Dharani Portal : ధరణి సమస్యల పరిష్కారానికి డీసెంట్రలైజేషన్, త్వరలో 1000 సర్వేయర్ పోస్టులు భర్తీ - మంత్రి పొంగులేటి
Dharani Portal : ధరణి పోర్టల్ బాధ్యతలు ఎన్ఐసీకి అప్పగించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిపుణుల కమిటీ రిపోర్టు ఆధారంగా ధరణిని ప్రక్షాళన చేస్తామన్నారు. అలాగే ధరణి అప్లికేషన్ పరిష్కారానికి డీసెంట్రలైజేషన్ అమలుచేస్తామన్నారు. 2024 ఆర్వోఆర్ చట్టాన్ని తెస్తున్నట్లు తెలిపారు.
ధరణి పోర్టల్ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీకి అప్పగించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిపుణుల కమిటీ రిపోర్టు ఆధారంగా ధరణి పోర్టల్ ను ఎలా ప్రక్షాళన చేయాలని చూస్తున్నామన్నారు. ప్రజలకు మంచి జరిగేలా ధరణి పోర్టల్ లో మార్పులు చేస్తామన్నారు. ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. 2020 ఆర్‌వోఆర్ చట్టంలో లోపాలు సరిచేసి 2024 ఆర్‌వోఆర్ చట్టం తెస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని 18 ఆర్వోఆర్ చట్టాలను అధ్యయనం చేసి కొత్త చట్టం డ్రాఫ్ట్ తయారుచేశామన్నారు. కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని 9వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదిస్తామన్నారు. ధరణి కొత్త యాప్, కొత్త చట్టం సామాన్యులకు చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్‌వో వ్యవస్థను రాత్రికి రాత్రే రద్దు చేసిందన్నారు. అయితే రెవెన్యూ గ్రామాలకు ఒక అధికారి ఉండాలనేది స్థానికులు అభిప్రాయం అన్నారు.
ధరణి అప్లికేషన్ల పరిష్కారానికి డీసెంట్రలైజేషన్
"ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ధరణి పోర్టల్ పై ఫిర్యాదులు వచ్చేవి. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెవెన్యూ అధికారులు, నిపుణులతో ధరణిపై కమిటీ వేశాము. కమిటీ రిపోర్టు ఆధారంగా ధరణి పోర్టల్ ను ఎలా ప్రక్షాళన చేయాలి. ఎలా చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో చర్చించి దశల వారీగా అమలు చేస్తున్నాము. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ధరణిలో సీక్రెట్ లేకుండా అందరూ వివరాలు తెలుసుకునే విధంగా మార్చాము. ధరణి ఫిర్యాదులను రిజెక్ట్ చేస్తే అందుకు పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించాను. అలాగే ధరణిపై వచ్చిన 2.45 లక్షల ఫిర్యాదులను కేవలం కలెక్టర్ క్లియరెన్స్ మాత్రమే కాకుండా వివిధ దశలుగా డీసెంట్రలైజేషన్ చేశాము. ఎమ్మార్వో, ఆర్డీవో, స్పెషల్ కలెక్టర్(రెవెన్యూ), కలెక్టర్, సీసీఐ...ఇలా 5 దశల్లో ఫిర్యాదు అప్లికేషన్లను పరిష్కరిస్తారు. డిసెంబర్ 1 నుంచి ధరణి పోర్టల్ బాధ్యతలను ఎన్ఐసీకి అప్పగించాం. ధరణిలో గతంలో 33 మాడ్యూల్ ఉండేవి. సామాన్యులకు ఈ మాడ్యూల్స్ అర్థం అయ్యేవి కాదు. ప్రజలు పొరపాటున ఒక మాడ్యూల్ బదులుగా మరో మాడ్యూల్ అప్లై చేస్తే అధికారులు రిజెక్ట్ చేసేవారు. ఈ సమస్యకు పరిష్కారం తీసుకోస్తున్నాం"- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
త్వరలో 1000 సర్వేయర్ పోస్టులు
గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్...25 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చిందని మంత్రి పొంగులేటి తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014-2023 మధ్య కాలంలో కేవలం 1.52 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మాత్రమే టెండర్లు పిలిచారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ చేసి చూపిందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంపైనా బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూర్చొని కబుర్లు చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో సర్వే వ్యవస్థను కూడా పటిష్ఠం చేస్తామన్నారు. ఇందుకు 1000 సర్వేయర్ల పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
సంబంధిత కథనం