డిసెంబర్‌లో ఆఫర్‌తో కారు కొంటే ఈ నష్టాలు.. లక్షల డిస్కౌంట్ వచ్చినా ఈ సమస్యలు వస్తాయ్!
December Car Offers : 2024 చివరి నెలలో ఉన్నాం. డిసెంబర్‌లో సాధారణంగా ఆటోమెుబైల్ ఇండస్ట్రీలో కొన్ని ఆఫర్లు నడుస్తాయి. పలు కార్ల కంపెనీలు డిస్కౌంట్ ప్రకటిస్తాయి. అయితే ఈ సమయంలో కారు కొనడం మంచిదేనా? ఏమైనా నష్టాలు ఉన్నాయా?
సంవత్సరం చివరిలో కస్టమర్‌లను ఆకర్షించడానికి ఆకర్షణీయమైన ఆఫర్‌లు, తగ్గింపులు ఉంటాయి. డీలర్లు తమ గోడౌన్‌లలో ఉన్న వాహనాలను విక్రయించడం ద్వారా లిక్విడేట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంటారు. కంపెనీ నుంచి ఈ సమయంలో పలు కొత్త ఆఫర్లు వస్తాయి. రాబోయే ఏడాది కొత్త మోడళ్ల ఎంట్రీ కోసం ఇప్పటికే ఉన్న స్టాక్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు భారీ తగ్గింపుతో వివిధ కార్ మోడళ్లను కొనుగోలు చేయవచ్చు. నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లు, లాయల్టీ రివార్డ్‌లు, స్క్రాపేజ్ ప్రయోజనాల వంటి అనేక బెనిఫిట్స్ ఉంటాయి.
కొన్ని కార్లు లక్షల వరకు తగ్గింపుతో దొరుకుతాయి. సంవత్సరం చివరి ఆఫర్లలో భాగంగా మహీంద్రా, ఫోక్స్‌వ్యాగన్, జీప్ వంటి బ్రాండెడ్ కంపెనీల పలు మోడల్‌లపై లక్షల తగ్గింపులను అందిస్తాయి. ఈ తగ్గింపుల కారణంగా వినియోగదారులు భారీ మొత్తాన్ని సేవ్ చేసుకోవచ్చు. కానీ ఏడాది చివరి ఆఫర్లలో కొనుగోలు చేస్తే.. కొన్ని సమస్యలు కూడా ఉంటాయి.
కార్ కంపెనీలు, డీలర్లు తక్కువ ధరలకు కార్లను విక్రయించడానికి కారణం మోడల్ ఇయర్ మారడమే. ఇది వాహనం విలువను ప్రభావితం చేస్తుంది. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వచ్చిన కార్లు మోడల్ ఇయర్ షిఫ్ట్ కారణంగా సాంకేతికంగా జనవరిలో ఒక సంవత్సరం పాతవిగా చూస్తారు. ఇది మునుపటి సంవత్సరం మోడల్‌ల మార్కెట్ విలువ, ఆకర్షణను తగ్గిస్తుంది. వాటి రీ సేల్ వాల్యూను ప్రభావితం చేస్తుంది.
ఒకవేళ మీరు డిసెంబర్ 2024లో తయారు చేసిన కారు కొంటారు. నిజానికి ఇది కొత్తదే. కానీ జనవరి 2025లో ఒక సంవత్సరం పాతదిగా పరిగణిస్తారు. ఇది కారు రీ సేల్ మీద ప్రభావం చూపిస్తుంది. తక్కువ ధరకు అడుగుతారు. దాని విలువ గణనీయంగా తగ్గుతుంది. ఒక వ్యక్తి సంవత్సరం చివరిలో కొనుగోలు చేసిన కారును వచ్చే ఏడాది సంవత్సరాంతపు ఆఫర్‌పై విక్రయించాలని నిర్ణయించుకుంటే.. కారు ఒక సంవత్సరం కంటే తక్కువ అయినప్పటికీ, మరుసటి సంవత్సరం దానిని రెండేళ్లుగా పరిగణిస్తారు. ఫలితంగా దాని మళ్లీ అమ్మితే విలువ ఎక్కువగా పడిపోతుంది. ఒక్కోసారి రూ.2 లక్షల వరకు కూడా తగ్గింపు అడగవచ్చు.
ఇయర్ ఎండ్‌లో భారీ తగ్గింపుతో కారు కొనడం భారీ లాభంగా అనిపించవచ్చు. కానీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చూస్తే ఎక్కువ నష్టాన్ని చూడాలి. వాహన గుర్తింపు సంఖ్య (VIN) అనేది ప్రతి వాహనానికి కేటాయించే ప్రత్యేక కోడ్. వాహనం తయారు చేసిన సంవత్సరం, నెలతో సహా కీలకమైన సమాచారం ఇందులో ఉంటుంది.
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సంవత్సరాంతపు ఆఫర్‌ల లాభాలు, నష్టాలను బేరీజు వేసుకోవాలి. కారు తయారీ తేదీని VINతో తనిఖీ చేయడం ద్వారా సరైన నిర్ణయం తీసుకోవడానికి కస్టమర్‌లు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మరుసటి ఏడాది కారు ధర తగ్గుతుంది.
మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, నిస్సాన్, ఎంజీ మోటార్, ఆడి ఇండియా, బీఎమ్‌డబ్ల్యూ ఇండియా, మెర్సిడెస్ బెంజ్ వంటి అనేక కార్ల తయారీదారులు జనవరి నుండి తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించారు. ధరల పెంపు ప్రకటనతో ఏడాది ముగింపు ఆఫర్‌లో కారు కొనాలా వద్దా అనే నిర్ణయంపై సందిగ్ధత చాలా మందికి ఉంటుంది.
ఏడాది చివరిలో కార్ల డిస్కౌంట్ ఆఫర్ల నుంచి వచ్చే ప్రయోజనాలు పొందాలా వద్దా అనేది వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలించి సరైన ప్రణాళికతో ఈ ఆఫర్‌లను ఉపయోగించుకోవచ్చు. కారు రీసేల్ వాల్యూ కాకుండా.. కచ్చితంగా మీరు ఎక్కువ రోజులు వాడుతారు అనుకుంటే ఆఫర్లను వాడుకోవచ్చు. నిర్ణయం ఏదైనా మీ జేబులో నుంచి ఎక్కువ డబ్బులు ఖర్చు కాకుండా చూసుకోండి.