Hyderabad Musi Row : మూసీ ప్రాజెక్ట్ వద్దంటున్నారంటే.. గుజరాత్ మోడల్ ఫెయిల్ అయ్యిందా : రేవంత్
Hyderabad Musi Row : మూసీ పరివాహక బస్తీల్లో బీజేపీ నేతలు బస్తీ నిద్ర చేశారు. సీఎం రేవంత్ చేసిన సవాల్‌ను స్వీకరించి ఒకరోజు బస్తీ నిద్ర చేశారు. అయితే.. బీజేపీ నేతల బస్తీ నిద్రపై ముఖ్యమంత్రి స్పందించారు. కిషన్ రెడ్డి, బీజేపీపై సెటైర్లు వేశారు. మూసీ ప్రాజెక్టుకు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు.
బీజేపీ నేతల బస్తీ నిద్రపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కిషన్ రెడ్డి టార్గెట్‌గా రేవంత్ ఘాటు విమర్శలు చేశారు. సబర్మతి ప్రక్షాళనపై కిషన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. గుజరాత్ మోడల్ దేశానికి ఆదర్శమంటున్నారు.. మూసీ ప్రాజెక్ట్‌కు మాత్రం ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్ట్ వద్దంటున్నారంటే.. గుజరాత్ మోడల్ ఫెయిల్ అయ్యిందా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మూసీని బాగుచేయడం బీజేపీకి ఇష్టం లేదన్న రేవంత్ రెడ్డి.. మహారాష్ట్ర ప్రజలను మోసంచేసేలా షిండేను వాడుకున్నారని.. తెలంగాణలో కిషన్‌రెడ్డిని వాడుకుంటున్నారు అని విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్ నగరంలోని మూసీ పరివాహక బస్తీల్లో బీజేపీ నేతలు బస్తీ నిద్ర చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించి ఒకరోజు నిద్ర చేశారు. మూసీ ప్రక్షాళన చేయండని.. పేదల ఇళ్లను కూల్చకండి అనే నినాదంతో.. బస్తీ నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి మూసీ నిర్వాసితులతో కలిసి భోజనం చేశారు. మొత్తం 20 బస్తీల్లో ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబర్‌పేట తులసీ రామ్ నగర్‌లో కిషన్ రెడ్డి, ఓల్డ్ మలక్‌పేట శాలివాహన నగర్ లో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఎల్బీనగర్ ఫణిగిరికాలనీలో ఎంపీ ఈటల రాజేందర్, రాజేంద్రనగర్‌లో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బస్తీ నిద్ర చేశారు.
బస్తీ నిద్ర సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'మూసీ పరివాహక ప్రాంత ప్రజలపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. బుల్డోజర్లు వస్తాయనీ సీఎం ప్రకటించారు. ప్రజలు బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నరు. శంకరమ్మ ఇంట్లో రాత్రి బస చేశా. ఆమెకు నలుగురు కొడుకులు ఉన్నారు. డబుల్ బెడ్ రూం ఇస్తే ఎలా? ఇండ్లు కూల్చివేస్తారనే భయంతో పది మంది గుండె పోటుతో చనిపోయారు' అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
'రాహుల్‌కు సూటి ప్రశ్న.. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమేనా? ఈ పది నెలల కాలంలో ఒక్క ఇళ్లు కట్టలేదు. బీజేపీ మూసీకి వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారు. వేలాది ఇళ్లు కూల్చేయాల్సి వస్తుంది. మూసీ ప్రక్షాళనకు వేల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారు? ఇప్పటికి మూసీ డీపీఆర్ రాలేదు. ఫస్ట్ మూసీలో డ్రైనేజీ నీళ్లు, కాలుష్యం రాకుండా చేయండి. సీఎం, మంత్రులు, వివిధ అపార్ట్ మెంట్‌ల డ్రైనేజీ మూసీలో కలుస్తుంది' అని కిషన్ రెడ్డి వివరించారు.
'ఇళ్లన్నీ కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా? నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించాలి. ముఖ్యమంత్రికి మూసీ ప్రక్షాళన సలహా ఎవరిచ్చారో? ప్రభుత్వం పట్టింపులకు పోవద్దు. బీజేపీపై కోపంతో పేదల ఇళ్లు కూల్చొద్దు. గతంలో కేసీఆర్ ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ఫామ్ హౌస్‌కు వెళ్లిపోయాడు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అని భూటకపు హామీలు ఇచ్చింది. మహారాష్ట్రకు వెళ్లి సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఇచ్చిన హామీలు అమలు చేశామని చెబుతున్నారు. 420 సబ్ గ్యారంటీల పక్కన చేర్చొద్దు' కేంద్రమంత్రి హితవు పలికారు.
'వంద సంవత్సరాల క్రితం నిజాం రిటర్నింగ్ వాల్ కట్టాడు. ఇప్పుడు అదే విధంగా మూసీ ప్రక్షాళన చేయాలి. రేవంత్ రెడ్డి ఒక్క టర్మే సీఎం. సంఘ విద్రోహుల మీద బుల్డోజర్ ఎక్కించాలి. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు. ఇండ్లు కూల్చకుండా, పేదవాళ్లు నష్టపోకుండా మూసీ ప్రక్షాళన చేయాలనేదే మా డిమాండ్' అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.