయవచ్చు. ఆరోగ్యానికి ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని రెగ్యులర్‌గా తినడం మంచిదే. పుల్లగా, వగరుగా, కారంగా ఈ ఉసిరి కాయ నిల్వ పచ్చడి అదిరిపోతుంది. ఇతర వాటితో పోలిస్తే డిఫరెంట్ టేస్టుతో ఆకట్టుకుంటుంది. ఉసిరికాయ నిల్వ పచ్చిడి ఎలా చేయాలంటే..
ఉసిరికాయ నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు
- కేజీ ఉసిరికాయలు (మీడియం సైజు)
- 100 గ్రాముల చింతపండు (పిక్కలు లేకుండా)
- రెండు టేబుల్ స్పూన్‍ల ఆవాలు
- టేబుల్ స్పూన్ మెంతులు
- అర లీటర్ వంట నూనె
- 100 గ్రాముల ఉప్పు
- 100 గ్రాముల కారం
- టీ స్పూన్ ఇంగువ
- రెండు టీ స్పూన్‍ల ఆవాలు
- నాలుగు ఎండుమిర్చి
- రెండు టీస్పూన్‍ల జీలకర్ర
- రెండు టీస్పూన్‍ల పసుపు
- అర టీస్పూన్ ఇంగువ
- నాలుగు రెబ్బల కరివేపాకు
- 14 వెల్లుల్లి రెబ్బలు
ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారీ విధానం
- ముందుగా ఉసిరికాయలను నీటితో బాగా కడగాలి. ఆ తర్వాత ఏ మాత్రం తేమ లేకుండా క్లాత్‍తో తుడవాలి.
- చింతపండులోని పిక్కలు, పీచు తీసేయాలి. చింతపండులో ఒకటిన్నర కప్పుల వేడి నీరు వేసి నానబెట్టాలి.
- స్టవ్‍పై ఓ కళాయి పెట్టి అవాలను సన్నని మంటపై వేయించుకోవాలి. అవి చిట్లిన తర్వాత మెంతులను వేసుకోవాలి. రెండింటినీ సన్నని సెగపైనే దోరగా ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత వేయించిన అవాలు, మెంతులను మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
- అదే మిక్సీ జార్‌లో నానపెట్టుకున్న చింతపండును నీటితో సహా వేసుకోవాలి. దాన్ని మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- స్టవ్‍పై కళాయి పెట్టుకొని అరలీటర్ నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక అందులో ఉసిరికాయలను వేసి ఫ్రై చేయాలి. మీడియం మంటపై ఉసిరికాయ మెత్తపడే వరకు వేయించుకోవాలి.
- అన్ని ఉసిరికాయలను వేయించుకొని ఓ గిన్నెలో తీసి పెట్టుకోవాలి.
- అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ వేసి వేయించాలి. ఆ తర్వాత దాంట్లోనే గ్రైండ్ చేసుకున్న చింతపండు పేస్ట్, కరివేపాకు వేయాలి.
- చింతపండు పేస్ట్‌లోని తేమ అంతా పోయేలా సన్నని మంటపై వేయించుకోవాలి. సుమారు 12 నుంచి 15 నిమిషాల వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత అందులోనే వెల్లుల్లి పాయలు వేయాలి. చింతపండు పేస్ట్‌ను కాస్త గోరువెచ్చగా అవనివ్వాలి.
- ఆ తర్వాత గిన్నెలో పెట్టుకున్న వేయించిన ఉసిరికాయల్లో అవ, మెంతి పిండి వేసుకోవాలి. దాంట్లోనే ఉప్పు, కారం వేయాలి. వాటిని ఉసిరికాయలకు బాగా పట్టించాలి. దాంట్లోనే వేయించుకున్న చింతపండు పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి. కాయలకు అంతా బాగా పట్టేలా మిక్స్ చేయాలి.
- ఈ పచ్చడిని జాడీ లేదా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి కనీసం మూడు రోజులు ఊరనివ్వాలి. ప్రతీ రోజు కలిపుతూ ఉండాలి. ఊరిన తర్వాత ఉసిరికాయ పచ్చడిని తినేయడమే.