CRDA R5 Zone: అమరావతిలో ఆర్‌5 జోన్ లబ్దిదారులకు సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలు, హడ్కో నుంచి మరో రూ.12వేల కోట్ల రుణం-r5 zone beneficiaries in amaravati to get house plots in their own districts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Crda R5 Zone: అమరావతిలో ఆర్‌5 జోన్ లబ్దిదారులకు సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలు, హడ్కో నుంచి మరో రూ.12వేల కోట్ల రుణం

CRDA R5 Zone: అమరావతిలో ఆర్‌5 జోన్ లబ్దిదారులకు సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలు, హడ్కో నుంచి మరో రూ.12వేల కోట్ల రుణం

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 12, 2024 01:56 PM IST

CRDA R5 Zone: అమరావతి మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వ హయంలో కొత్తగా సృష్టించిన ఆర్‌ 5 జోన్‌పై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన లబ్దిదారులకు సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలను కేటాయించనున్నట్టు సీఆర్‌డిఏ కమిషనర్‌ భాస్కర్ కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు.

ఆర్‌5 జోన్‌లో ఇళ్ల స్థలాల లబ్దిదారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
ఆర్‌5 జోన్‌లో ఇళ్ల స్థలాల లబ్దిదారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)

CRDA R5 Zone: అమరావతిలో వైసీపీ ప్రభుత్వ హయంలో సీఆర్డిఏ మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చిన ఆర్‌5 జోన్‌ పై కలెక్టర్ల సమావేశంలో సీఆర్డీఏ కమిషనర్‌ కాటమనేని భాస్కర్ స్పష్టత ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన జగనన్న ఇళ్ల స్థలాల లబ్దిదారులకు వారి సొంత జిల్లాల్లోనే ఇంటి స్థలాలు కేటాయించనున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం ఎన్టీార్‌, గుంటూరు జిల్లాల కలెక్టర్లు సహకరించాలని కోరారు. భూములను ఎంపిక చేస్తే సీఆర్డీఏ నిధులు సమకూరుస్తుందన్నారు.

రాజధానికి సంబంధించిన 15 వేల కోట్ల రుణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు తమ బోర్డు మీటింగ్ లో క్లియర్ చేసిందని, డిసెంబరు 19 తేదీన ప్రపంచబ్యాంకు బోర్డు కూడా అమరావతి రుణంపై నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. జనవరి నాటికి 31 వేల కోట్ల రుణం అమరావతి నిర్మాణానికి అందుబాటులోకి వస్తుందన్నారు.

జూన్ లో సీఎం చంద్రబాబు పర్యటన తర్వాత రాజధాని నిర్మాణంపై రోడ్ మ్యాప్ ఇచ్చారని, గడచిన మూడు నెలల్లో ధ్వంసమైన పరిస్థితుల్ని గాడిన పెట్టగలిగామన్నారు. గడచిన ఐదేళ్లలో పనులు ఆగిపోయాయి, చాలా మెటిరియల్ దొంగిలించారని వివరించారు. రహదారులను కూడా తవ్వేశారని, యంత్రాలు కూడా పాడైపోయాయని చెప్పారు.

మొత్తంగా అంతా ధ్వంసమైన పరిస్థితి అక్కడి నుంచి మొదలు పెట్టి పునర్నిర్మాణం దిశగా అడుగులేస్తున్నట్టు వివరించారు. రాజధాని పునర్నిర్మాణంపై ఇంజనీర్లు, ఐఐటీ చెన్నై, హైదరాబాద్ నిపుణులతో అధ్యయనం చేయించి ఓ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశామని, ఇప్పుడు కొత్త పనులు చేపట్టేందుకు వీలుగా కార్యాచరణ సిద్ధం చేయగలిగామన్నారు.

రూ.20,500 కోట్ల పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి పాలనా అనుమతులు కూడా తీసుకున్నట్టు తెలిపారు. హడ్కో కూడా మరో రూ. 11 వేల కోట్లు కూడా రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందని మొత్తంగా 31 వేల కోట్ల రూపాయల మేర రుణం రాజధాని నిర్మాణాలకు అందుబాటులోకి వస్తుందన్నారు.

కీలకమైన నిర్మాణాలతో పాటు రైతులకు ఇచ్చే ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ లే అవుట్ లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఈ నిధులతోనే పూర్తి చేస్తామన్నారు. రాజధానిలో పనుల్లో మానవ వనరులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కూడా ప్రపంచబ్యాంకు నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.

ఆర్ 5 జోన్ కారణంగా మాస్టర్ ప్లాన్ లో ఇబ్బందులు వచ్చాయని, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని లబ్దిదారులకు ఆయా జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. లబ్దిదారులకు స్థలాలు ఇచ్చేందుకు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ముందుకు రావాల్ి ఉందన్నారు. ఇళ్ల స్థలాల కోసం డీపీఆర్ లు సిద్దం చేస్తే అందుకు అనుగుణంగా నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

వైసీపీ ప్రభుత్వ హయంలో అమరావతిలో పేదలకు ఇంటి స్థలాలను కేటాయించడంతో పాటు లే ఔట్‌ అభివృద్ధి చేయడంపై రైతులు కోర్టును ఆశ్రయించారు. 50వేల మందికి ఇంటి పట్టాలు కూడా జగన్‌ చేతులు మీదుగా జారీ చేశారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో ఇళ్లు లేని వారికి అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించారు.

Whats_app_banner

సంబంధిత కథనం