Plane splits in half: హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్: రెండు ముక్కలైన విమానం; అమెరికాలో ఘటన
Plane splits in half: అమెరికాలోని టెక్సస్ లో హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించిన ఒక విమానం కుప్పకూలిపోయి రెండు ముక్కలైంది. తక్కువ ఎత్తులో ఎగురుతూ క్రాష్ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తూ హైవే పై ఉన్న పలు వాహనాలను ఆ విమానం ఢీ కొట్టింది.
Plane splits in half: అమెరికాలో దక్షిణ టెక్సాస్ హైవేపై బుధవారం ఓ చిన్న ట్విన్ ఇంజిన్ ప్రొపెల్లర్ విమానం మూడు కార్లను ఢీకొట్టింది. ఆ విమానం హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
రెండు ముక్కలైన విమానం
ఒక చిన్న విమానం దక్షిణ టెక్సాస్ హైవేపై క్రాష్ ల్యాండింగ్ కు ప్రయత్నించింది. అంతకు ముందు తక్కువ ఎత్తులో ఎగురుతూ, రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలను ఢీ కొట్టింది. అనంతరం హైవే పై ఉన్న ఒక బ్రిడ్జిని ఢీ కొట్టి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ఆ చిన్న విమానం రెండు ముక్కలైంది. విమాన శకలాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడడంతో ఆ హైవే పై భారీగా వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
టెక్సాస్ లోని విక్టోరియాలోని స్టేట్ హైవేపై..
టెక్సాస్ లోని విక్టోరియాలోని స్టేట్ హైవే లూప్ 463పై మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా, ముగ్గురికి ప్రాణాపాయం తప్పింది. నాలుగో వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక కేంద్రానికి తరలించారు. హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ముందు విమానం తక్కువగా ఎగురుతూ పలు వాహనాలను ఢీకొట్టింది. విమానం ప్రమాదానికి ముందు రోడ్డుపైకి దిగుతున్న దృశ్యాలను సోషల్ మీడియా ఫుటేజీలో చిత్రీకరించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, పలువురికి గాయాలయ్యాయని విక్టోరియా పోలీస్ డిపార్ట్ మెంట్ డిప్యూటీ పోలీస్ చీఫ్ ఎలిన్ మోయా తెలిపారు.
సహాయ చర్యలు ప్రారంభం
ఎమర్జెన్సీ రెస్పాండెంట్స్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు సహాయం చేసి శిథిలాలను తొలగించారు. ఈ ప్రమాదంతో హైవేపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతానికి దూరంగా ఉండాలని డ్రైవర్లకు సూచించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు దారితీసిన సంఘటనలను క్రోడీకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (ఎన్టీఎస్బీ)కి సమాచారం అందించి మరింత లోతుగా దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు.
వీడియో వైరల్
ఆ విమానం క్రాష్ ల్యాండ్ కావడాన్ని కొందరు వాహనదారులు తమ స్మార్ట్ ఫోన్స్ లో చిత్రించి, సోషల్ మీడియా (social media) లో పోస్ట్ చేశారు. విమానం అకస్మాత్తుగా దిగడం, తరువాత కూలిపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని సాక్షులు వర్ణించారు. "అది అలా పడిపోవడం చూస్తే భయం వేసింది" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వ్యక్తి చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత తాను విమానం వద్దకు వచ్చానని, పైలట్ స్పృహలో ఉన్నాడని, కానీ అతడిని బయటకు తీయలేకపోయానని వివరించారు.
టాపిక్