Mohan Babu apologizes to journalist: ఆసుపత్రికి వెళ్లి జర్నలిస్ట్‌కి క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు.. వెంట విష్ణు కూడా
Mohan Babu apologizes to journalist: జర్నలిస్ట్‌పై మైక్‌తో దాడి చేసిన మోహన్ బాబు.. ఎట్టకేలకి ఐదు రోజుల తర్వాత బహిరంగ క్షమాపణలు చెప్పారు. అలానే జర్నలిస్ట్ సంఘాలకి కూడా క్షమాపణలు చెప్పారు.
సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఎట్టకేలకు జర్నలిస్ట్ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. గత మంగళవారం జల్‌పల్లిలో మంచు మనోజ్ వెంట మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లిన జర్నలిస్ట్ రంజిత్.. ఇష్యూపై మోహన్ బాబు స్పందన తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కానీ.. మోహన్ బాబు క్షణికావేశంలో జర్నలిస్ట్ వద్ద నుంచి మైక్ అందుకుని అతడిపై దాడి చేశారు. దాంతో.. గాయాలతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో జర్నలిస్ట్ చికిత్స పొందుతున్నారు.
ఐదు రోజుల తర్వాత
మోహన్ బాబు చర్యని ఖండిస్తూ జర్నలిస్ట్ సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ.. నిరసనలు తెలియజేశాయి. మోహన్ బాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. మరోవైపు మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకి హాజరవుకుండా మోహన్ బాబు కాలయాపన చేస్తున్నారు. అయితే.. ఐదు రోజుల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకి మోహన్ బాబు దిగొచ్చారు.
జర్నలిస్ట్ సంఘాలకి క్షమాపణలు
యశోద ఆసుపత్రికి ఆదివారం వెళ్లిన మోహన్ బాబు.. జర్నలిస్ట్ రంజిత్‌ను పరామర్శించి క్షమాపణలు చెప్పారు. అక్కడే ఉన్న అతని కుటుంబ సభ్యులకి కూడా క్షమాపణలు చెప్పి.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇదే క్రమంలో దాడిపై జర్నలిస్ట్ సంఘాలకి కూడా క్షమాపణలు చెప్పాలని జర్నలిస్ట్ కోరడంతో.. మోహన్ బాబు బహిరంగ క్షమాపణలు కోరారు. మోహన్ బాబు వెంట ఆసుపత్రికి మంచు విష్ణు కూడా వెళ్లారు.
ముందస్తు బెయిల్.. చుక్కెదురు
హత్యాయత్నం కావడంతో.. మోహన్ బాబుని పోలీసులు ముందస్తు నోటీసు ఇవ్వకుండానే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దాంతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా.. అతనికి నిరాశే ఎదురైంది. రెండు రోజుల నుంచి మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నారని వార్తలు రాగా.. లేదు ఇంట్లోనే ఉన్నానని సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. అయితే.. పోలీసుల విచారణకి మాత్రం హాజరుకాలేదు. అలానే తన వద్ద ఉన్న గన్‌ను కూడా పోలీసులకి సబ్‌మిట్ చేయలేదు. దాంతో.. మోహన్ బాబుని సోమవారం పోలీసులు విచారణకి పిలిచే అవకాశం ఉంది.