VZRM Accident: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు స్పాట్ డెడ్...తిరుపతి వెళ్లి వస్తుండగా ప్రమాదం
VZRM Accident: విజయ నగరంలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
VZRM Accident: విజయనగరంలో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు
ఈ ఘటన విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని మోద వలస వద్ద విశాఖపట్నం-విజయనగరం జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. విజయనగరంలోని ఇప్పిలి వీధికి చెందిన నమ్మి మనోజ్, విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలంలోని ఆర్.తాళ్ల వలస గ్రామానికి చెందిన అలమండ శ్యాం ప్రసాద్ బంధువులు.
వీరు తిరుపతి వెళ్లి తిరిగి కారులో వస్తున్నారు. విశాఖపట్నం పైపు నుంచి విజయనగరం వైపు వస్తున్న వీరు కారు మోదవలస వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది.
దీంతో కారులో ఉన్న నమ్మి మనోజ్ కుమార్ (30), అలమండ శ్యామ్ ప్రసాద్ (31)లు తీవ్రంగా గాయాలతో కారులో ఇరుక్కుపోయి మరణించారు. పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ ఏ.సన్యాసినాయుడు ఆధ్వర్యంలోని పోలీసు సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం వాటిని పోస్టుమార్ట్ నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఏ.సన్యాసినాయుడు తెలిపారు. నమ్మి మనోజ్ కుమార్‌కు ఏడాది క్రితమే వివాహం అయింది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు రోదనలు మిన్నంటాయి. వీరి మరణంతో విజయనగరంలోని ఇప్పిలి వీధిలోనూ, విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలంలోని ఆర్.తాళ్ల వలస గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆర్టీసీ బస్సును సిమెంట్ లారీ ఢీ...30 మందికి గాయాలు
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును సిమెంట్ లారీ ఢీకొట్టడంతో 30 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నారాయణపురం పోలీస్ చెక్‌పోస్టు వద్ద కర్నూలు-చిత్తూరు 40 నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. వేలూరు నుంచి హైదరాబాద్ వెపు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును కడప నుంచి రాయచోటి వైపు వెళ్తున్న సిమెంట్ లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది.
ఈ రోడ్డు ప్రమాదంలో 30 మందికి గాయాలు అయ్యాయి. గాయాలు పాలైన క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న రామాపురం ఎస్ఐ, తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వారిని కడప రిమ్స్‌కు, స్వల్పంగా గాయపడిన వారిని రాయచోటి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.
రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సు, లారీ పడిపోవడంతో కడప-రాయచోటి మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు జెసీబీల సహాయంతో వాటిని రహదారి నుంచి పక్కకు నెట్టారు. అయితే ఎటువంటి మరణాలు సంభవించలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)