TDP 6 Months Rule : రాష్ట్రమే ఫస్ట్.. ప్రజలే ఫైనల్.. ఆరు నెలల పాలనపై చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
TDP 6 Months Rule : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలు అయ్యింది. ఈ 6 నెలల పాలనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రమే ఫస్ట్.. ప్రజలే ఫైనల్ నినాదంతో పరిపాలన చేస్తున్నట్టు వ్యాఖ్యానించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌తో పనిచేస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఆరు నెలల ప్రభుత్వ పాలనపై సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో.. ఆరు నెలలు గడిచిందన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు.. సుపరిపాలనతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రమే ఫస్ట్.. ప్రజలే ఫైనల్ అనే నినాదంతో.. ప్రతిక్షణం ప్రజలకు మంచి చేసేందుకు పనిచేస్తున్నామని వివరించారు. స్వర్ణాంధ్ర-2047 విజన్‌తో ఏపీని నెం.1గా నిలబెడతామని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.
'రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయ్యింది. ఐదేళ్లలో విధ్వంసమైన రాష్ట్రం, అస్తవ్యస్తమైన వ్యవస్థలు, అప్పులు వారసత్వంగా వచ్చాయి. సంక్షోభాలను అవకాశాలుగా తీసుకొని సంక్షేమంగా మలిచే చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ.. రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తోంది. పిచ్చిపిచ్చి రంగులు ఉండవు.. మా బొమ్మలు కనిపించవు.. పబ్లిసిటీ కంటే రియాలిటీకే మా ప్రాధాన్యం. రాష్ట్రమే ఫస్ట్...ప్రజలే ఫైనల్ అనే నినాదం కూటమి ప్రభుత్వ విధానంగా అమలు చేస్తూ.. ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. అందరి సహకారంతో స్వర్ణాంధ్ర - 2047 విజన్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపజేస్తాం' అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
అయితే.. కూటమి ప్రభుత్వ 6 నెలల పాలనపై వైసీపీ ఘాటైన విమర్శలు చేస్తోంది. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. ప్రజలు మోసం చేశారని ఆరోపిస్తోంది. 'ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు చంద్రబాబు తూట్లు పొడిచారు. అన్ని వర్గాలను నమ్మించి అధికారంలోకి వచ్చాక నయవంచనకు పాల్పడ్డారు. మహిళలు, రైతులు, పిల్లలు, నిరుద్యోగులను నిలువునా ముంచారు. డైవర్షన్ పాలిటిక్స్‌తో కాలక్షేపం చేస్తున్నారు' అని వైసీపీ ఆరోపిస్తోంది.
'రైతులకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం హామీని నెరవేర్చలేదు. ప్రతి మహిళకి ఏడాదికి రూ.18,000 సాయం.. ఉచిత బస్సు ప్రయాణం లేదు. తల్లికి వందనం, యువతకు నిరుద్యోగ భృతిని అమలు చేయడం లేదు. చంద్రబాబు ఆరు నెలల పాలనలో అన్నీ మోసాలే కనిపిస్తున్నాయి. స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్ధికీ ఏడాదికి రూ.15 వేలు.. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తాం అని చెప్పారు. 46 లక్షల మంది తల్లుల ఎదురుచూస్తున్నారు' అని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
'ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున ఆర్ధిక సహాయం చేస్తామన్నారు. వాటి కోసం 54 లక్షల మంది రైతన్నల ఎదురుచూస్తున్నారు. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఇప్పటికే రెండు సిలిండర్లు ఎగనామం పెట్టారు. నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు' అని కూటమి ప్రభుత్వం పాలనపై వైసీపీ ఫైర్ అవుతోంది.