Mohan Babu: ఆసుపత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్.. మనోజ్, విష్ణుపై ఇప్పటికే పోలీసులు బైండోవర్-mohan babu discharged from hospital after family issue ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mohan Babu: ఆసుపత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్.. మనోజ్, విష్ణుపై ఇప్పటికే పోలీసులు బైండోవర్

Mohan Babu: ఆసుపత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్.. మనోజ్, విష్ణుపై ఇప్పటికే పోలీసులు బైండోవర్

Galeti Rajendra HT Telugu
Dec 12, 2024 05:06 PM IST

Mohan Babu Family Issue: మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం ఓ కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మంచు మనోజ్, మంచు విష్ణు బైండోవర్ రాసిచ్చి సైలెంట్ అయిపోగా.. మంచు మోహన్ బాబు కోర్టుకి వెళ్లి ఊరట తెచ్చుకున్నారు. అయితే..?

మోహన్ బాబు
మోహన్ బాబు

మంచు మోహన్ బాబు ఆసుపత్రి నుంచి గురువారం డిశ్చార్జ్ అయ్యారు. జల్‌పల్లిలో మంగళవారం రాత్రి మంచు మనోజ్‌, మీడియాతో జరిగిన గొడవ కారణంగా.. అస్వస్థతకి గురైన మంచు మోహన్ బాబు అదే రోజు రాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం గురువారం మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు.

మూడు కేసులు నమోదు

వాస్తవానికి మంచు మోహన్ బాబు.. బుధవారం రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు ఎదుట హాజరు కావాల్సి ఉంది. జల్‌పల్లి మంగళవారం రాత్రి జరిగిన గొడవ నేపథ్యంలో.. పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. దాంతో.. జిల్లా అదనపు మేజిస్ట్రేట్‌ హోదాలో సుధీర్‌బాబు.. మంచు విష్ణు, మంచు మనోజ్‌తో పాటు మంచు మోహన్‌ బాబుకి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు.

బుధవారం విచారణకి తొలుత మంచు మనోజ్.. ఆ తర్వాత మంచు విష్ణు వేర్వేరుగా హాజరయ్యారు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ సీపీ కార్యాలయానికి వచ్చిన ఈ ఇద్దరినీ గొడవలపై హెచ్చరించిన సీపీ.. ఇకపై ఇలాంటి చర్యలకి పాల్పడమంటూ వారి నుంచి బైండోవర్​ తీసుకున్నట్లు తెలుస్తోంది.

బైండోవర్ రూల్స్ బ్రేక్ చేస్తే?

బైండోవర్‌లో భాగంగా రూ. 1 లక్ష సొంత పూచీకత్తుతో లిఖిత పూర్వకంగా ఇద్దరి దగ్గర నుంచి సీపీ సంతకాలు తీసుకున్నారు. బైండోవర్ ఇచ్చిన ఆరు నెలల్లో ఎలాంటి నేరాలకి పాల్పడినా.. పూచీకత్తు డబ్బుల్ని ప్రభుత్వ ఖజానాకి జమ చేస్తారు. ఒకవేళ రెండు సార్లకి మించి బైండోవర్ అయితే.. అప్పుడు బైండోవర్ ఇచ్చిన వ్యక్తిపై రౌడీ షీట్ తెరుస్తారు. ఈ విషయాన్ని మంచు మనోజ్, విష్ణుకి సీపీ చెప్పినట్లు తెలుస్తోంది.

మోహన్ బాబుకి ఊరట

సీపీ విచారణకి హాజరుకాకుండా.. తెలంగాణ హైకోర్టు నుంచి మోహన్ బాబు స్టే తెచ్చుకున్నారు. డిసెంబరు 24 వరకూ పోలీసులు ముందు మోహన్ బాబు హాజరు కావాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. దాంతో డిసెంబరు 25 తర్వాత మోహన్ బాబు విచారణకి హాజరైతే.. అతని నుంచి కూడా బైండోవర్‌ను తీసుకునే అవకాశం ఉంది.

Whats_app_banner