Chennamaneni Ramesh : మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ జర్మన్ పౌరుడే, తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు- రూ.30 లక్షల జరిమానా
Chennamaneni Ramesh : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. రమేశ్ జర్మన్ పౌరుడేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. తప్పుడు పత్రాలతో కోర్టును తప్పుదోవ పట్టించినందుకు రమేశ్ కు రూ.30 లక్షల జరిమానా విధించింది.
వేములవాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చెన్నమనేని రమేశ్ కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రమేశ్ జర్మన్ పౌరుడేనని హైకోర్టు నిర్థారించింది. పౌరసత్వం కేసులో దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు రూ. 30 లక్షల జరిమానా విధించింది. రూ. 25 లక్షలు ప్రస్తుత ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు చెల్లించాలని, మరో రూ. 5 లక్షలు హైకోర్టు న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. నెలలోపు జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది.
చెన్నమనేని జర్మనీ పౌరుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచారని కోర్టు తీర్పు ఇచ్చింది. తప్పుడు పత్రాలతో గత 15 ఏళ్లుగా కోర్టును తప్పుదోవ పట్టించారని వ్యాఖ్యానించింది. తప్పుడు సమాచారంతో చెన్నమనేని రమేశ్ ఎన్నికల్లో పోటీ చేశారని కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ఆది శ్రీనివాస్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రమేశ్ వేములవాడ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు గెలుపొందారు. 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి, ఆ తర్వాత ఉపఎన్నికతో కలిపి 2010 నుంచి 2018 వరకు మూడుసార్లు విజయం సాధించారు.
చట్టం ప్రకారం భారతీయ పౌరులు కాని వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు లేదా ఓటు వేసేందుకు అవకాశం లేదు. మాజీ ఎమ్మెల్యే రమేశ్ జర్మన్ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉన్నారని, అది 2023 వరకు చెల్లుబాటులో ఉందని 2020లో కేంద్రం తెలంగాణ హైకోర్టుకు తెలియజేసింది. అయితే రమేశ్ తన దరఖాస్తులో వాస్తవాలను దాచిపెట్టిన కారణంగా భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. రమేశ్ తప్పుడు పత్రాలతో భారత ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హైకోర్టుకు తెలిపింది. హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలను సవాల్ చేస్తూ రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జర్మన్ పాస్‌పోర్ట్ సరెండర్‌కు సంబంధించిన వివరాలను, జర్మన్ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు రుజువు చేస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేయమని హైకోర్టు రమేశ్ ను ఆదేశించింది. ఈ కారణంతో 2013లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రమేశ్ ఉపఎన్నిక విజయాన్ని రద్దు చేసింది. దీంతో రమేశ్ సుప్రీం కోర్టును ఆశ్రయించి స్టే విధించింది. స్టే అమల్లో ఉండగానే 2014, 2018 ఎన్నికల్లో చెన్నమనేని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.
"నా పోరాటం ఫలించింది. న్యాయం గెలిచింది. ఇన్నేళ్లుగా నేను చేసిన న్యాయ పోరాటానికి సహకరించిన నా ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు చెన్నమనేని రమేశ్ పై చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతాను. నా సుదీర్ఘ న్యాయ పోరాటంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు" - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సంబంధిత కథనం