Manchu Vishnu: మా నాన్న చేసిన తప్పు అదే.. రిపోర్టర్ అలా చేసేసరికి క్షణికావేశంలో దాడి చేశాడన్న మంచు విష్ణు-manchu vishnu breaks silence on conflicts with manchu manoj ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manchu Vishnu: మా నాన్న చేసిన తప్పు అదే.. రిపోర్టర్ అలా చేసేసరికి క్షణికావేశంలో దాడి చేశాడన్న మంచు విష్ణు

Manchu Vishnu: మా నాన్న చేసిన తప్పు అదే.. రిపోర్టర్ అలా చేసేసరికి క్షణికావేశంలో దాడి చేశాడన్న మంచు విష్ణు

Galeti Rajendra HT Telugu
Dec 11, 2024 02:35 PM IST

Manchu Manoj: మంచు మనోజ్ పేరుని కనీసం ప్రస్తావించని మంచు విష్ణు.. తన తండ్రి మంచు మోహన్ బాబు మాటే వేద వాక్కు అని క్లారిటీ ఇచ్చేశారు. తండ్రి ఏం చెప్తే అది చేస్తానని.. ఇష్యూలో జోక్యం చేసుకున్న బయటి వ్యక్తులకి సాయంత్రం వరకూ గడువు ఇస్తున్నట్లు హెచ్చరించారు.

మంచు విష్ణు (Photo: Twitter)
మంచు విష్ణు (Photo: Twitter)

మంచు ఫ్యామిలీలో గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది. మంగళవారం రాత్రి ఓ రిపోర్టర్‌పై మంచు మోహన్ బాబు దాడి చేయగా.. అతనికి గాయమైంది. అలానే గేట్లు తోసుకుంటూ మంచు మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లిన మంచు మనోజ్ చిరిగిన షర్ట్‌తో బయటికి వచ్చారు. ఆ తర్వాత అస్వస్థతతో మంచు మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో.. అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతూ ఉంది.

ప్రతి ఇంట్లో జరిగేదే.. సెన్సేషన్ చేయొద్దు

ఫ్యామిలీలో గొడవపై మంచు విష్ణు తొలిసారి స్పందించారు. మంచు మోహన్ బాబుతో పాటు కాంటినెంటల్‌ ఆసుపత్రికి వెళ్లిన మంచు విష్ణు.. బుధవారం అక్కడే మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రతి కుటుంబంలో ఇలాంటి గొడవలు ఉంటాయి. మా నాన్న చేసిన తప్పు.. మమ్మల్ని అతిగా ప్రేమించడమే. మాది ఉమ్మడి కుటుంబం.. అందరం కలిసే ఉంటామని భావించాం. కానీ బ్యాడ్‌లక్.. ఈ వివాదం మమ్మల్ని ఎంతో బాధిస్తోంది. వాస్తవానికి ప్రతి ఫ్యామిలీలోనూ ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి దయచేసి దీన్ని ఇక్కడితో వదిలేయండి.. సెన్సేషన్ చేయడానికి ప్రయత్నించొద్దు’’ అని మంచు విష్ణు కోరారు.

రిపోర్టర్‌పై అందుకే నాన్న దాడి

మంచు మనోజ్ గేట్లు తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లిన సమయంలో అతని వెంట వెళ్లిన రిపోర్టర్‌పై మంచు మోహన్ బాబు దాడి చేయడంపై కూడా మంచు విష్ణు స్పందించారు. ‘‘మంగళవారం రాత్రి జరిగిన గొడవలో ఒక రిపోర్టర్‌కి గాయాలయ్యాయి. మేము ఉద్దేశపూర్వకంగా ఎవరినీ బాధ పెట్టాలని అనుకోలేదు. వాస్తవానికి మీడియా సభ్యులను చూసిన తర్వాత నాన్న గారు నమస్కారం చేసుకుంటూ వచ్చారు. కానీ.. అంతలోపే నాన్న ముఖంపై మైక్ పెట్టేసరికి ఆయన క్షణికావేశానికి లోనై దాడి చేశారు. ఇప్పటికే ఆ రిపోర్టర్ కుటంబంతో నేను మాట్లాడాను. అతని ఫ్యామిలీకి అవసరమైన సాయం చేస్తా’’ అని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు.

నేను వచ్చేలోపే అంతా జరిగిపోయింది

తాను ఇంట్లో లేకపోవడంతో.. గొడవ ఇంత తీవ్రమైందని ఒకవేళ ఉండి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేది కాదని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ‘‘నేను కన్నప్ప మూవీ పోస్ట్ ప్రొడెక్షన్ వర్క్ మీద లాస్‌ఏంజెల్స్‌లో ఉన్నప్పుడు.. ఇంట్లో గొడవ గురించి నాకు సమాచారం అందింది. వెంటనే బయల్దేరి వచ్చేశాను. అయితే.. నేను వచ్చేలోపే.. ఇదంతా జరిగిపోయింది. మీడియా వాళ్లకి నా విజ్ఞప్తి.. ఈ ఇష్యూని ఇంతటితో వదిలేయండి ప్లీజ్. మా ఫ్యామిలీతో సర్కస్ చేయకండి’’ అని మంచు విష్ణు రిక్వెస్ట్ చేశారు.

ఇదే నా ఫైనల్ వార్నింగ్

‘‘మా నాన్న మాటే నాకు వేద వాక్కు.. ఆయన తన కష్టంతో ఈ స్థాయికి ఎదిగారు. ఆయన తన ఇంట్లో ఉండొద్దు అంటే.. ఉంటాను అనే హక్కు నాకు లేదు. ఓవరాల్‌గా ఇది మా ఫ్యామిలీ సమస్య.. బయట వాళ్లు ఇందులో జోక్యం చేసుకోవద్దు. ఇప్పటి వరకూ జోక్యం చేసుకున్న వారికి సాయంత్రం వరకూ టైమ్ ఇస్తున్నా.. వాళ్లంతట వాళ్లే పక్కకి తప్పుకోవాలి’’ అని మంచు విష్ణు హెచ్చరించారు.

Whats_app_banner