Makara Sankranthi 2025: సంక్రాంతి, భోగి, కనుమ విశిష్టత.. ఏం చేస్తే మంచి జరుగుతుంది?-makara sankranthi 2025 greatness and what to do and what we should not do on sankranthi ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Makara Sankranthi 2025: సంక్రాంతి, భోగి, కనుమ విశిష్టత.. ఏం చేస్తే మంచి జరుగుతుంది?

Makara Sankranthi 2025: సంక్రాంతి, భోగి, కనుమ విశిష్టత.. ఏం చేస్తే మంచి జరుగుతుంది?

Peddinti Sravya HT Telugu
Dec 12, 2024 02:30 PM IST

Makara Sankranthi 2025: సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. సంక్రాంతి నాడు ఎలాంటి ఆచారాలను పాటిస్తారు..? సంక్రాతి నాడు అసలు ఏం చేస్తే మంచిది..? రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని మూడు రోజులు పాటు జరుపుతారు. ఆ పద్దతుల గురించి మరి ఎలాంటి ఆలస్యం లేకుండా చూసేయండి.

Makara Sankranthi 2025: సంక్రాంతి, భోగి, కనుమ విశిష్టత.. ఏం చేస్తే మంచి జరుగుతుంది?
Makara Sankranthi 2025: సంక్రాంతి, భోగి, కనుమ విశిష్టత.. ఏం చేస్తే మంచి జరుగుతుంది? (PC: Canva)

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో సంక్రాంతి ఒకటి. సంక్రాంతిని పెద్ద పండుగ, మకర సంక్రాంతి అని కూడా అంటారు. సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. సంక్రాంతి నాడు ఎలాంటి ఆచారాలను పాటిస్తారు..? సంక్రాతి నాడు అసలు ఏం చేస్తే మంచిది..? రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని మూడు రోజులు పాటు జరుపుతారు. ఆ పద్దతుల గురించి మరి ఎలాంటి ఆలస్యం లేకుండా చూసేయండి.

భలే భోగి

సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుతారు. ఆంధ్ర, తెలంగాణలో కూడా వారి వారి రీతిలో నాలుగు రోజులు ఈ పండుగను సంతోషంగా జరుపుతారు. మొదటిరోజు భోగి నాడు భోగి మంటలు వెలిగిస్తారు. చలి పారద్రోలడానికే కాకుండా కొత్త వాటితో నూతన జీవితాన్ని మొదలుపెట్టడానికి గుర్తుగా, ఇంట్లో ఉన్న పాత సామాన్లు వేసి మంటలు వెలిగిస్తారు. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లల్లో భోగి పండ్లు పోయడం, ముత్తయిదువులని పిలిచి పేరంటం చేస్తారు. అలాగే చిన్నపిల్లలు బొమ్మల కొలువుని కూడా ఏర్పాటు చేస్తారు.

భోగి పండ్లు

చిన్నారుల తలపై భోగినాడు భోగి పళ్లు పోస్తారు. భోగి రోజున బదరీ వనంలో శ్రీ హరిని పసివాడిగా మార్చి బదరీ పళ్లతో అభిషేకం చేస్తారు. అది భోగి పళ్లుగా మారింది. రేగు పళ్లను చిన్నారుల శిరస్సుపై పోయడం వలన ఆయురారోగ్యాలతో వర్థిల్లుతారని నమ్మకం.

సంబరాల సంక్రాతి

ప్రతి సంవత్సరం జనవరి 15న సంక్రాంతి పండుగ వస్తుంది. సంక్రాంతి పండుగ నాడు కొంతమంది పూర్వీకుల ఆత్మ శాంతి కలగాలని, వారి యొక్క సామర్ధ్యాలు మేరకు దానధర్మాలు చేస్తారు. సంక్రాతి నాడు దానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. దాన్యం, పండ్లు, వస్త్రం, కాయగూరలు ఇటువంటివి దానం చేస్తే చక్కటి ఫలితం కలుగుతుంది. అదే గోదానం చేస్తే స్వర్గవాసం కలుగుతుంది.

సంక్రాంతికి ఊరంతా కళకళ్లాడుతుంది. కొత్త అల్లుళ్లతో, కోడిపందాలతో, పిండి వంటలతో ఎంతో సంతోషంగా మకర సంక్రాంతి పండుగని జరుపుకుంటారు. ఆంధ్రలో ముఖ్యంగా గోదారి ప్రాంతాల్లో అయితే సంక్రాంతిని బాగా జరుపుతారు. గంగిరెద్దులు, హరిదాసులు ఇలా ఇవన్నీ కూడా మనం సంక్రాంతికి చూడొచ్చు. పిల్లలందరికీ కూడా సంక్రాంతి పండుగ చాలా ఇష్టం. ఉదయం నుంచి సాయంత్రం దాకా పిల్లలు గాలిపటాలతో సమయాన్ని గడుపుతూ ఆడుకుంటారు.

భువికొచ్చిన గంగమ్మ:

కొన్ని పురాణాల ప్రకారం మకర సంక్రాంతి నాడు భగీరథుడు తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భువి పైకి తీసుకువచ్చాడని నమ్ముతారు. పూర్వికులకు తర్పణాలు సమర్పించడానికి, భగీరథ మహర్షి గంగను భూమి పైకి ఆహ్వానిస్తారు. అందుకు ఒప్పుకున్న గంగమ్మ భూమి పైకి వచ్చిందని.. అందుకని ఈ పండగ జరుపుతారని అంటారు.

కమ్మని విందుల కనుమ

కనుమ నాడు వ్యవసాయంలో ఎంతో సహాయపడే పశువులకు శుభాకాంక్షలు తెలుపుతారు. అందుకనే ఈ పండుగనే జరుపుతారు. ఆంధ్రప్రదేశ్లో కనుమనాడు మాంసాహారం తినడం ఆనవాయితీగా వస్తోంది. మాంసాహారులు కాని వారైతే గారెలు చేసుకుంటారు. క్రిష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో కోడి పందాలు, ఎడ్ల పందాలు జరుపుతారు.

సంక్రాతి నాడు ఏం చేస్తే మంచిది?

సంక్రాంతి నాడు చేసే దానానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. మకర సంక్రాంతి నాడు పేదలకు నువ్వులు, బెల్లం దానం చేయడం మంచిది. ఇలా చేస్తే సూర్య భగవానుడు ఆశీస్సులు కలుగుతాయి. సూర్య భగవానుడు సంతోషపడతారు.

సంక్రాంతి నాడు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో సూర్యుడిని ఆరాధించాలి. ఇలా చేయడం వలన విశేష ఫలితాలు ఉంటాయి. సూర్యునికి అర్ఘ్యం కూడా సమర్పిస్తే మంచిది.

కుదిరితే పవిత్ర నదిలో స్నానం చేయడం మంచిది. సంక్రాంతి నాడు పవిత్ర నదిలో స్నానం చేయడం వలన సర్వ పాపాలు తొలగిపోతాయి. మరణం తర్వాత మోక్షాన్ని పొందవచ్చు. ఒకవేళ అలా అవ్వకపోతే గంగాజలాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకోవచ్చు. తర్పణం ఇస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. మకర సంక్రాంతి నాడు పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తర్పణం ఇస్తే మంచి జరుగుతుంది.

మకర సంక్రాంతి నాడు నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే ప్రతికూల శక్తి కలుగుతుంది. కాబట్టి నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినొద్దు. అనవసరమైన వాదనలకు కూడా సంక్రాంతి నాడు దూరంగా ఉండాలి. అలాగే సంక్రాంతి నాడు పేద లేదా సహాయం కోసం వచ్చిన వ్యక్తిని గౌరవించాలి.

Whats_app_banner

సంబంధిత కథనం