Prakasam District Crime : ప్రకాశం జిల్లాలో దారుణం.. రెండో తరగతి విద్యార్థినిపై పదో తరగతి విద్యార్థి అత్యాచారం
Prakasam District Crime : ప్రకాశం జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. రెండో తరగతి చదువుతున్న విద్యార్థినిపై పదో తరగతి చదువుతున్న విద్యార్థి అత్యాచారానికి ఒడిగట్టాడు. చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు అయింది.
చిన్నారిపై బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని ఒక గ్రామంలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం.. నాలుగుప్పలపాడు మండలంలోని ఒక గ్రామానికి చెందిన చిన్నారి రెండో తరగతి చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఆ బాలిక ఇంటి వద్దే ఉంది. తల్లిదండ్రులు పొలం పనుల నిమిత్తం వెళ్లారు. అదే గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి చిన్నారి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఆమె వద్దని ఎంత వారించిన వినకుండా నిందితుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ చిన్నారి వెక్కివెక్కి ఏడ్చింది. నొప్పితో బాధపడుతూ విలపించింది. తల్లిదండ్రులు పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరకున్నారు. అప్పటికి చిన్నారి మొహంలో కలతను గ్రహించిన వారు ఏం జరిగిందని ఆరా తీశారు. అప్పుడు చిన్నారి జరిగిన విషయం మొత్తం తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. దీనిపై స్పందించిన ఎస్ఐ శ్రీకాంత్.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామని, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నెల్లూరులో..
నెల్లూరులో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. బాధితరాలి తండ్రి చెప్పిన వివరాల ప్రకారం.. నెల్లూరు రూరల్ మండలం పరిధిలోని ఓ ఆసుపత్రి వెనక ప్రాంతంలో పదో తరగతి చదివే బాలికపై.. అదే ప్రాంతానికి చెందిన బేల్దారి పెంచలయ్య పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ చర్యకు ఒడిగట్టాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
అయితే.. ఈ కేసులో ఏ2, ఏ3గా నిందితుడి తల్లిదండ్రులు ఉన్నారు. నెల్లూరు రూరల్ పోలీసులు బాధితురాలి తండ్రిని పిలిపించి, కేసులో వారు లేకుండా చూడాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీనికి ఆయన అంగీకరించలేదు. నిందితుడి తండ్రి ఆరోగ్యం సరిగా లేదని, అతని పేరు తీసేయాలని కోరారు. అందుకు అంగీకరించారు. ఈ క్రమంలోనే నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఏ2గా ఉన్న తల్లిని ఇంకా అరెస్టు చేయలేదు. దీనిపై స్పందించిన నెల్లూరు రూరల్ ఇన్‌స్పెక్టర్ జి.వేణు.. ఆమెను కూడా త్వరలో అరెస్టు చేస్తామని అన్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)