Allu Arjun: పుష్ప 2 రికార్డుల్ని 3 నెలలు ఎంజాయ్ చేస్తా.. ఆ తర్వాత వేసవిలో అలా జరిగితే హ్యాపీ: అల్లు అర్జున్
Pushpa 2 Thank You Press Meet: పుష్ప 2 థ్యాంక్యూ ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్ ఎమోషనల్‌గా మాట్లాడారు. కలెక్షన్లు, రికార్డుల గురించి మాట్లాడుతూ.. ఆఖర్లో భర్తలకి ఒక సలహా కూడా ఇచ్చారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ మూవీ వసూళ్లలో సరికొత్త రికార్డుల్ని నెలకొల్పుతోంది. డిసెంబరు 5న రిలీజైన ఈ సినిమా.. ఇప్పటికే రూ.1000 కోట్ల మార్క్‌ని దాటేసి.. భారత సినీ చరిత్రలో అత్యంత వేగంగా వెయ్యి కోట్లు వసూళ్లు రాబట్టిన సినిమాగా ఘనత సాధించింది. ఈ నేపథ్యంలో.. పుష్ప 2 చిత్ర యూనిట్.. ఢిల్లీలో గురువారం థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించింది. ఈ మీట్‌లో అల్లు అర్జున్ ఎమోషనల్‌గా మాట్లాడుతూ.. పుష్ప 2 రికార్డుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించింది. ఈ మూవీలో శ్రీలీల ఐటెం సాంగ్ చేయగా.. ఫహాద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
రూ.1000 కోట్లు దాటేసిన పుష్ప 2
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి యలమంచిలి ఈ సినిమాని నిర్మించారు. డిసెంబరు 5న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, తమిళం భాషల్లో.. సుమారు 12,500 స్క్రీన్లలో పుష్ప 2 రిలీజైన విషయం తెలిసిందే. విడుదలైన రోజే రూ.294 కోట్లు వసూళ్లు రాబట్టిన పుష్ప.. ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్‌ని అందుకోవడం గమనార్హం.
రికార్డులు బద్ధలవ్వాలి
థ్యాంక్స్ మీట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘పుష్ప 2 సినిమాకి ఇంతటి ఘన విజయాన్ని అందించిన అందరికీ ధన్యవాదాలు. దర్శకుడు సుకుమార్ విజన్ నుంచి పుట్టిందే ఈ మూవీ. అందుకే ఇప్పుడు ఈ రికార్డుల క్రెడిట్ అంతా సుకుమార్ సొంతం. ఈ సందర్భంగా సుకుమార్‌కి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను. గత వారం రోజులుగా పుష్ప 2పై ప్రేక్షకులు చూపించిన ప్రేమ, ఆదరణకి నిదర్శనమే రూ.1,000 కోట్లు. అయితే.. ఈ లెక్కలు, నెంబర్లు తాత్కాలికం. ఇక రికార్డులంటారా.. అవి బద్ధలవుతూనే ఉండాలి. పుష్ప 2 నెలకొల్పిన ఈ నెంబర్లు, రికార్డులను మరో 3 నెలలు నేను ఎంజాయ్ చేస్తాను. ఆ తర్వాత ఈ రికార్డులన్నీ నెక్ట్స్ సమ్మర్‌లో వేరే సినిమాలు బద్ధలు కొడితే హ్యాపీ’’ అని చెప్పుకొచ్చారు.
భర్తలకి సలహా
శ్రీవల్లి నా పెళ్లాం.. పెళ్లాం మాట మొగుడు ఇంటే ఎట్టా ఉంటుందో ఈ పెపంచకానికి చూపిస్తా అంటూ పుష్ప 2లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ఈ డైలాగ్‌ను థ్యాంక్స్ మీట్‌లో ప్రస్తావించిన హోస్ట్.. ‘భర్తలకి మీరు ఇచ్చే సలహాలేంటి?’ అని అడిగారు. దానికి నవ్వేసిన అల్లు అర్జున్ ‘మహిళ ముందు మనం తగ్గినా ఫర్వాలేదు.. మీ భార్య మాట వినండి’’ అంటూ సమాధానమిచ్చారు.