Mohan Babu Attack : జర్నలిస్టులపై దాడి - సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు
మీడియా ప్రతినిధులపై దాడి ఘటనలో సినీ నటుడు మోహన్‌బాబుపై కేసు నమోదైంది. BNS 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు… పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రాచకొండ సీపీ కార్యాలయంలో మంచు మనోజ్ విచారణ ముగిసింది.
జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద మీడియా ప్రతినిధులపై దాడి ఘటన చర్చనీయాంశంగా మారింది. మోహన్ బాబు వ్యవహరించిన తీరును మీడియా ప్రతినిధులు, జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. బుధవారం నగరంలోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుటు ఆందోళనకు కూడా దిగారు. మోహన్ బాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని... డిమాండ్ చేస్తున్నారు.
మోహన్ బాబుపై కేసు నమోదు..
ఈ దాడిలో గాయపడిన రంజిత్ కుమార్ అనే జర్నలిస్ట్ పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు... బీఎన్ఎస్ యాక్ట్ 118(1)కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపినట్లు తెలిపారు.
అసలేం జరిగిందంటే..?
కుటుంబ వివాదాల నేపథ్యంలో హైదరాబాద్ జల్ పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి వద్ద మంగళవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంచు మనోజ్ ను ఇంటి నుంచి వెళ్లిపోవాలని మోహన్ బాబు సూచించడంతో... ఆయన తన వస్తువులు తరలించేందుకు మూడు భారీ వాహనాలు తీసుకొచ్చారు. ఈ క్రమంలో మనోజ్ దంపతులు మోహన్ బాబు ఇంటి రాగా...సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మనోజ్ వాహనాన్ని గేటు వద్దే నిలిపివేశారు. దీంతో కారు దిగి గేట్లను తోసుకుంటూ మనోజ్ ఇంట్లోకి వెళ్లారు. గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లిన మనోజ్ పై మోహన్ బాబు, ఆయన బౌన్సర్లు దాడి చేశారు. దీంతో ఆయన చిరిగిన చొక్కాతో బయటకు వచ్చారు.
ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీ వివాదాన్ని కవర్ చేస్తున్న మీడియాపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. మీడియా ప్రతినిధుల మైకులు లాక్కొని కోపంతో నేలకేసి కొట్టారు. మీడియా ప్రతినిధులు గేటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు మోహన్ బాబును అదుపుచేశారు. మీడియాపై మోహన్ బాబు బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు జర్నలిస్టులు గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో నటుడు మోహన్ బాబు నివాసాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు మోహన్ బాబు, విష్ణు గన్స్ సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మరోవైపు శాంతిభద్రతల విషయంపై రాచకొండ సీపీ ఆరా తీశారు. మోహన్ బాబు కుటుంబ సభ్యులను విచారణకు రావాలని ఆదేశించారు.
మీడియాతో మాట్లాడిన విష్ణు:
కుటుంబ వివాదంపై మంచు విష్ణు స్పందించారు. ప్రతి ఇంట్లోనూ సమస్యలు ఉంటాయన్నారు. కుటుంబ సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని చెప్పుకొచ్చారు. ఇంటి గేట్లు బద్దలు కొట్టి లోపలికి రావడం వల్లే మోహన్ బాబుకు కోపం వచ్చిందన్నారు. దయచేసి తన తండ్రి మోహన్ బాబుపై దుష్ప్రచారాలు చేయవద్దని కోరారు.
“మా నాన్న దండం పెడుతూ ముందుకూ వచ్చారు. మీడియా నే మా నాన్నని రెచ్చగొట్టింది. ఒక తండ్రిగా అయన రియాక్ట్ అయిన విధానం చాలా తక్కువే అని నేను అనుకుంటున్నా. మా విషయంలో కొంత మంది మీడియా లిమిట్స్ క్రాస్ చేశారు. మీడియా వ్యక్తులకు కూడా తండ్రి, అన్నదమ్ములు ఉంటారు.. ఎవరి కుటుంబం పర్ఫెక్ట్‌గా ఉండదు. ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి మోహన్ బాబు మీడియాకు రెస్పెక్ట్ ఇస్తారు. మూడు తరాలుగా మోహన్ బాబు గురించి అందరికి తెలుసు” అని మంచు విష్ణు కామెంట్స్ చేశారు.
అన్ని వివరాలు వెల్లడిస్తా - మంచు మనోజ్
బుధవారం మంచు మనోజ్ కూడా మీడియాతో మాట్లాడారు. “మా నాన్న దేవుడు.. నాన్న అంటే నాకు ప్రాణం. మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా మీడియాపై దాడి చేయడం బాధ కలిగించింది. మా నాన్న దృష్టిలో నన్ను శత్రువు గా చిత్రీకరించారు” అని ఆవేదన వ్యక్తం చేశాడు.
“నాకు సపోర్ట్ చేస్తున్న మా అమ్మ ను కూడా డైవర్ట్ చేశారు. నా భార్య, ఏడు నెలల కూతురి పేరు లాగుతున్నారు. నేను నా సొంత కాళ్ల మీద నిలబడుతున్నాను. నేను ఎవరిని ఆస్తి అడగలేదు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తా” అని మంచు మనోజ్ ప్రకటించారు.
సంబంధిత కథనం