Allam Perugu Pachadi: అల్లం పెరుగు పచ్చడి అప్పుడప్పుడు చేసుకొని తినండి చలికాలంలో జలుబు రాకుండా ఉంటుంది
Allam Perugu Pachadi: అల్లం పెరుగు పచ్చడి రెసిపీని తినడం వల్ల చలికాలంలో జలుబు, దగ్గు వంటివి రాకుండా ఉంటాయి. ఆయుర్వేద ఔషధంగా కూడా చెప్పుకోవచ్చు.
అల్లం పెరుగు పచ్చడి చలికాలంలో అప్పుడప్పుడు తినడం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి అందుతుంది. ముఖ్యంగా జలుబు దగ్గు వంటివి రాకుండా ఉంటాయి. దీన్ని అన్నంతో తింటే టేస్టీగా ఉంటుంది. అల్లం పేరు చెప్పగానే ఎక్కువమంది తినేందుకు ఇష్టపడరు. కానీ ఒకసారి అల్లం పెరుగు పచ్చడి చేసుకొని తినండి. మీకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. ఇది ఔషధంలా పనిచేస్తుంది.
అల్లం పెరుగు పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
అల్లం ముక్క - నిమ్మకాయ సైజులో
కరివేపాకులు - గుప్పెడు
మెంతులు - ఒక స్పూను
పచ్చిమిర్చి - రెండు
పచ్చి కొబ్బరి తురుము - ఒక కప్పు
పసుపు - పావు స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
ఆవాలు - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
నీళ్లు - తగినన్ని
పెరుగు - ఒక కప్పు
జీలకర్ర - అర స్పూను
ఇంగువ - చిటికెడు
పచ్చిశనగపప్పు - ఒక స్పూన్
ఎండుమిర్చి - ఒకటి
మినప్పప్పు - ఒక స్పూను
అల్లం పెరుగు పచ్చడి రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి మెంతులు వేసి వేయించాలి.
2. ఆ తర్వాత కరివేపాకులను కూడా వేసి వేయించాలి. స్టవ్ ఆఫ్ చేయాలి.
3. మిక్సీ జార్లో మెంతులు, కరివేపాకులు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, పచ్చి కొబ్బరి తురుము వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
4. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.
5. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి.
7. ఆ నూనెలో ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ, మినపప్పు, శనగపప్పు వేసి వేయించాలి.
8. ఇవి వేగాక పచ్చికొబ్బరి, అల్లం మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసి రెండు నిమిషాలు కలుపుకొని వేయించుకోవాలి.
9. పైన కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి.
10. తర్వాత కప్పు పెరుగును తీసి బాగా చిలికి అందులో ఈ పచ్చి కొబ్బరి అల్లం మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి.
11. అంతే టేస్టీ అల్లం పెరుగు పచ్చడి రెడీ అయినట్టే.
12. దీన్ని ఒక్కసారి తిని చూడండి రుచి అదిరిపోతుంది.
13. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే పరాటాలతో కూడా ఇది టేస్టీగా ఉంటుంది.
ఇందులో మనం వాడిన అల్లం, మెంతులు, కరివేపాకులు, పచ్చికొబ్బరి, పసుపు, పెరుగు అన్నీ కూడా రోగనిరోధక శక్తిని పెంచేవే. చలికాలంలో ఫ్లూ, జలుబు, దగ్గు వంటివి తరచూ దాడి చేస్తూ ఉంటాయి. వాటిని తట్టుకోవాలంటే ఈ పచ్చడిని అప్పుడప్పుడు తినండి. ఇది శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యాన్ని అందిస్తుంది.
టాపిక్