Boiled Egg vs Omelette: ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లెట్, గుడ్డును ఏ రూపంలో తీసుకుంటే ఎక్కువ ఆరోగ్యం?-boiled egg or omelette which form of egg is more healthy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Boiled Egg Vs Omelette: ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లెట్, గుడ్డును ఏ రూపంలో తీసుకుంటే ఎక్కువ ఆరోగ్యం?

Boiled Egg vs Omelette: ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లెట్, గుడ్డును ఏ రూపంలో తీసుకుంటే ఎక్కువ ఆరోగ్యం?

Haritha Chappa HT Telugu
Dec 12, 2024 04:30 PM IST

Boiled Egg vs Omelette: చాలామంది అల్పాహారంలో ఆమ్లెట్ ను తింటారు. మరికొందరు ఉడికించిన గుడ్లను తింటారు. ఎలా తినడం వల్ల అందులోని పోషకాలు శరీరానికి పరిపూర్ణంగా అందుతాయో తెలుసుకోండి.

కోడిగుడ్డు లేదా ఆమ్లెట్ ఏది ఆరోగ్యం?
కోడిగుడ్డు లేదా ఆమ్లెట్ ఏది ఆరోగ్యం? (Pixabay)

గుడ్డు సంపూర్ణ ఆహారంగా చెప్పుకుంటారు. దీనిలో విటమిన్లు, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్ నిండుగా ఉంటుంది. రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే గుడ్లను తినేటప్పుడు కొంతమంది ఉడికించిన రూపంలో తింటే, మరికొందరు ఆమ్లెట్ రూపంలో తింటారు. పోషకాలు, క్యాలరీల పరంగా గుడ్డును ఏ రూపంలో తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోండి.

yearly horoscope entry point

ఉడికించిన గుడ్లు

ఉడికించిన గుడ్లను తినడం అనేది ఆరోగ్యకరమైన మార్గాలలో ఒకటి. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం ఉడికించిన గుడ్డులో ఆరు గ్రాముల అధిక నాణ్యత గలిగిన ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల అభివృద్ధికి, కండరాల మరమ్మతుకు అత్యవసరం. ఉడికించిన గుడ్డులో ఇనుము, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్ తో పాటు విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ బి12 అధికంగా ఉంటాయి. అలాగే ఉడికించిన గుడ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా లభిస్తాయి. ఇప్పటి నుంచే గుడ్లను తినడం వల్ల వయసు పెరిగిన తర్వాత కంటి చూపు క్షీణించకుండా కాపాడుకోవచ్చు. అమెరికా జర్నల్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ప్రతిరోజు ఒక గుడ్డు తినడం వల్ల బరువును కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చని చెబుతోంది.

ఆమ్లెట్ గా

ఆమ్లెట్‌ను వేసేందుకు ఎక్కువమంది పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉల్లిపాయలను జోడిస్తారు. మరికొందరు ఇతర కూరగాయలను కూడా జోడిస్తారు. చీజ్‌ను కూడా వేసి ఆమ్లెట్ ను వేసుకుంటారు. కూరగాయలు జోడించి ఆమ్లెట్ వేసుకుంటే ఫైబర్‌తో పాటు విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. కేవలం గుడ్లతో మాత్రమే వేసిన ఆమ్లెట్లను తినడం వల్ల ప్రోటీన్ కంటెంట్ మాత్రమే అందుతుంది. దీనికి చీజ్, వంట నూనెలు కలపడం వల్ల క్యాలరీలు పెరుగుతాయి. అనారోగ్యకరమైన కొవ్వులు కూడా చేరుతాయి. గుడ్లలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఎప్పుడైతే చీజ్, నూనె వంటివి దీనికి కలుస్తాయో అది అధిక కేలరీలు ఉన్న ఆహారంగా మారిపోతుంది.

ఏది ఆరోగ్యకరం?

ఉడికించిన గుడ్లలో కేలరీలు అనారోగ్యకరమైన కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన పద్ధతిలో వండినది. ఉడికించిన గుడ్లలో క్యాలరీలు కౌంట్ చాలా తక్కువ. కాబట్టి వీటిని తినడం ఆరోగ్యకరం. ఆమ్లెట్ ద్వారా కూడా కొన్ని పోషకాలు అదనంగా చేరుతాయి. కానీ నూనె వేసి వేయించడం వల్ల అది కొవ్వును పెంచే ఆహారంగా మారిపోవచ్చు. కాబట్టి పూర్తిగా ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్‌ని మీరు తినాలనుకుంటే ఉడికించిన కోడిగుడ్లను ఎంపిక చేసుకోండి. ఉడికించిన కోడిగుడ్లు తినడం వల్ల ఒక శాతం కూడా చెడు ప్రభావం ఉండదు. వీలైనంతవరకు పిల్లలకు ఉడికించిన కోడిగుడ్లు పెట్టేందుకే ప్రయత్నించండి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

 

Whats_app_banner