Telangana Weather : తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. 3 రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీ!-yellow alert issued for 3 days as temperatures drop sharply in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Weather : తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. 3 రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీ!

Telangana Weather : తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. 3 రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీ!

Basani Shiva Kumar HT Telugu
Dec 16, 2024 09:46 AM IST

Telangana Weather : చలితో తెలంగాణ గజగజ వణికిపోతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజుల పాటు పరిస్థితి ఇలానే ఉండోచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. సాధారణం కంటే దాదాపు 8 డిగ్రీల తక్కువ ఉష్టోగ్రతలు వమోదవుతున్నాయి. దీంతో ఉదయం 9 లోపు, సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. మరో మూడు రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉండోచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

శనివారం రాత్రి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో సాధారణం కంటే 8.1 డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయి 4.7 డిగ్రీలు నమోదైంది. అన్ని జిల్లాల్లో 2 నుంచి 8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కుమురం భీం, ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సిద్దిపేట, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి జిల్లాల్లో 10 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి.

జిల్లాల్లో..

ఆదిలాబాద్‌ జిల్లా బేలాలో 6.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పోచరలో 6.4, జైనథ్‌‌లో 6.5, అర్లి(టి)లో 6.6, చాప్రాల్‌ 6.6, సంగారెడ్డి జిల్లా సత్వార్‌ 6.6, వికారాబాద్ జిల్లా బంట్వారంలో 6.7, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌‌లో 6.7, రంగారెడ్డి జిల్లా ఎలిమినేడులో 6.7, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌‌లో 6.7, రంగారెడ్డి జిల్లా చందనవల్లిలో 6.7, సంగారెడ్డి జిల్లా కోహిర్‌‌లో 6.7, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 6.8, డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

హైదరాబాద్‌లో..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోనూ చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. పలు ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. మౌలాలి, హెచ్‌సీయూ ప్రాంతాల్లో అత్యల్పంగా 7.1 డిగ్రీలు, బీహెచ్‌ఈఎల్‌లో 7.4, రాజేంద్రనగర్‌లో 8.2 డిగ్రీలు, గచ్చిబౌలి 9.3, వెస్ట్‌ మారేడ్‌పల్లిలో 9.9, కుత్బుల్లాపూర్‌ 10.2, మచ్చబొల్లారంలో 10.2, శివరాంపల్లిలో 10.3, జీడిమెట్ల 11.4, బాలానగర్‌ 11.5, పటాన్‌చెరు 11.7, షాపూర్‌ నగర్‌ 11.7, లింగంపల్లి 11.8, బోయిన్‌పల్లి 11.9, బేగంపేట 12, ఆసిఫ్‌నగర్‌ 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

పిల్లలు జాగ్రత్త..

చల్లటి వాతావరణం ఉండే శీతాకాలంలో ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పిల్లలపై వీటి ప్రభావం ఎక్కువగా పడే అవకాశం అధికం. ఈ కాలంలో చిన్నారులకు జలుబు, దగ్గు, జర్వం లాంటివి వచ్చే రిస్క్ ఎక్కువా ఉంటుంది. అందుకే పిల్లలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా చలికాలంలో పెద్దలు వారి పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించకూడదు.

Whats_app_banner