TG Assembly Sessions 2024 : ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభలో ప్రశ్నిస్తారా..? ఈసారి సీన్ ఎలా ఉండబోతుంది..?
TG Assembly Sessions 2024 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి డిసెంబర్ 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏడాది పాలనపై రేవంత్ సర్కార్ సంతృప్తిని వ్యక్తం చేస్తుండగా… మరోవైపు బీఆర్ఎస్ అస్త్రాలను సిద్ధం చేస్తోంది. హామీల అమల్లో విఫలమైందంటూ విమర్శలు చేస్తోంది. అయితే ఈసారి కేసీఆర్ రాకపై ఆసక్తి నెలకొంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై వాయిదా పడిన సంగతి తెలిసిందే. తిరిగి ఈనెల 16వ తేదీన నుంచి శాసనసభ, మండలి ప్రారంభం కానున్నాయి. అయితే రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఏడాది పూర్తి చేసుకుంది. డిసెంబర్ 9వ తేదీ నాటికి రేవంత్ సర్కార్ ఏడాదా పాలన పూర్తి అయింది. కీలకమైన హామీలను అమలు చేస్తూ… ప్రజా పాలనకు అద్దం పట్టేలా పాలన సాగిందని ప్రభుత్వంలోని మంత్రులు, నేతలు చెప్పుకొస్తున్నారు.
కాంగ్రెస్ ఏడాది పాలన వేళ ప్రజాపాలన విజయోత్సవాలను కూడా నిర్వహించారు. తొమ్మిదిరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలు జరిగాయి. 9వ తేదీ సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. రాష్ట్రంలో రుణమాఫీతో పాటు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ వంటి హామీలను అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా… తెలంగాణ తల్లి విగ్రహంపై సీఎం ప్రకటన చేశారు. ఆ తర్వాత సభను 16వ తేదీకి వాయిదా వేశారు.
16 నుంచి ప్రారంభం…
అసెంబ్లీ సమావేశాలు 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. గత సమావేశాల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాదోపవాదనలు కొనసాగాయి. ఓవైపు సీఎం రేవంత్ సహా మంత్రులంతా… గత బీఆర్ఎస్ పాలను ప్రస్తావిస్తూ విమర్శలు, ప్రశ్నాస్త్రాలను సంధించారు. అయితే అంతే ధీటుగా బీఆర్ఎస్ వైపు నుంచి కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డి వంటి నేతలు… సమాధానాలు, ప్రశ్నలు సంధించారు. అయితే గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా… ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పటికీ సభలో మాట్లాడలేదు. మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ…. బడ్జెట్ లోని లోపాలను ఎత్తి చూపారు. కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ వస్తారా..?
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో ఈసారి కేసీఆర్ వస్తారా..? లేదా…? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్… ఈ ఏడాది కాలంలో అసెంబ్లీ వేదికగా మాట్లాడలేదు. బడ్జెట్ సందర్భంగా కేవలం హాజరయ్యారు. ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం కూడా స్పీకర్ ఛాంబర్ లోనే చేశారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలోని వైఫల్యాలను సభ వేదికగా ఎత్తి చూపాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇటీవలే కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. లగచర్ల భూముల అంశం, రుణమాఫీ, రైతు భరోసా, మూసీ సుందరీకరణ, హైడ్రా కూల్చివేతలు, తెలంగాణ తల్లి విగ్రహ మార్పు, గురుకులాల్లో పరిస్థితుల వంటి పలు కీలక అంశాలపై సర్కార్ ప్రశ్నించేలా సిద్ధమవ్వాలని సూచించారు.
బీఆర్ఎస్ తరపున ఉన్న ఎమ్మెల్యేలంతా సభకు వచ్చినప్పటికీ… కేసీఆర్ వస్తారా లేదా అనేది అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది. శాసనసభ వేదికగా కాంగ్రెస్ సర్కార్ ప్రశ్నిస్తారా..? లేక గత సమావేశాల తరహాలోనే కేటీఆర్, హరీశ్ రావులే అంతా తామై నడిపిస్తారా..? అనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.
మరోవైపు ఏడాది పాలనలో సాధించిన ప్రగతి, హామీల అమలుతో పాటు బీఆర్ఎస్ వ్యూహాలను ఢీకొట్టేలా సిద్ధమవ్వాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు… అంశాల వారీగా సిద్ధంగా ఉండాలని సూచిస్తోంది. సభలో బీఆర్ఎస్ తో పాటు బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొవాలని భావిస్తోంది. అంతేకాదు.. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్.. సభకు రావాలని సవాల్ కూడా విసురుతోంది. పదవి ఉన్నప్పుడే కాదు.. పదవి లేకున్నా ప్రజల కోసం పని చేయాలని హితవు పలుకుతోంది. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ సభకు హాజరై.. కాంగ్రెస్ విధానాలపై ప్రశ్నిస్తే ఈసారి సమావేశాలు మరో రేంజ్ లో జరగటం ఖాయమని చెప్పొచ్చు…!
సంబంధిత కథనం