Lagacharla Farmers : లగచర్ల రైతుకు బేడీలు - అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..!
లగచర్ల ఫార్మా బాధిత రైతుకు సంకెళ్లు వేయటం చర్చనీయాంశంగా మారింది. ఈర్యా నాయక్ అనే రైతుకు గుండె నొప్పి రావటంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఈ సమయంలో బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా జైల్లో ఉన్న లగచర్ల రైతుకు బేడీలు వేయటం చర్చనీయాంశంగా మారింది. హీర్యా నాయక్ అనే రైతును చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో తీసుకొచ్చారు. సదరు రైతుకు గుండెపోటు రావటంతో జైలు నుంచి ఆస్పత్రికి తీసుకురాగా.. బేడీలు వేయటంపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లగచర్ల దాడి ఘటనలో గత 30 రోజుల నుంచి 45 మంది రైతులు సంగారెడ్డి జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఈర్యా నాయక్ అనే రైతుకు గుండెపోటు వచ్చింది. అస్వస్థతు గురికావటంతో జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు.
కేటీఆర్ ఆగ్రహం…
గిరిజన రైతులకు బేడీలు వేయటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. గుండె నొప్పి వచ్చిన గిరిజన రైతు బిడ్డ హీర్యా నాయక్‌కు బేడీలు వేయడం అమానవీయం, రేవంత్ కూృర మనసత్వానికి నిదర్శనమని దుయ్యబట్టారు. వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం అలసత్వం చూపిందన్నారు. ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా, బయటకు చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. రాఘవేంద్ర, బసప్ప ఆరోగ్యం కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందని…పట్నం నరేందర్ రెడ్డికి కూడా అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
“గుండెపోటు వచ్చిన రైతుబిడ్డకు బేడీలు వేసి అన్యాయంగా, అమానవీయంగా ఆసుపత్రికి తీసుకువచ్చింది ప్రభుత్వం. స్ట్రెచర్ మీదనో, అంబులెన్స్ మీదనో తీసుకురావాల్సిన మనిషిని బేడీలు వేసి తీసుకువచ్చారు. ఇంతటి దుర్మార్గమైన అమానవీయమైన ప్రవర్తన క్షమార్హం కాదు రాజ్యాంగంలోని 14, 16, 19 ఆర్టికల్స్ ప్రకారం వారి హక్కులను హరించడమే. నూతన క్రిమినల్ చట్టం బీఎన్ఎస్ఎస్ ప్రకారం కూడా, పోలీస్ మాన్యువల్స్, జైల్ మాన్యువల్స్ ప్రకారం అండర్ ట్రావెల్స్ ఖైదీల హక్కులను హరించడమే. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర గవర్నర్ ఈ అంశంలోని తగిన విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అని కేటీఆర్ కోరారు.
ఇప్పటికైనా ప్రభుత్వం బేషజాలకు పోకుండా గిరిజనులను రైతన్నలపై నమోదైన కేసులను వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు." తన పైన ఎలాంటి దాడి జరగలేదని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తన వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకొని వారిపై కేసులు పెట్టించారు. ఆయన అహంకారం దెబ్బతిన్నదని, ప్రతిష్టకు తీసుకొని అదే రోజు 17 మంది రైతన్నలను అరెస్ట్ చేయించారు. అదుపులోకి తీసుకున్న రైతన్నలందరిని పోలీసులు థర్డ్ డిగ్రీ టార్చర్ చేయడం జరిగింది" అని కేటీఆర్ గుర్తు చేశారు.
సీఎం రేవంత్ సీరియస్…!
లగచర్ల రైతుకు బేడీలు వేసిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై అధికారుల నుంచి ఆరా తీశారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారు.
సంబంధిత కథనం