Star Maa New Serial: స్టార్ మాలో సరికొత్త సీరియల్.. బిగ్ బాస్ టైమ్‌లోనే టెలికాస్ట్.. ఎప్పటి నుంచంటే?
Star Maa New Serial: స్టార్ మా ఛానెల్లో సరికొత్త సీరియల్ రాబోతోంది. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కల్యాణ్ నటించిన ఈ సీరియల్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ ప్రసారమవుతున్న సమయంలోనే రానుంది.
Star Maa New Serial: టాప్ సీరియల్స్ తో దూసుకెళ్లే స్టార్ మా ఇప్పుడు మరో సరికొత్త సీరియల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. తాజాగా గురువారం (డిసెంబర్ 12) సీరియల్ టైమింగ్స్ రివీల్ చేస్తూ.. ప్రోమోను రిలీజ్ చేసింది. ఇద్దరు పూర్తి భిన్నమైన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు పెళ్లితో ఎలా ఒక్కటవుతారు? తర్వాత వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపు తిరుగుతాయన్నది నువ్వుంటే నా జతగా సీరియల్లో చూడొచ్చు.
నువ్వుంటే నా జతగా సీరియల్ టైమింగ్స్
స్టార్ మా ఛానెల్లో నువ్వుంటే నా జతగా సీరియల్ డిసెంబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ రాత్రి 10 గంటలకు టెలికాస్ట్ కానుంది. డిసెంబర్ 15తో బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ ముగియనుండటంతో.. సోమవారం (డిసెంబర్ 16) నుంచి కొత్త సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సీరియల్లో బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ కంటెస్టెంట్ అర్జున్ కల్యాణ్, బెంగాలీ నటి అనుమితా దత్తా లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ ఇద్దరూ దేవ, మిధున అనే పాత్రల్లో కనిపిస్తున్నారు. "దేవ, మిధున.. ఇద్దరూ భిన్నమైన వ్యక్తులు.. వాళ్లను విధి ఒక్కటి చేసింది. వాళ్ల ప్రయాణాన్ని చూడండి. నువ్వుంటే నా జతగా సీరియల్ డిసెంబర్ 16న ప్రీమియర్ కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు" అనే క్యాప్షన్ తో కొత్త ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది.
నువ్వుంటే నా జతగా సీరియల్ ప్రోమో ఎలా ఉందంటే?
నువ్వుంటే నా జతగా సీరియల్లో దేవా పాత్ర పోషిస్తున్న అర్జున్ కల్యాణ్.. ఓ బాధ్యత లేకుండా తిరిగే యువకుడిగా, రౌడీగా నటిస్తున్నాడు. ఈ ప్రోమో మొదట్లోనే.. అతడు రోడ్డుపై ఓ యువకుడి వెంట పడుతూ అతన్ని కొట్టడానికి ప్రయత్నించగా.. అనుకోకుండా అతని తండ్రి స్కూటరుపై ఎదురొస్తాడు. తండ్రినని ఆలోచిస్తున్నావా.. ఇంతకాలం నువ్వు చేస్తున్న పనులకు తలదించుకొని బతుకుతున్నానంటూ ఆ తండ్రి అంటాడు.
మరోవైపు కాబోయే భర్త తన కుటుంబంలాగే ఎంతో బాగుంటుండని కలలు కంటూ ఉంటుంది మిధున. మరి పూర్తి భిన్నమైన మనస్తత్వాలు ఉన్న ఈ ఇద్దరూ ఎలా కలుస్తారు? వీళ్ల పెళ్లి ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందన్నది ఈ నువ్వుంటే నా జతగా సీరియల్లో చూడొచ్చు. ఈ సరికొత్త సీరియల్ వచ్చే సోమవారం (డిసెంబర్ 16) నుంచి రాత్రి 10 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. ఈ మధ్యే స్టార్ మాలో ప్రారంభమైన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రేక్షకుల ఆదరణ సంపాదిస్తూ మంచి టీఆర్పీలు సాధిస్తోంది. మరి ఈ కొత్త సీరియల్ ఏం చేస్తుందో చూడాలి.