Mohan Babu: ఇక చాలు.. ఇక్కడితో పుల్‌స్టాప్ పెట్టండి.. మంచు మోహన్ బాబు ఫైనల్ వార్నింగ్
Mohan Babu vs Manchu Manoj: మంచు మనోజ్ గేట్లు తోసుకుంటూ మోహన్ బాబు ఇంట్లోకి ప్రవేశించాడు. దాంతో అక్కడికి బౌన్సర్లతో వచ్చిన మోహన్ బాబు.. మీడియాపై దాడికి తెగబడ్డారు. అలానే బౌన్సర్లతో ఘర్షణ కారణంగా మంచు మనోజ్ షర్ట్ చిరిగిపోయింది.
మంచు ఫ్యామిలీలో విభేదాలు పీక్స్‌కి చేరిపోయాయి. హైదరాబాద్ జల్‌పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటికి మంగళవారం రాత్రి వెళ్లిన మంచు మనోజ్.. గేటు తీయకపోవడంతో తోసుకుంటూ లోపలికి ప్రవేశించారు. దాంతో అక్కడ కాసేపు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్న బౌన్సర్లు మంచు మనోజ్‌ను అడ్డుకోగా.. ఆ ఘర్షణలో మంచు మనోజ్ చొక్కా చిరిగిపోయింది. దాంతో చిరిగిన చొక్కాతోనే మంచు మనోజ్ బయటికి వచ్చారు.
మద్యానికి బానిసై ఇలా
మంచు మనోజ్ తన ఇంటి దగ్గరికి రాకముందే మంచు మోహన్ బాబు ఒక ఆడియో ద్వారా ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. మంచు విష్ణు, మంచు లక్ష్మీప్రసన్న కంటే మిన్నగా పెంచానని.. చదివించేందుకు ప్రయత్నించానని చెప్పుకొచ్చిన మోహన్ బాబు.. ఏది అడిగినా కాదనకుండా ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. కానీ.. ఇప్పుడు మనోజ్ మద్యానికి బానిసై.. భార్య చెప్పినట్లు వింటూ తనని గుండెల మీద తన్నాడని మోహన్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆస్తి ఎలా పంచాలో నా ఇష్టం
ఆస్తిపాస్తులు తన కష్టార్జితం అని.. వాటిని ముగ్గురు బిడ్డలకి సమానంగా పంచాలా? లేదా దానధర్మాలు చేయాలా? అనేది తన ఇష్టమని స్పష్టం చేసిన మోహన్ బాబు.. కుటుంబ పరువు, పేరు ప్రఖ్యాతల్ని మంటగలిపినట్లు ఆడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యామిలీలో గత మూడు రోజుల నుంచి జరుగుతున్న రచ్చ కారణంగా.. తన భార్య ఆసుపత్రిపాలైందని.. ఆమె కోలుకున్న వెంటనే మంచు మనోజ్ బిడ్డని అతనికి అప్పగిస్తామని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
నీ బిడ్డని వచ్చి తీసుకుపో
‘‘మనోజ్ నువ్వు వచ్చి నీ బిడ్డని తీసుకెళ్లు. ఒకవేళ నువ్వు రాలేదంటే.. నీ బిడ్డని జాగ్రత్తగానే చూసుకుంటాం. మీ అమ్మ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది. ఆమె కోలుకోగానే.. పోలీసుల ఆధ్వర్యంలో నీ బిడ్డను అప్పగిస్తాం. జర్నలిస్ట్‌లకి నా విన్నపం.. లేనిది ఉన్నట్లు రాయకండి. ఇక్కడి ఈ ఇష్యూకి పుల్‌స్టాప్ పెట్టండి’’ అని మోహన్ బాబు హెచ్చరించారు.
మంచు మనోజ్ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు.. అతని వెంట కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్ట్‌పై మంచు మోహన్ బాబు దాడికి ప్రయత్నించారు.