Attempt Murder case on Mohan Babu : మోహన్‌బాబుపై అటెంప్ట్ మర్డర్ కేసు.. మంచు లక్ష్మి ఇంట్రెస్టింగ్ పోస్ట్!
Attempt Murder case on Mohan Babu : మంచు ఫ్యామిలీ వివాదం చినికి చినికి గాలి వానగా మారుతోంది. తాజాగా మోహన్ బాబుపై తెలంగాణ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. జర్నలిస్టుపై దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి ఆసక్తికర పోస్టు చేశారు.
హీరో మంచు మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు అటెంప్ట్ కేసు నమోదు చేశారు. ఓ టీవీ ఛానెల్ ప్రతినిధిపై దాడి ఘటనలో మోహన్ బాబుపై మొదట బీఎన్‌ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుపై లీగల్ ఒపీనియన్ తీసుకున్న తెలంగాణ పోలీసులు.. 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
ఏం జరిగింది..
మంచు కుటుంబ వివాదం నేపథ్యంలో మంగళవారం జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసానికి చాలామంది మీడియా ప్రతినిధులు వెళ్లారు. సహనం కోల్పేయిన మోహన్ బాబు, ఆయన బౌన్సర్లు, అనుచరులు.. గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేశారు. ఈ క్రమంలో కర్రలతో దాడిచేశారు. మోహన్ బాబు ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మైకు లాక్కుని ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో మరో ఛానల్ కెమెరామన్ కింద పడ్డాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదైంది.
మంచు లక్ష్మి పోస్టు..
మంచు ఫ్యామిలీ వివాదం నడుస్తున్న నేపథ్యంలో.. సోషల్ మీడియాలో మంచు లక్ష్మి మరో పోస్ట్ చేశారు. ప్రపంచంలో ఏదీ మీది కానప్పుడు.. ఏం కోల్పోతారని భయపడుతున్నారంటూ ట్వీట్ చేశారు. మోహన్ బాబుపై కేసు నేపథ్యంలో మంచు లక్ష్మి పోస్టు చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టు చేశారనే చర్చ జరుగుతోంది.
జర్నలిస్టుకు చికిత్స..
మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్ట్ రంజిత్‌కు యశోద ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. జైగోమాటిక్ బోన్‌ను వైద్యుల బృందం సరిచేసింది. కంటికి, చెవికి మధ్య మూడు లెవెల్స్‌లో ఫ్రాక్చర్లు అయ్యాయి. జైగోమాటిక్ ఎముక మూడు చోట్ల విరిగింది. ఫ్రాక్చర్లు అయిన చోట సర్జరీ చేసి.. స్టీల్ ప్లేట్ అమర్చారు యశోద ఆస్పత్రి వైద్యులు. రంజిత్‌ను అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు చెబుతున్నారు.
హైకోర్టుకు మోహన్ బాబు..
మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో కాస్త ఊరట లభించింది. పోలీసుల ఎదుట విచారణ నుంచి మినహాయింపు ఇస్తూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మంచు కుటుంబ వ్యవహారం, మీడియాపై మోహన్ బాబు దాడి ఘటనపై విచారణకు హాజరుకావాలని రాచకొండ సీపీ నోటీసులు జారీ చేశారు. మీడియాపై దాడికి సంబంధించి మోహన్ బాబుపై కేసు కూడా నమోదైంది. అయితే.. పోలీసుల నోటీసులపై మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు.