Sweet potato Halwa: చిలగడ దుంపలతో స్వీట్ హల్వా రెసిపీ, చలికాలంలో తినాల్సిన వంటకం
Sweet potato Halwa: చలికాలంలో చిలగడ దుంపలు అధికంగా లభిస్తాయి. వీటితో చేసే స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. స్వీట్ పొటాలో హల్వా రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
హల్వా పేరు చెబితేనే నోరూరిపోతుంది. చలికాలంలో అధికంగా దొరికేవి చిలగడ దుంపలు. వీటితో చేసే హల్వా ఎంతో రుచిగా ఉంటుంది. స్వీట్ పొటాటోలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటితో అనేక రకాల స్వీట్లు తయారుచేయచ్చు. అలాంటి వాటిల్లో స్వీట్ పొటాటో హల్వా ఒకటి. దీన్ని చేయడం చాలా సులువు. చిలగడ దుంపలతో హల్వా రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
స్వీట్ పొటాలో హల్వా రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చిలగడ దుంపలు - అయిదు
బెల్లం తురుము - ఒక కప్పు
నెయ్యి - నాలుగు స్పూన్లు
యాలకుల పొడి - అర స్పూను
కుంకుమపువ్వు - నాలుగు రేకులు
జీడిపప్పు తరుగు - మూడు స్పూన్లు
బాదం తరుగు - మూడు స్పూన్లు
పాలు - ఒక కప్పు
చిలగడదుంప హల్వా రెసిపీ
- చలికాలంలో చిలగడ దుంపలు అధికంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
- చిలగడ దుంపలను నీటిలో వేసి ఉడికించి పైన పొట్టు తీయాలి.
- వాటిని ఒక గిన్నెలో వేసి చేత్తోనే మెత్తగా మెదుపుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
- అందులో జీడిపప్పు, కుంకుమపువ్వు వేసి వేయించాలి.
- వాటిలోనే మెత్తగా చేసిన చిలగడదుంపల పేస్టును వేసి కలుపుకోవాలి.
- ఇప్పుడు మరొక స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్లు వేసి వేడి చేయాలి.
- అందులో యాలకుల పొడి, బెల్లం తరుము వేసి సిరప్ లా తయారు చేసుకోవాలి.
- ఇప్పుడు చిలగడ దుంప మిశ్రమంలో పాలు వేసి బాగా కలపాలి.
- ఆ మిశ్రమం దగ్గరగా అయినప్పుడు బెల్లం మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
- ఈ మొత్తం మిశ్రమం అడుగంటకుండా గరిటెతో కలుపుతూనే ఉండాలి.
- అది హల్వాలాగా దగ్గరా అవుతున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి కాసేపు మూతపెట్టాలి. తరువాత స్టవ్ కట్టేయాలి.
- అంతే టేస్టీ స్వీట్ పొటాటో హల్వా రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడిగా తింటే రుచి అదిరిపోతుంది.
చిలగడ దుంపల ఉపయోగాలు
ఈ చిలగడ దుంపల హల్వా రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మనం బెల్లం వేసి వండాము కాబట్టి ఐరన్ పుష్కలంగా శరీరానికి అందుతుంది. స్వీట్ పొటాటోలు చలికాలంలోనే దొరుకుతాయి. ఇవి అనేక పోషకాలను శరీరానికి అందిస్తాయి. దీనిలో విటమిన్ బి6, ఫైబర్ నిండుగా ఉంటుంది. అలాగే విటమిన్ సి దీనిలో అధికంగా ఉంటుంది. చిలగడ దుంపలను తినడం వల్ల గుండె పోటు ప్రమాదం తగ్గుతుంది. ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని కూడా ఈ దుంపలు కాపాడతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు చిలగడదుంపలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
టాపిక్