Egg Pulusu: తెలంగాణ స్టైల్‌లో గుడ్డు మసాలా పులుసు, వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోతుంది-telangana style egg pulusu recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Pulusu: తెలంగాణ స్టైల్‌లో గుడ్డు మసాలా పులుసు, వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోతుంది

Egg Pulusu: తెలంగాణ స్టైల్‌లో గుడ్డు మసాలా పులుసు, వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Oct 03, 2024 05:49 PM IST

Egg Pulusu: గుడ్డు కూరలు అంటే మీకు ఇష్టమా, ఇక్కడ మేము తెలంగాణ స్టైల్‌లో మసాలా గుడ్డు పులుసు ఎలా చేయాలో ఇచ్చాము. దీని రుచి అదిరిపోతుంది, రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

మసాలా గుడ్డు పులుసు రెసీపీ
మసాలా గుడ్డు పులుసు రెసీపీ

Egg Pulusu: గుడ్డు కూరను ఒక్కోచోట ఒక్కోలా చేస్తారు. తెలంగాణ స్టైల్‌లో చేసే గుడ్డు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొబ్బరి పొడి, వేరుశనగపప్పు, నువ్వులు అన్నీ వేసి చేస్తారు. ఈ చిక్కని గ్రేవీని వేడి వేడి అన్నంలో కలుపుకుంటుంటే రుచి అదిరిపోతుంది. ఇక్కడ మేము తెలంగాణ స్టైల్‌లో గుడ్డు పులుసు ఎలా చేయాలో ఇచ్చాను. దీని రెసిపీ తెలుసుకోండి.

మసాలా గుడ్డు పులుసు రెసిపీకి కావాల్సిన పదార్థాలు

గుడ్లు - అయిదు

నూనె - మూడు స్పూన్లు

వేరుశెనగ పలుకులు - పావుకప్పు

నువ్వులు - పావు కప్పు

మెంతులు - పావు స్పూను

జీలకర్ర - ఒక స్పూను

ఉల్లిపాయ - రెండు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్

పసుపు - పావు స్పూను

నీళ్లు - సరిపడినంత

చింతపండు - నిమ్మకాయ సైజులో

కారం - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

ఎండు కొబ్బరి పొడి - పావు కప్పు

నీళ్లు - తగినన్ని

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

మసాలా గుడ్డు పులుసు రెసిపీ

1. గుడ్లను ముందుగానే ఉడికించి తీసి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి వేరుశెనగ పలుకులు, మెంతులు వేసి వేయించాలి.

3. అందులోనే ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి.

4. చివరిలో నువ్వులు వేయాలి.

5. కొబ్బరి పొడిని కూడా వేసి 30 సెకన్లు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

6. వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

7. ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన కళాయిలో నూనె వేసి ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకోవాలి.

8. ఉల్లిపాయల రంగు మారేవరకు వేసుకుని వేయించాలి.

9. తర్వాత స్టవ్ కట్టేసి ఆ ఉల్లిపాయలను కూడా మిక్సీలో వేసి రుబ్బుకోవాలి.

10. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

11. ఆ నూనెలో కోడిగుడ్లను వేసి వేయించుకోవాలి.

12. కోడిగుడ్లకు గాట్లు పెడితే అవి బాగా ఫ్రై అవుతాయి.

13. ఇప్పుడు ఆ నూనెలో ఉల్లిపాయల పేస్టు వేసి వేయించాలి.

14. అలాగే మసాలా పొడిని కూడా వేసి వేయించుకోవాలి.

15. అవి బాగా వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.

16. చింతపండు నానబెట్టి ఆ పులుసును కూడా వేయాలి.

17. తగినన్ని నీళ్లను వేసి స్టవ్ మీద కళాయి మీద మూత పెట్టాలి.

18. చిన్న మంట మీద ఉంచి ఉడికించాలి. నూనె పైకి తేలేదాకా అలా స్టవ్ మీద ఉడికించాలి.

19. వేయించుకున్న గుడ్లను వేసి బాగా కలుపుకోవాలి.

20. ఇగురు ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం నీళ్లను వేసుకోవాలి.

21. పావు గంట సేపు ఉడికించి పైన కొత్తిమీర తరుగును చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ గుడ్లు కూర రెడీ అయినట్టే.

వేడివేడి అన్నంలో ఈ గుడ్లు కర్రీని వేసుకుని తింటే టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం చాలా రకాల మసాలా దినుసులను వాడాం. కాబట్టి రుచి కూడా అదిరిపోతుంది. స్పైసీగా కావాలనుకునేవారు పచ్చిమిర్చిని లేదా కారాన్ని ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. తెలంగాణ స్టైల్‌లో ఈ వంటకాన్ని వండి చూడండి. మీరు కచ్చితంగా అభిమానులు అయిపోతారు.

Whats_app_banner