Tula Rasi 2025 Telugu: తుల రాశి జాతకులకు సంవత్సరం అంతా బాగుంటుంది.. కానీ ఒక స్త్రీ వలన-tula rasi 2025 telugu know yearly horoscope prediction for libra zodiac sign ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Tula Rasi 2025 Telugu: తుల రాశి జాతకులకు సంవత్సరం అంతా బాగుంటుంది.. కానీ ఒక స్త్రీ వలన

Tula Rasi 2025 Telugu: తుల రాశి జాతకులకు సంవత్సరం అంతా బాగుంటుంది.. కానీ ఒక స్త్రీ వలన

HT Telugu Desk HT Telugu
Dec 12, 2024 04:02 PM IST

Tula Rasi 2025 Telugu: తులా రాశి 2025 రాశి ఫలాలను పంచాంగకర్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. కొత్త సంవత్సరంలో తులా రాశి వారికి ఆర్థికం, ఆరోగ్యం, కెరీర్, కుటుంబ జీవితం ఎలా ఉంటుందో సవివరంగా ఇక్కడ తెలుసుకోవచ్చు. జన్మ నక్షత్రం ఆధారంగా ఈ జాతకం ఉంటుందని గమనించగలరు.

తులా రాశి 2025 రాశి ఫలాలు
తులా రాశి 2025 రాశి ఫలాలు

చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా 2025 సంవత్సరం తుల రాశి ఫలాలు ఇక్కడ చూడొచ్చు. ఈ జాతకుల రాశి చక్రంలో బృహస్పతి మే నుండి తొమ్మిదో స్థానములో సంచరించనున్నాడు. శని ఆరవ స్థానములో సంచరించనున్నాడు. రాహువు మే నుండి ఐదో స్థానము నందు, కేతువు మే నుండి పదకొండవ స్థానము నందు సంచరించనున్నారు. ఈ గ్రహాల సంచారం కారణంగా తులారాశి వారికి 2025 సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది.

ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమగును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటి సత్ఫలితాలను ఇచ్చును. వ్యాపారస్తులకు ధనలాభము, వ్యాపారాభివృద్ధి జరుగును. ఈ సంవత్సరం తులారాశి వారికి మంచి ఆదాయం, అభివృద్ధి సూచించుచున్నవి.

ఎవరెవరికి ఎలాంటి ఫలాలు?

ఈ సంవత్సరం తులా రాశి జాతకులకు ఆరోగ్యము, ఆనందము కలుగును. కుటుంబ సౌఖ్యం కలుగును. సంతానం వలన శుభవార్తలను వినెదరు. ప్రయాణములు లాభదాయకముగా ఉండును. శుభవార్తలు వింటారు. శుభకార్యాలయందు పాల్గొంటారు. ఇన్వెస్ట్మెంట్లు వంటివన్నీ కలసివచ్చును. సజ్జన సాంగత్యము పెరుగును. ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలు ఫలించును. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఏర్పడును. నరఘోష పెరుగు సూచన.

తులారాశి విద్యార్థులు శుభ ఫలితములను పొందెదరు. వ్యాపారస్తులకు వ్యాపారం లాభదాయకంగా ఉండును. గత కొంత కాలంగా ఏవైతే సమస్యలున్నాయో ఆ సమస్యలు కొలిక్కి వచ్చును. కోర్టు తీర్పులు, కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాలను అందించును.

తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలున్నాయి. సౌఖ్యం, ఆనందం కలుగును. రాజకీయ నాయకులకు కలసి వచ్చేటువంటి సంవత్సరం.

ఏయే పరిహారాలు పాటించాలి?

2025 సంవత్సరంలో తులారాశి జాతకులు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కనకధారా స్తోత్రాన్ని పఠించండి. శుక్రవారం రోజు ఆవునేతిలో లక్ష్మీ దేవి వద్ద దీపాన్ని వెలిగించండి. ఆదిత్య హృదయ పారాయణ మంచిది.

జనవరి 2025:

ఈ మాసం తులా రాశి వారికి అనుకూలంగా లేదు. శుభకార్యాలకు ధనం విరివిగా ఖర్చు చేస్తారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త. దైవ దర్శన భాగ్యం ఉంది. ఇతరుల వలన ఇబ్బందులు పడతారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు. అవమానపడతారు.

ఫిబ్రవరి 2025:

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ధన నష్టము, స్త్రీ వలన అపవాదులు ఉంటాయి. వినోదాల కోసం ధనం ఖర్చు చేసెదరు. శుభకార్యములలో పాల్గొంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పోలీసులతో వాగ్వాదానికి దిగుతారు. ఖర్చులు అధికమగును. మీ తెలివితేటలతో జాగ్రత్తగా ముందుకు వెళ్ళెదరు.

మార్చి 2025:

ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. పుణ్యనదీ స్నానాలు చేస్తారు. సంతానపరంగా ఖర్చులు. రుణ ప్రయత్నాలు కలసివచ్చును. వస్తు సామాగ్రి కొంటారు. నరఘోష అధికమగును. పదవులు, సభ్యత్వాలు వచ్చును. గౌరవముంటుంది. అనారోగ్య సమస్యలు. శస్త్రచికిత్స.

ఏప్రిల్ 2025:

ఈ మాసం తులా రాశి జాతకులకు అనుకూలంగా లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. గృహ మార్పులు ఉంటాయి. వృధా ఖర్చులు ఉంటాయి. దేవాలయ దర్శనము చేయుదురు. క్రయవిక్రయాల్లో లాభాలు ఉంటాయి. మిత్రులు శత్రువులుగా మారెదరు. అధికార ఒత్తిడి ప్రతి విషయంలో ఆలోచనలు.

మే 2025:

ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. ధనలాభం. వ్యాపారంలో మంచి అభివృద్ధి. తలపెట్టిన పనులు నెరవేరును. గృహ నిర్మాణ పనులు పూర్తగును. బంధువిరోధములుంటాయి. వివాహ ప్రయత్నములు, పనులు పూర్తి చేస్తారు. శత్రు జయము.

జూన్ 2025:

ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. తీర్థయాత్రలు చేస్తారు. వస్తువులు, ఆభరణములు కొంటారు. సంతానపరంగా ధనవ్యయము. దేవాలయ దర్శనం చేస్తారు. స్థిరాస్తి విక్రయము. స్నేహితులు శత్రువులుగా మారును. ప్రమాద సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి.

జూలై 2025:

ఈ మాసంలో తులా రాశి జాతకులకు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడిపెదరు. వ్యవసాయములో చిక్కులు, గొడవలు వచ్చును. ఉద్యోగావకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలం. ఆదాయమునకు మించిన ఖర్చులుంటాయి. వాహన భయము. కొత్త ప్రయత్నాలు ఫలించును.

ఆగస్టు 2025:

ఈ మాసం మీకు అన్ని విధాలుగా కలసివచ్చును. నూతన వస్త్రములు కొంటారు. ధనాదాయం బాగుంటుంది. మానసిక ఆలోచనలు చేయుదురు. కొన్ని అవమానానాలు ఉంటాయి.

సెప్టెంబర్ 2025:

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. సంఘములో గౌరవం ఉంటుంది. విపరీతమైన కోపము. మాటపట్టింపులు ఉంటాయి. స్వల్పంగా అనారోగ్యం బాధిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల రాకతో కొంత సంతోషం ఉంటుంది.

అక్టోబర్ 2025:

ఈ మాసం తుల రాశి జాతకులకు అంత అనుకూలంగా లేదు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. మానసికాందోళన. గౌరవ హాని, కార్యహాని. ఇంటా బయటా విరోధములు ఉంటాయి. అధికార ఒత్తిడి. మీరు చేయు పనుల యందు ఆటంకాలు ఉంటాయి. స్నేహితులు కలసివచ్చును. వినోదం లభిస్తుంది.

నవంబర్ 2025:

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అన్ని పనులలో ఆటంకాలు ఏర్పడును. వ్యాపార, వ్యవసాయపరంగా అనుకూలించును. వాహనము కొంటారు. మానసికాందోళన. దూర ప్రయాణాలు ఉంటాయి. ప్రేమ అనుకూలించును. ధనపరంగా స్వల్ప ఇబ్బందులు.

డిసెంబర్ 2025:

ఈ మాసం తులారాశి జాతకులకు అనుకూలంగా లేదు. భూమి తగాదాలు ఉంటాయి. గర్వం పెరుగును. శారీరక అలసట ఉంటుంది. శుభకార్యములు చేయుదురు. ప్రముఖులతో సంభాషణ. రాజీనామాలు చేయాల్సి వస్తుంది. ఒప్పందాలకు అనుకూలం. తోబుట్టువులతో విరోధాలేర్పడతాయి.

- చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, పంచాంగకర్త

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner

సంబంధిత కథనం