Navaratri Foods: నవరాత్రుల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసిన ఆహారాన్ని తినకూడదని చెబుతారు ఎందుకు?
Navaratri Foods: నవరాత్రుల్లో ఎంతోమంది ఉల్లిపాయ, వెల్లుల్లిపాయను తినరు. ఇలా తినకపోవడం అనేది ఎప్పటినుంచో ఆచారంగా వస్తోంది. అయితే ఉపవాసం చేస్తున్నప్పుడు లేదా పండగ సమయాల్లో ఎందుకు ఉల్లిపాయను, వెల్లుల్లిని దూరం పెడతారు?
Navaratri Foods: పవిత్రంగా పూజలు చేసే సమయంలో, అలాగే ఉపవాసం సమయంలో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలను చాలామంది తినకపోవడం ఆచారంగా వస్తోంది. దీని గురించి ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి తామసిక స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని పవిత్ర కాలంలో తినకపోవడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది.
ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం ఉల్లిపాయలు, వెల్లుల్లి వేడి చేసే ఆహారాలు ఇవి పిత్తదోషాన్ని పెంచుతాయి. నవరాత్రి సమయంలో ఉపవాసం ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. చల్లగా ఉండే తేలికపాటి ఆహారాన్ని తినడం వల్ల శరీరం తన అంతర్గత వేడిని నియంత్రణలోకి తెచ్చుకుంటుంది. దీనివల్ల మొత్తం ఆరోగ్యం బాగుంటుంది. ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి అధికంగా తింటే తాపజనక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంటే వేడి సంబంధిత లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. దీనివల్ల మీరు పూజను సరిగ్గా చేయలేరు.
మానసిక ఆరోగ్యం పై ప్రభావాలు
ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి మానసిక స్థితిని ఎంతో ప్రభావితం చేస్తాయి. పరధ్యానంగా ఉండేలా ప్రేరేపిస్తాయి. నవరాత్రి సమయంలో ఆధ్యాత్మికంగా ఎంతో అప్రమత్తంగా ఉండాలి. పూజించేందుకు ఏకాగ్రత, స్పష్టత చాలా అవసరం. కాబట్టి వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటివి తినడం మానేస్తే పూజలు మరింత ఏకాగ్రతగా వ్రతాన్ని మరింత పవిత్రంగా కొనసాగించే అవకాశం ఉంటుంది.
హిందూ సంప్రదాయాల్లో పండుగల సమయంలో స్వచ్ఛంగా ఉండడం చాలా ముఖ్యం. వెల్లుల్లి, ఉల్లిపాయను చాలా మంది అశుద్ధంగా భావిస్తూ ఉంటారు. వాటి నుంచి వచ్చే వాసన చాలా మందికి నచ్చదు. ఆ రెండింటిని మాంసాహారాలలో ఎక్కువగా వాడతారు అనే అభిప్రాయం కూడా ఉంది. దీనివల్లే ఆధ్యాత్మికత, స్వచ్ఛత కోసం ఉల్లిపాయ, వెల్లుల్లి దూరం పెట్టడం ప్రాచీన కాలం నుంచి ఆచారంగా మారిపోయింది.
నవరాత్రుల్లో తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటారు. అలాగే ఉపవాసం అధికంగా ఉంటారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి అనేవి పోషక పదార్థాలే అయినా అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. దీనివల్ల కొంతమంది భక్తులకు అసౌకర్యంగా, పొట్ట ఉబ్బరంగా అనిపించవచ్చు. అందుకే నవరాత్రులలో అలాంటి ఆహారాలకు దూరంగా ఉండటం కూడా ఆచారంగా మారిందని చెప్పుకుంటారు.