Medaram : మేడారం ఆలయాలకు మహర్దశ.. భారీగా నిధులు కేటాయింపు.. త్వరలో పనులు ప్రారంభం
Medaram : ఎన్నో ప్రత్యేకతలు కలిగిన వన దేవతల క్షేత్రం మేడారం. రెండేళ్లకోసారి జరిగే మహా జాతరతో వనం కిక్కిరిసిపోతుంది. ఇటీవల నిత్యం వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడారం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆలయాల పునర్నిర్మాణానికి పూనుకుంది.
మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయాల పునర్నిర్మాణానికి టెండరు ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. 2026లో జరిగే మహాజాతర నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులు పట్టుదలగా ఉన్నారు. ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1.92 కోట్లు మంజూరు చేసింది. దీంతో పనులు వేగంగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు.
1971లో దేవాదాయశాఖ వనదేవతలిద్దరికీ ఆలయాలు నిర్మించింది. అవి చిన్నగా ఉండటం, ప్రస్తుతం భక్తుల రాక పెరగడంతో పూజా కార్యక్రమాలకు ఇబ్బందిగా మారింది. దీంతో నూతన నిర్మాణాలు చేపట్టాలని పూజారులు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. దీనిపై దృష్టిసారించిన దేవాదాయశాఖ.. ఈ ఏడాది మహాజాతర ముగిసిన తర్వాత మార్చిలో ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
ఈ నేపథ్యంలో.. నవంబరులో రూ.1.92 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. ఈ నెల 12న టెండరు ప్రక్రియ ముగిసింది. త్వరలోనే పనులు ప్రారంభించి మహాజాతర కంటే ముందే నిర్మాణం పూర్తి చేస్తామని.. మేడారం ఆలయ కార్యనిర్వహణాధికారి స్పష్టం చేశారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర.. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. రెండేళ్లకోసారి జరిగే ఈ వనదేవతల జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. గతంలో కేవలం జాతర సమయంలోనే భక్తులు వచ్చేవారు. కానీ ఇప్పుడు నిత్యం వేల మంది అమ్మవార్ల దర్శనం కోసం వస్తున్నారు.
మాస్టర్ ప్లాన్..
మేడారంలోని దేవతల గద్దెల ప్రాంగణం విస్తరణకు మాస్టర్ ప్లాన్ రూపొందనుంది. నాలుగు దశాబ్దాల కిందట దాతలు నిర్మించిన గద్దెల ప్రాంగణమే ఇప్పటికీ అందుబాటులో ఉంది. జాతరకు ముందు అప్పుడప్పుడు మార్పులు, చేర్పులు చేస్తున్నారు. కానీ శాశ్వతంగా అభివృద్ధి చేయడం లేదు. గద్దెల ప్రాంగణం వద్ద ఎలాంటి మార్పులు చేయకపోవడంతో.. జాతర సమయంలో భక్తుల నియంత్రణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటికే మేడారం వెళ్లే రహదారుల అభివృద్ధికి రూ.17.50 కోట్లు, గెస్ట్ హౌస్‌ల నిర్మాణాలకు రూ.3.50 కోట్లు మంజూరు చేసి.. పనులు చేపట్టారు. తాజాగా.. వనదేవతల గద్దెల ప్రాంగణంలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందినట్లు అధికారులు చెబుతున్నారు. సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొనేందుకు పస్రా, చింతల్, కొండాయి, తాడ్వాయి మీదుగా మేడారంలో ప్రవేశించి.. గద్దెల ప్రాంగణానికి చేరుకొనేందుకు వీలుగా రోడ్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.
అమ్మవార్ల గద్దెల ప్రాంగణానికి చేరుకున్న తర్వాత.. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విశ్రాంతి, ప్రశాంత దర్శనం రెండో ప్రాధాన్యతగా పనులు చేపట్టనున్నారు. దాదాపు ఎకరం స్థలంలో దేవతల గద్దెలు, ప్రాంగణం ఉంది. దీంతో భక్తుల దర్శనానికి గంటలకొద్దీ సమయం పడుతోంది. రాబోయే రోజుల్లో అన్నిరకాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. అయితే.. హడావుడిగా కాకుండా ప్రణాళికబద్ధంగా నిర్మించేందుకు మాస్టర్‌ప్లాన్ సిద్ధమవుతోంది.