Manchu Family Issue : విష్ణు టీమ్ మా ఇంటి జనరేటర్లలో షుగర్ పోశారు, భయంతో బతుకుతున్నాం- మంచు మనోజ్-manchu family problem manoj allegations on vishu team put sugar in generators ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Manchu Family Issue : విష్ణు టీమ్ మా ఇంటి జనరేటర్లలో షుగర్ పోశారు, భయంతో బతుకుతున్నాం- మంచు మనోజ్

Manchu Family Issue : విష్ణు టీమ్ మా ఇంటి జనరేటర్లలో షుగర్ పోశారు, భయంతో బతుకుతున్నాం- మంచు మనోజ్

Bandaru Satyaprasad HT Telugu
Dec 15, 2024 07:46 PM IST

Manchu Family Issue : మంచు కుటుంబ వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంపై మంచు మనోజ్ మరో సంచలన ఆరోపణ చేశారు. విష్ణు టీమ్ తో తన ఇంటికి వచ్చి జనరేటర్ లో పంచదార పోశారని ఆరోపించారు. దీంతో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు.

విష్ణు టీమ్ మా ఇంటి జనరేటర్లలో షుగర్ పోశారు, భయంతో బతుకుతున్నాం- మంచు మనోజ్ సంచలన ఆరోపణలు
విష్ణు టీమ్ మా ఇంటి జనరేటర్లలో షుగర్ పోశారు, భయంతో బతుకుతున్నాం- మంచు మనోజ్ సంచలన ఆరోపణలు

Manchu Family Issue : మంచు కుటుంబ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. మంచు ఫ్యామిలీలో మరో వివాదం తెరపైకి వచ్చింది. శనివారం తన కుటుంబంలో జరిగిన మరో ఘటన గురించి మనోజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మంచు విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్‌లో పంచదార పోయించి, విద్యుత్తు సరఫరా నిలిపివేశారని ఆరోపించారు.

"నిన్న నేను సినిమా షూటింగ్ లో ఉన్నాను. నా సతీమణి కుమారుడి స్కూల్‌లో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సమయంలో మా అమ్మకు బర్త్ డే కేకు ఇచ్చే నెపంతో నా సోదరుడు విష్ణు తన అనుచరులు రాజ్‌ కొండూరు, కిరణ్‌, విజయ్‌ రెడ్డిలతో పాటు కొందరు బౌన్సర్లతో నా ఇంటికి వచ్చాడు. జనరేటర్లలో పంచదార పోయించాడు. దీంతో మేము రాత్రంతా ఇబ్బంది పడ్డాం. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తీవ్ర ఆందోళనకు గురయ్యాం. ఇంట్లో మా అమ్మ, తొమ్మిది నెలల కుమార్తె, కుమారుడు, అత్తమామలు ఉన్నారు. జనరేటర్ లో షుగర్ వేయడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. జనరేటర్లకు సమీపంలో వాహనాలు, గ్యాస్‌ కనెక్షన్‌ ఉంది. విష్ణు బృందం ఇంటి నుంచి వెళ్తూ తన ఇంటి వద్ద పనిచేసే వారిని అక్కడి నుంచి పంపించేశారు. నా దంగల్‌ కోచ్‌ను బెదిరించారు. అమ్మ పుట్టినరోజున ఇలా జరగడం నన్ను ఎంతో కలచివేసింది. నేను, నా కుటుంబం ఎంతో భయంతో బతుకుతున్నాం. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాను" అని మంచు మనోజ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మోహన్ బాబు క్షమాపణలు

హైదరాబాద్ జల్ పల్లిలోని తన ఇంటి వద్ద మీడియాపై దాడి ఘటనపై సినీ నటుడు మోహన్ బాబు మరోసారి క్షమాపణలు చెప్పారు. ఆదివారం సాయంత్రం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టును మంచు మోహన్ బాబు, మంచు విష్ణు పరామర్శించారు. జర్నలిస్టు కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని వివరణ ఇచ్చారు.

ఇటీవల మంచు కుటుంబంలో వివాదం నెలకొంది. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య మనస్పర్థలు తలెత్తి రోడ్డుకెక్కారు. జల్‌పల్లిలో నటుడు మోహన్‌బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంచు మనోజ్ మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ గేట్లు తీయలేదు. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన మంచు మనోజ్ గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లారు. తనతో పాటు అక్కడున్న మీడియాను ఇంట్లోకి తీసుకెళ్లారు. తన ఇంట్లోకి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న మీడియా ప్రతినిధుల చేతిలోంచి మైకు లాక్కొని వారిపై దాడి చేశారు. ఈ దాడిలో టీవీ9, టీవీ5 ప్రతినిధులకు గాయాలయ్యాయి.

Whats_app_banner

సంబంధిత కథనం