Manchu family dispute: మంచు ఫ్యామిలీలో గొడవకి కారణమేంటో చెప్పిన పనిమనిషి.. మోహన్‌బాబు వద్దని చెప్తున్నా మనోజ్ వినలేదట
Manchu family dispute: మంచు ఫ్యామిలీలో గొడవ ఆదివారం కాదట.. శనివారమే మొదలైందట. ఆదివారం గొడవ జరిగిన విషయం బయటికిరాగా.. సోమవారం పోలీస్ స్టేషన్‌కి చేరింది. మంగళవారం పెద్ద మనషుల సమక్షంలో రాజీకి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మంచు ఫ్యామిలీలో గొడవ.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. రెండు రోజుల క్రితం మొదలైన ఈ గొడవ.. సోమవారం పోలీస్ స్టేషన్‌కి చేరింది. తొలుత మంచు మనోజ్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయగా.. ఆ వెంటనే మంచు మోహన్ బాబు రాచకొండ కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ తమని తాము సమర్థించుకుంటూ ప్రెస్‌నోట్‌లు కూడా రిలీజ్ చేశారు. కానీ.. అసలు గొడవకి కారణమేంటి? అనే విషయాన్ని మాత్రం మంచు ఫ్యామిలీలో ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదు.
ఎవరి వాదన వారిది
తాను ఇప్పటి వరకు ఎప్పుడూ కుటుంబ ఆస్తులను అడగలేదని.. వాటిపై ఆధారపడకుండా తన ఫ్యామిలీని పోషించుకుంటున్నట్లు మంచు మనోజ్ చెప్పుకొస్తున్నారు. అలానే మంచు విష్ణు తన స్వలాభం కోసం ఫ్యామిలీ ఆస్తిపాస్తులను వాడుకుంటున్నాడని.. కుటుంబంలో డబ్బులు కూడా వృథా చేస్తున్నాడంటూ మంచు మనోజ్ ఆరోపించారు.
మరోవైపు మంచు మోహన్‌బాబు తన కొడుకు మంచు మనోజ్, అతని భార్య మౌనిక నుంచి తనకి ప్రాణహాని ఉందంటూ ఆరోపించారు. తన ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి మంచు మనోజ్ ప్రయత్నిస్తున్నారని.. ఆ ఇద్దరి నుంచి తనకి రక్షణ కల్పించాల్సిందిగా రాచకొండ సీపీకి రాసిన లేఖలో మోహన్‌బాబు పేర్కొన్నారు.
మోహన్ బాబు చెప్పినా.. మనోజ్ వినలేదా?
మంచు మోహన్‌బాబు ఇంట్లో అసలు ఏం జరిగింది? అనే విషయాన్ని ఆ ఇంటి పనిమనిషి ద్వారా మంగళవారం బహిర్గతమైంది. ఆమె మాటల్లో.. ‘‘మోహన్ బాబు సార్ స్టాఫ్ ప్రసాద్‌తో తొలుత మంచు మనోజ్ అన్నకి గొడవైంది. అతడ్ని కొట్టేందుకు మనోజ్ అన్న ప్రయత్నించగా.. నా స్టాఫ్‌ను నేను అదుపులో పెట్టుకుంటాను కొటొద్దు అని మోహన్ బాబు సార్ చెప్పారు.
కానీ.. మనోజ్ అన్న వినలేదు. దాంతో మోహన్ బాబు సార్, మనోజ్ అన్న మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో మనోజ్ అన్న రెండో పెళ్లి టాపిక్ కూడా వచ్చింది. పెళ్లికి ముందే ఒక బాబు ఉన్న మౌనికని మనోజ్ అన్న పెళ్లి చేసుకోవడం ఫ్యామిలీలో ఎవరికీ ఇష్టం లేదు. పెళ్లితో మనస్పర్థలు వచ్చాయి.
శనివారం ఈ గొడవ జరిగింది. మోహన్ బాబు సార్ అంటే.. మంచు విష్ణు అన్నకి ప్రాణం. సార్ మీద చేయి వేశారంటే.. అస్సలు ఒప్పుకోడు. మనోజ్ అన్న చెయ్యి వేశాడు.. అందుకే డాడీనీ ముట్టుకుంటావా అంటూ మంచు విష్ణు అన్న కోప్పడ్డారు’’ అని ఆమె చెప్పుకొచ్చింది.