TTD : ఇకపై ఆ దాతలకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం... బహుమానంగా బంగారం, వెండి కాయిన్స్ - టీటీడీ తాజా నిర్ణయాలు-ttd board has decided to give vip break darshan to the donors who have donated to the ananda nilayam ananta swarnamayam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd : ఇకపై ఆ దాతలకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం... బహుమానంగా బంగారం, వెండి కాయిన్స్ - టీటీడీ తాజా నిర్ణయాలు

TTD : ఇకపై ఆ దాతలకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం... బహుమానంగా బంగారం, వెండి కాయిన్స్ - టీటీడీ తాజా నిర్ణయాలు

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన సౌకర్యాల వివరాలు వెల్లడించింది.

టీటీడీ బోర్డు కీలక నిర్ణయం

ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలను కల్పించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది.

2008లో టీటీడీ సంకల్పించిన ఈ పథకాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు అర్చనానంతర దర్శన సేవ లేకపోవడంతో ప్రస్తుత ధర్మకర్తల మండలి ఈ పథకం దాతలకు ప్రత్యామ్నాయంగా వీఐపీ బ్రేక్ (జనరల్)దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది.

సవరించిన సౌకర్యాల వివరాలు:

  • ⁠అర్చనానంతర దర్శనానికి బదులుగా గరిష్టంగా 5 మంది కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 3 రోజులు వీఐపీ బ్రేక్ (జనరల్)దర్శనాలకు అనుమతిస్తారు.
  • ⁠రూ.2,500 టారిఫ్‌లో సంవత్సరానికి 3 రోజులు వసతి కల్పిస్తారు.
  • ⁠సంవత్సరానికి ఒకసారి 20 చిన్న లడ్డూలు ప్రసాదంగా అందిస్తారు.
  • ⁠ ⁠దాతల దర్శన సమయంలో సంవత్సరానికి ఒకసారి బహుమానంగా ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ బహుమానంగా అందిస్తారు.
  • ⁠ ⁠దాతల మొదటిసారి దర్శన సమయంలో 5 గ్రాముల బంగారు డాలర్, 50-గ్రాముల వెండి నాణెం బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది.
  • ⁠సంవత్సరానికి ఒకసారి పది మహాప్రసాదం ప్యాకెట్లు అందిస్తారు.
  • ⁠ ⁠విరాళం పాస్‌బుక్ జారీ చేసిన తేదీ నుండి 25 సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది.

ముగిసిన బ్రహ్మోత్సవాలు:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. శనివారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం నేత్ర పర్వంగా జరిగింది.

ఇందులో భాగంగా శనివారం ఉదయం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు చందనంతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు.

పుష్ప‌యాగం సందర్భంగా టీటీడీ ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన 4 టన్నుల పుష్పాలు అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఇందులో 2 టన్నులు తమిళనాడు, ఒక టన్ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒక టన్ను కర్ణాటక రాష్ట్రాల నుండి దాతలు అందించారు.

మధ్యాహ్నం 1.30 గంటలకు ఆస్థానమండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు, భక్తులు ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకెళ్లారు.

సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేదపారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి, సెంటు జాజులు, ప‌గ‌డ‌పు పూలు వంటి 14 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు.

సంబంధిత కథనం