Huzurabad Schoolbus: హుజురాబాద్ లో స్కూల్ బస్సు దగ్దం...తృటిలో తప్పిన పెను ప్రమాదం
Huzurabad Schoolbus: కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో స్కూల్ బస్సు దగ్ధమైంది. ప్రైవేటు స్కూల్ వద్ద పార్కింగ్ చేసిన బస్సు కాలి బూడిద అయింది. ఆదివారం సెలవు కావడంతో బస్సు ఉన్న ప్రాంతంలో పిల్లలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Huzurabad Schoolbus: వందలాది మంది పిల్లలు... నిత్యం రద్దీగా ఉండే మాంటిస్సోరీ ప్రైవేట్ పాఠశాల. ఆదివారం సెలవు కావడంతో పిల్లలు ఎవరు లేరు. కానీ అనూహ్యంగా స్కూల్ ఆవరణలో పార్కింగ్ చేసిన బస్సులో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పేలోగా బస్సు కాలిపోయింది. ఆ సమయంలో పిల్లలు లేకపోవడం తృటిలో పెను ప్రమాదం తప్పింది. చుట్టుపక్కల ఇళ్ళకు, మిగతా బస్సులకు మంటలు విస్తరించకుండా స్థానికులు ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టారు. మంటలు అదుపులోకి రావడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
నిప్పంటించింది బాలుడేనా ?
అగ్ని ప్రమాదంతో బస్సు కాలిపోవడానికి అదే పాఠశాలకు చెందిన బాలుడు కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అగ్ని ప్రమాదానికి ముందు ఓ బాలుడు బస్సులోకి వెళ్ళాడు. కాసేపటికి బస్సు దిగి పరుగెత్తాడు. ఆ విజువల్స్ సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ బాలుడు బస్సు ఎక్కి దిగి వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే మంటలు చెల్లరేగాయి. అంటే ఆ బాలుడు బస్సెక్కి నిప్పంటించి పారిపోయాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ బాలుడు గురించి ఆరా తీయగా అదే పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న బాలుడని గుర్తించారు. ఆ బాలుడే నిప్పు బస్సుకు నిప్పు పెట్టినట్లు భావిస్తు విచారణ చేపట్టారు.
బస్సు దగ్దం కలకలం..
ప్రైవేట్ స్కూల్ బస్సు దగ్ధం కావడం కలకలం సృష్టించింది. పేరెన్నిక గల స్కూల్లో బస్సు పార్కింగ్ ప్రదేశంలో దగ్ధం కావడం హాట్ టాపిక్ గా మారింది. సిసి కెమెరా లేకుంటే కావాలనే ఎవరైనా దగ్ధం చేశారా? లేక కుట్ర కోణంతో నిప్పు పెట్టారా అనే అనుమానాలు వ్యక్తం అయ్యేది. ప్రస్తుతం సిసి కెమెరా ఫుటేజీలో ఓ బాలుడు బస్సు ఎక్కడం కాసేపటికి బస్సు దిగి పరుగెత్తడంతో ఆ బాలుడే నిప్పు పెట్టాడని భావిస్తున్నారు.
చదువు అంటే భయంతోనో లేక టీచర్ లపై కోపంతోనో నిప్పంటించి ఉంటాడని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఆదివారం సెలవు దినం కావడంతో పిల్లలు లేని సమయంలో బస్సు దగ్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు బస్సు దగ్ధం పై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)