New Year Celebration 2025 : హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. 13 ముఖ్యమైన అంశాలు
New Year Celebration 2025 : కొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రానుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం చాలా మంది ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నారు. రిసార్టులు, హోటళ్లు, పబ్బులు, వ్యాపార సంస్థలు వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పలు నిబంధనలు విధించారు.
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఈవెంట్స్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. వేడుకల్లో అశ్లీల నృత్యాలపై నిషేధం విధించారు. ఔట్‌డోర్‌లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్ చేశారు. పబ్‌లు, బార్లలో మైనర్లకు అనుమతి లేదని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.
పార్టీల్లో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. హైదరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. తాగి వాహనం నడిపితే 10 వేలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. మైనర్లు వాహనం నడిపితే యజమానిపైనా కేసు నమోదు చేస్తామన్న పోలీసులు.. ర్యాష్ డ్రైవింగ్‌పై వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే.. చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఇవీ నిబంధనలు..
1.హోటల్స్, పబ్, క్లబ్ నిర్వాహకులు తప్పనిసరిగా వేడుకల కోసం అనుమతులు తీసుకోవాలి.
2.ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్స్, పార్కింగ్ పాయింట్లలో సీసీ టీవీ కెమెరాలు అమర్చాలి.
3.పరిమితికి మించి పాసెస్, టికెట్స్, కూపన్స్ ఇవ్వొద్దు. మైనర్స్‌కు పార్టీల్లో అనుయమతి లేదు.
4.మ్యూజికల్ ఈవెంట్స్ ఇండోర్‌లో మాత్రమే జరుపుకోవాలి.
5.సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ మానిటరింగ్ చేయాలి.
6.రాత్రి 10 గంటల వరకు మ్యూజిక్ నిలిపివేయాలి.
7.సౌండ్ పొల్యూషన్ 45 డెసిబుల్స్‌కి మించి ఉండొద్దు.
8.అసభ్యకర డ్యాన్సులకు, డ్రెస్సింగ్‌ను అనుమతించరాదు.
9.డ్రగ్స్, మత్తు పదార్థాల యాక్టివిటీ చేసే నిర్వాహకులపై చర్యలు తప్పవు.
10.ఈవెంట్స్ పరిసర ప్రాంతాల్లో స్థానిక పోలీసులు, షీ టీమ్స్ నిఘా పెడతాయి. మహిళలను వేధించే వారిని స్పాట్‌లోనే అరెస్ట్ చేస్తాం
11.వెహికల్ మూవ్‌మెంట్, పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
12.డ్రంకెన్ కండిషన్‌లో ఉన్న వారు వెహికల్ డ్రైవ్ చేయకూడదనే సైన్ బోర్డులు పెట్టాలి.
13.డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడే వారికి రూ.10,000 ఫైన్ లేదా 6 నెలల జైలు శిక్ష విధిస్తాం. లైసెన్స్ 3 నెలలు గరిష్టంగా, పర్మినెంట్‌గా రద్దు చేస్తాం.