Nayanthara: నయనతారకి హైకోర్టు నోటీసులు.. ధనుష్ వివాదంలో లేడీ సూపర్‌స్టార్ చుట్టూ బిగిస్తున్ను ఉచ్చు
Nayanthara Beyond the Fairytale documentary: నయనతార డాక్యుమెంటరీ వివాదం ఇంకా కొనసాగతూనే ఉంది. మద్రాస్ హైకోర్టుని ధనుష్ ఆశ్రయించగా.. విచారణ జరిపిన కోర్టు నయనతారకి నోటీసులు జారీ చేసింది. దాంతో…?
లేడీ సూపర్ స్టార్ నయనతారకి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హీరో ధనుష్, నయనతార మధ్య గత కొన్ని రోజుల నుంచి ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో వినియోగించిన 3 సెకన్ల క్లిప్ గురించి వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు నయనతారకి ధనుష్ నోటీసులు పంపగా.. ఆమె సమాధానం ఇవ్వలేదు. దాంతో మద్రాస్ హైకోర్టుని ధనుష్ ఆశ్రయించాడు.
అసలు ఏంటి ఈ వివాదం?
ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన నేనూ రౌడీనే సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి జంటగా నటించారు. 2016లో రిలీజైన ఈ మూవీకి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా.. అప్పట్లో ఈ మూవీ షూటింగ్‌లోనే ప్రేమలో పడిన నయన్, విఘ్నేశ్ అనంతరం పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే.. నేనూ రౌడీనే మూవీ బడ్జెట్ పరిమితికి మించిపోగా.. సినిమా హిట్ అయినా ధనుష్‌కి లాభాలు రాలేదు. సినిమా బడ్జెట్ ఇలా పెరిగిపోవడానికి కారణం.. నయనతార, విఘ్నేశ్ అని ధనుష్ కోపం పెంచుకున్నాడు.
పట్టువీడని నయనతార
నయనతార తన పర్సనల్, ప్రొఫెషన్ లైఫ్‌లో జరిగిన వాటి ఆధారంగా ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఈ డాక్యుమెంటరీలో నేనూ రౌడీనే సినిమాలోని ఒక డైలాగ్ క్లిప్‌ను వాడాలని నయనతార ఆశించింది. ఈ మేరకు ఆ మూవీ ప్రొడ్యూసరైన ధనుష్ నుంచి నిరభ్యంతర పత్రం కోరడానికి ప్రయత్నించగా.. అతను ఎన్‌వోసీ ఇచ్చేందుకు నిరాకరించారు. అయినప్పటికీ.. ఓ 3 సెకన్ల క్లిప్‌ను నయనతార ఆ డాక్యుమెంటరీలో వాడింది. దాంతో కాపీ రైట్ కింద రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలని ధనుష్ నోటీసులు పంపాడు.
కోర్టుకెక్కిన వ్యవహారం
ధనుష్ నోటీసులపై బహిరంగ లేఖతో నయన్ స్పందిస్తూ.. పాత విషయాల్ని మనసులో పెట్టుకుని వేధింపులకి దిగుతున్నట్లు ఆరోపించింది. అయినప్పటికీ.. ధనుష్ ఆ డాక్యుమెంటరీ నుంచి క్లిప్‌ను తొలగించాలని 48 గంటలు గడువు ఇచ్చాడు. కానీ.. నయన్ వెనక్కి తగ్గలేదు. దాంతో మద్రాస్ హైకోర్టుని ధనుష్ ఆశ్రయించగా.. విచారణ జరిపిన కోర్టు నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్‌తో పాటు డాక్యుమెంటరీని స్ట్రీమింగ్‌కి ఉంచి నెట్‌ప్లిక్స్‌కీ నోటీసులు పంపింది. ఈ వ్యవహారంపై జనవరి 8 లోపు సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో మద్రాస్ హైకోర్టు పేర్కొంది.