Madugula Halwa : ఫస్ట్ నైట్ స్పెషల్ స్వీట్ 'మాడుగుల హల్వా'-అంత స్పెషల్ ఎందుకంటే?-madugula halwa first night special sweet people believe improve stamina ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Madugula Halwa : ఫస్ట్ నైట్ స్పెషల్ స్వీట్ 'మాడుగుల హల్వా'-అంత స్పెషల్ ఎందుకంటే?

Madugula Halwa : ఫస్ట్ నైట్ స్పెషల్ స్వీట్ 'మాడుగుల హల్వా'-అంత స్పెషల్ ఎందుకంటే?

Bandaru Satyaprasad HT Telugu
Dec 15, 2024 05:35 PM IST

Madugula Halwa : శోభనం స్పెషల్ స్వీట్ మాడుగుల హల్వాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ హల్వా తింటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని నమ్ముకుంటారు. అసలు మాడుగుల హల్వాకు ఆ రుచి ఎలా వచ్చిందంటే?

ఫస్ట్ నైట్ స్పెషల్ స్వీట్ 'మాడుగుల హల్వా'-అంత స్పెషల్ ఎందుకంటే?
ఫస్ట్ నైట్ స్పెషల్ స్వీట్ 'మాడుగుల హల్వా'-అంత స్పెషల్ ఎందుకంటే?

Madugula Halwa : మాడుగుల హల్వాకు శోభనం స్పెషల్ స్వీట్ అని ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏపీలోని విశాఖ జిల్లా మాడుగుల అనే చిన్న పట్టణంలో తయారు చేసే ఈ హల్వాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. మాడుగుల హల్వా తయారీ మొదలై దాదాపు 150 ఏళ్లు దాటుతున్నా దీని క్రేజ్ నేటికీ తగ్గలేదు. ఈ హల్వా కారణంగా మాడుగుల పర్యాటక కేంద్రంగా మారింది. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం మాడుగుల హల్వాకు అభిమానులే. విశాఖ వచ్చిన ప్రముఖులెవ్వరైనా మాడుగుల హల్వాను రుచి చూడకుండా వెళ్లరు.

శతాబ్దంన్నర చరిత్ర

మాడుగుల పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది రుచికరమైన హల్వా. 1890లో ఓ సాధారణ స్వీట్ గా దీనిని తయారుచేశారు. మాడుగుల నుంచి 25కి పైగా దేశాలకు హల్వా ఎగుమతి అవుతుంది. మాడుగులకు చెందిన ఓ మిఠాయి వ్యాపారి దంగేటి ధర్మారావు... ఈ హల్వాను ఒక సాధారణ స్వీట్ గా మాత్రమే తయారు చేశారు. ఏదైనా కొత్తగా తయారు చేయాలనే ఉద్దేశంతో...బూడిద గుమ్మడికాయం, కర్బూజ, కొబ్బరికాయల బదులు... గోధుమ పాలు, ఆవు నెయ్యి, జీడిపప్పు, చక్కెరతో హల్వా తయారు చేశారు. దీంతో హల్వా రుచి బాగా వచ్చింది. దీంతో అమ్మకాలు పెరిగాయి. అతి తక్కువ కాలంలోనే మాడుగుల హల్వా పేరు ఊరువాడా దాటి జిల్లా స్థాయికు చేరుకుంది. అనంతరం దంగేటి కుటుంబం మాడుగుల హల్వా రుచిని విదేశాలకు పరిచయం చేశారు.

తయారీకి నాలుగు రోజులు

మాడుగుల హల్వా తయారీకి నాలుగు రోజుల సమయం పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. మేలు రకం గోధుమలు మూడు రోజులు నానబెట్టి రోటిలో రుబ్బి గోధుమ పాలు తీస్తారు. గోధుమ పాలను ఒక రోజు పులియబెట్టి, ఆవు నెయ్యి, పంచదార కలిపి దగ్గరకు వచ్చేలా ఇగిర్చి ఇనుప కళాయిలో తిప్పుతారు. ఈ పాకం రుచి కోసం జీడిపప్పు, బాదం పప్పు జోడిస్తారు. పాకం సరిగ్గా కుదిరేలా చేయడం, కట్టెలపైనే వండడం..అనుభవంతో కూడిన పని. అందుకే ఎంత మంది హల్వాలు తయారు చేసినా మాడుగుల హల్వా రుచికి సరితూగవంటారు దానిని రుచిచూసిన వాళ్లు. మాడుగుల హల్వా తయారీపై సుమారు 1500 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. మాడుగుల హల్వాకు డిమాండ్ పెరగడంతో ఊరిలో వ్యాపారాలు విస్తరించారు. ఆన్లైన్, కొరియర్, పార్సిల్ సర్వీసు ద్వారా కస్టమర్లకు హల్వా పంపిస్తారు. మంచి నాణ్యతతో కేజీ హల్వాను రూ. 350 నుంచి రూ.400 వరకు అందిస్తున్నారు.

లైంగిక సామర్థ్యం

మాడుగుల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టాణాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు నిత్యం ఆర్డర్స్ పై సప్లై చేస్తుంటారు. విదేశాలకు సైతం సప్లై చేస్తుంటామని నిర్వాహకులు చెబుతున్నారు. మాడుగుల హల్వాను తింటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అందుకే శోభనం నాడు స్పెషల్ స్వీట్ గా మాడుగుల హల్వాను పెడుతుంటారు. బాలింతలకు శక్తి కోసం కూడా మాడుగుల హల్వా ఇస్తారని వ్యాపారులు అంటున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం