Kylaq bookings: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్; ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్న కాంపాక్ట్ ఎస్యూవీ
Skoda Kylaq bookings: లాంచ్ అయిన కేవలం 10 రోజుల్లోనే 10 వేల బుకింగ్స్ ను సాధించిన ఈ కాంపాక్ట్ ఎస్యూవీ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది. సరసమైన ధరలో, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో ఈ కారు మార్కెట్లోకి వచ్చింది. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి..
Skoda Kylaq bookings: కాంపాక్ట్ ఎస్యూవీ కేటగిరీలో కొత్తగా లాంచ్ అయిన స్కోడా కైలాక్ కేవలం 10 రోజుల్లోనే 10,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను సాధించి, రికార్డు సృష్టించింది. తమ లైనప్ లోని మొట్టమొదటి సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఎస్యూవీగా ఈ కైలాక్ ను స్కోడా భారతీయ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్యూవీ 300 వంటి మోడల్స్ కు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
డిసెంబర్ 2 నుంచి..
స్కోడా కైలాక్ (Skoda Kylaq) బుకింగ్స్ డిసెంబర్ 2న ప్రారంభమయ్యాయి. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ (suv) డెలివరీలు జనవరి 27 నుండి ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే స్కోడా ఇండియా కైలాక్ ను బుక్ చేసుకున్న మొదటి 33,333 కస్టమర్‌లకు పరిమిత ఆఫర్‌ను ప్రకటించింది. వారు కాంప్లిమెంటరీగా 3 సంవత్సరాల స్టాండర్డ్ మెయింటెనెన్స్ ప్యాకేజీ (SMP)ని పొందతారు. అలాగే, ఈ కారు మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుందని స్కోడా హామీ ఇస్తోంది.
మూడు మార్గాల్లో కైలాక్ తో డ్రీమ్ టూర్
మరోవైపు, కస్టమర్‌లతో కనెక్ట్ అవ్వడానికి, ఎస్యూవీ కైలాక్‌తో భారతదేశ వ్యాప్తంగా 'డ్రీమ్ టూర్'ని స్కోడా (skoda cars) ప్రారంభించనుంది. డిసెంబరు 13న చకాన్ ప్లాంట్ నుండి మూడు కైలాక్ కార్లు బయల్దేరుతాయి. అవి 43 రోజుల పాటు 70 నగరాలలో పర్యటించేలా మూడు వేర్వేరు మార్గాలను సిద్ధం చేశారు. అవి జనవరి 25 నాటికి ప్లాంట్‌లోకి తిరిగివస్తాయి. ఈ మూడు మార్గాల్లో ఒక మార్గంలో పూణే, కొల్హాపూర్, పనాజీ, మంగళూరు, మైసూరు, బెంగళూరు (bengaluru news), హైదరాబాద్ (hyderabad) వంటి నగరాలు ఉంటాయి. మరో రూట్ లో ముంబై, సూరత్, వడోదర, అహ్మదాబాద్, ఢిల్లీ వంటి నగరాలు వస్తాయి. మూడో మార్గం పూణే, నాసిక్, నాగ్‌పూర్, కోల్‌కతా వంటి నగరాలను కవర్ చేస్తుంది.
స్కోడా కైలాక్ ప్రత్యేకతలు
స్కోడా కైలాక్ లో 1.0-లీటర్ TSI ఇంజన్ ఉంది, ఇది 115 బీహెచ్పీ పవర్ ను, 178 ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ ఎంటీ, 6-స్పీడ్ ఏటీ టార్క్ కన్వర్టర్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. కైలాక్ గరిష్టంగా గంటకు 188 వేగాన్ని అందుకోగలదని, అలాగే, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 10.5 సెకన్లలో 100 కిమీల నుండి వేగాన్ని అందుకోగలదని స్కోడా చెబుతోంది. స్కోడా కైలాక్ లో మొత్తం నాలుగు వేరియంట్‌లు ఉన్నాయి. అవి క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్+, ప్రెస్టీజ్. వాటి ఎక్స్-షోరూమ్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి.
స్కోడా కైలాక్ ధరలు
క్లాసిక్ ఎంటీ - రూ. 7.89 లక్షలు
సిగ్నేచర్ ఎంటీ - రూ. 9.59 లక్షలు
సిగ్నేచర్ ఏటీ - రూ. 10.59 లక్షలు
సిగ్నేచర్ + ఎంటీ - రూ. 11.40 లక్షలు
సిగ్నేచర్ + ఏటీ - రూ. 12.40 లక్షలు
ప్రెస్టీజ్ ఎంటీ - రూ. 13.35 లక్షలు
ప్రెస్టీజ్ ఏటీ - రూ. 14.40 లక్షలు
వీటిలో ఎంట్రీ లెవెల్ వేరియంట్ అయిన క్లాసిక్ బుకింగ్స్ ముగిశాయని స్కోడా ప్రకటించింది.