Mohan Babu Audio Message: జర్నలిస్ట్‌ను నేను కొట్టడం తప్పే.. కానీ పొరపాటు ఎలా జరిగిందంటే? మరో ఆడియో వదిలిన మోహన్ బాబు
Mohan Babu Audio Message: మంచు ఫ్యామిలీలో వివాదంపై మీడియాతో ఇప్పటి వరకూ మాట్లాడని మోహన్ బాబు.. రెండో ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. మొన్న మంచు మనోజ్‌ను ఉద్దేశిస్తూ ఒక ఆడియోను మోహన్ బాబు వదిలారు.
జల్‌పల్లిలోని తన నివాసంలోకి మంచు మనోజ్ వెంట చొరబడిన జర్నలిస్ట్‌పై దాడి చేయడం తప్పేనని సీనియర్ నటుడు మోహన్ బాబు అంగీకరించారు. మంచు ఫ్యామిలీలో గత ఐదు రోజుల నుంచి వివాదం కొనసాగుతుండగా.. మంగళవారం రాత్రి గేట్లు తోసుకుంటూ తన అనుచరులు, మీడియా సభ్యులతో కలిసి మంచు మనోజ్ ఇంట్లోకి ప్రవేశించాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మోహన్ బాబు ముందు మైక్ పెట్టిన ఒక జర్నలిస్ట్.. ‘ఈ ఇష్యూపై మీరు ఏం చెప్తారు?’ అని ప్రశ్నించారు. దాంతో సహనం కోల్పోయిన మోహన్ బాబు.. ఆ మైక్‌ను తీసుకుని జర్నలిస్ట్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో జర్నలిస్ట్ తలకి గాయమై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దాడి ఘటనపై చింతిస్తున్నా
జర్నలిస్ట్‌పై దాడి తర్వాత మోహన్ బాబు కూడా అస్వస్థతకి గురై.. ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం గురువారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో ఇంటికి వెళ్లిన మోహన్ బాబు.. ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో ఫ్యామిలీ వివాదంపై క్లారిటీ ఇవ్వడంతో పాటు జర్నలిస్ట్‌పై దాడి, దానికి గల కారణాన్ని కూడా మంచు మోహన్ బాబు వెల్లడించారు. దాడి ఘటనపై చింతిస్తున్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు.
చీకట్లో అలా జరిగిపోయింది
‘‘మీడియాపై దాడి చేయాలని నేను అనుకోలేదు. ఆరోజు చీకట్లో ఈ ఘటన జరిగింది. మీడియా ముసుగులో నాపై దాడి చేసే అవకాశం ఉందని ఆలోచించా.. జర్నలిస్ట్‌కి తగిలిన దెబ్బకు నేను చాలా బాధపడుతున్నాను. ఆ మీడియా ప్రతినిధి నా తమ్ముడు లాంటివాడు.. అతని ఫ్యామిలీ గురించి నేను ఆలోచిస్తున్నాను. కానీ.. నా ఫ్యామిలీ గురించి ఆలోచించేది ఎవరు? నేను కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తాను. నిజ జీవితంలో నటించను.. ఆ అవసరం కూడా నాకు లేదు’’ అని మంచు మోహన్ బాబు వెల్లడించారు.
బయట కొట్టి ఉంటే నేనే లొంగిపోతా
‘‘నా ఇంట్లోకి చొరబడి నా ప్రశాంతతని దెబ్బతీశారు. ఒకవేళ నేను నా ఇంటి గేటు బయట అలా దాడి చేసి ఉంటే నాపై కేసులు పెట్టి అరెస్ట్ చేసుకోవచ్చు. అంతెందుకు నేనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోతా. మా కుటుంబంలోని సమస్యని పరిష్కరించుకోవడానికి ఎవరూ మధ్యవర్తులు అవసరం లేదు. మేము కూర్చొని మాట్లాడుకుని .. సమస్యని పరిష్కరించుకుంటాం’’ అని మంచు మోహన్ బాబు ధీమా వ్యక్తం చేశారు.
‘‘మీడియాలో కేవలం నేను కొట్టిన విషయాన్నే ప్రస్తావిస్తున్నారు. నిజమే.. నేను అలా కొట్టడం తప్పే. కానీ.. ఏ సందర్భంలో కొట్టానో ఆలోచించాలి కదా? నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. అవన్నీ వదిలేసి.. కేవలం కొట్టిన విషయాన్నే పదే పదే ప్రస్తావిస్తున్నారు’’ అని మంచు మోహన్ బాబు మండిపడ్డారు.
మోహన్ బాబుపై కూడా బైండోవర్?
జల్‌పల్లిలో ప్రైవేట్ బౌన్సర్లతో మంచు మనోజ్, మంచు విష్ణు అక్కడ భయానక వాతావరణ సృష్టించారు. దాంతో ఇప్పటికే ఈ ఇద్దరిపై సొంత పూచీకత్తుతో బైండోవర్ చేసిన పోలీసులు.. మోహన్ బాబుని కూడా విచారణకి పిలిచారు. కానీ.. తెలంగాణ హైకోర్టు నుంచి డిసెంబరు 25 వరకూ పోలీసుల విచారణ నుంచి మోహన్ బాబు మినహాయింపు తెచ్చుకున్నారు.