Warangal Development : వరంగల్ అభివృద్ధిపై రేవంత్ సర్కారు స్పెషల్ ఫోకస్ ఎందుకు?
Warangal Development : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉత్తర తెలంగాణకు తలమానికంగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. వరంగల్ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎందుకో ఓసారి చూద్దాం.
తెలంగాణలో రాజధాని హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. అందుకే వరంగల్ అభివృద్ధిపై రేవంత్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. తెలంగాణలో హైదరాబాద్ స్థాయిలో వేరే ఏ నగరం లేదు. ఆ స్థాయిలో అభివృద్ధి చెందే అవకాశం వరంగల్‌కే ఉండటంతో.. ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి.. డెవలప్ చేస్తోంది. వరంగల్ నగరం అభివృద్ధి అయితే.. హైదరాబాద్‌పై ఒత్తడి తగ్గే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయపడ్డారు.
అన్నివిధాలా అవకాశం..
తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోలిస్తే.. వరంగల్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. హైదరాబాద్‌తో పోటీపడే అవకాశం కేవలం వరంగల్‌కే ఉంది. ఇక్కడ ట్రైన్ కనెక్టివిటి కీలకంగా మారింది. సౌత్, నార్త్ ఇండియాను కలిపే మార్గం వరంగల్ నుంచే వెళ్తుంది. కాజీపేట జంక్షన్ మీదుగా ఢిల్లీ, ముంబయి వంటి నగరాలకు రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి.
రోడ్లు..
వరంగల్ నుంచి ఎక్కడికైనా వెళ్లేలా రోడ్ల కనెక్టివిటీ ఉంది. ముఖ్యంగా వరంగల్ నుంచి హైదరాబాద్‌కు ఇప్పుడు కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చు. అటు ఏపీలోని విజయవాడ, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు వరంగల్ నుంచి రోడ్డు మార్గాల ద్వారా త్వరగా చేరుకోవచ్చు. గత పదేళ్లలో ఊహించని స్థాయిలో రోడ్ల అభివృద్ధి జరిగింది. ఇది వరంగల్ నగర అభివృద్ధికి బాటలు వేస్తోంది.
నీరు, వనరులు..
చెరువులకు పెట్టింది పేరు వరంగల్ జిల్లా. ఇక్కడ కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి నీటి కొరత అనే మాట లేదు. ఇక భూములు కూడా భారీగా ఉందుబాటులో ఉన్నాయి. ఏదైనా కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చినా.. కీలకమైన భూమి, నీరు, కరెంట్ అందుబాటులో ఉన్నాయి. వరంగల్ నగరంలో ఏ స్థాయి వారైనా నివాసం ఉండటానికి అనుకూలంగా ఉంటుంది.
ఎయిర్‌పోర్ట్..
వరంగల్ నగరానికి రైలు, రోడ్డు మార్గాలు బలం అయితే.. ఎయిర్‌పోర్ట్ లేకపోవడం బలహీనంగా మారింది. అందుకే రేవంత్ సర్కారు మామునూరు విమానాశ్రయంపై ఫోకస్ పెట్టింది. దీన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల మంత్రి పొంగులేటి.. ఎయిర్‌పోర్ట్ భూసేకరణపై ఆరా తీశారు. భూసేకరణ పూర్తయితే పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వస్తే.. రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉంటాయి.
ఏపీలో మాదిరిగా..
పొరుగున ఉన్న ఏపీలో రాజధాని విషయంలో గందరగోళ పరిస్థితులు ఉన్నా తెలంగాణలో అటువంటి సమస్య లేదు. కానీ.. ఏపీలో పెద్ద నగరాలు ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు వంటి నగరాలు ఉన్నాయి. వాటిల్లో గుంటూరు మినహా.. అన్నిచోట్ల ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. కానీ.. తెలంగాణలో పెద్ద నగరం అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే ఉంది. వేరేచోట్ల ఎయిర్‌పోర్టులు కూడా లేవు. దీంతో సెకెండ్ క్యాపిటల్‌గా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
పొంగులేటి సమీక్ష..
రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా వరంగల్ నగర అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వరంగల్ నగర అభివృద్ధిపై తాజాగా ఆయన సమీక్ష నిర్వహించారు. ఇన్నర్, ఔటర్ రింగు రోడ్లు, భద్రకాళి చెరువు అభివృద్ధి, విమానాశ్రయ నిర్మాణం తదితర అంశాలపై ఆయన చర్చించారు.