Warangal Celebrations: ప్రజాపాలన విజయోత్సవాలకు ఓరుగల్లు రెడీ, సీఎం చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శ్రీకారం-orugallu is ready for the congress anniversary celebrations development works are launched by the cm ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Celebrations: ప్రజాపాలన విజయోత్సవాలకు ఓరుగల్లు రెడీ, సీఎం చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శ్రీకారం

Warangal Celebrations: ప్రజాపాలన విజయోత్సవాలకు ఓరుగల్లు రెడీ, సీఎం చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శ్రీకారం

HT Telugu Desk HT Telugu

Warangal Celebrations: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ సంబరాలకు వరంగల్ సిద్ధమైంది. మంగళవారం వరంగల్ మహానగరంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

ప్రజా పాలన విజయోత్సవాలకు సిద్ధమైన ఓరుగల్లు నగరం

Warangal Celebrations: ప్రజాపాలన విజయోత్సవాలకు ఓరుగల్లు నగరం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విజయోత్సవ సభకు చీఫ్ గెస్ట్ గా హాజరు కానుండగా.. ఇదే సభా ప్రాంగణం నుంచి వరంగల్ నగరంలోని వివిధ అభివృద్ధి పనులకు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యంగా దాదాపు పదేళ్ల నుంచి ప్రారంభోత్సవానికి నోచుకోకుండా ఉన్న కాళోజీ కళాక్షేత్రానికి మోక్షం కలగనుంది. దాంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా రూ.4,962.47 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన ఇలా..

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ లో నిర్వహించే వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2.30 గంటలకు హాజరు కానున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలీక్యాప్టర్ లో మధ్యాహ్నం 2:30 గంటలకు హనుమకొండలోని కుడా గ్రౌండ్ హెలీప్యాడ్‌కు ఆయన చేరుకుంటారు. అనంతరం ఆ పక్కనే ఉన్న కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు.

కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ వేదికకు చేరుకుంటారు. 3:20 కి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించి.. మహిళా స్వయం సహాయక సంఘాలు, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్య సభ్యులతో మాట్లాడుతారు.

రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా బ్యాంక్ లింకేజ్ చెక్కులు, బీమా చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం వేదికపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆ తరువాత హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు.

రూ.4962.47 కోట్లతో డెవలప్మెంట్ వర్క్స్

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవ వేడుకల్లో భాగంగా హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీలో దాదాపు రూ.4962.47 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..

నిధుల కేటాయింపు ఇలా…

వరంగల్ లో అభివృద్ధి పనులకు మొత్తంగా కేటాయించిన నిధులు: రూ. 4962.47 కోట్లు

* వరంగల్ మహానగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ: రూ.4,170 కోట్లు

* మామునూరు ఎయిర్ పోర్ట్ పునరుద్ధరణ కోసం భూసేకరణకు: రూ.205 కోట్లు

* కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో అభివృద్ధి పనులు: రూ.160.92 కోట్లు

* టెక్స్ టైల్ పార్కులో రోడ్లు, స్కూల్స్, సదుపాయాలు : రూ.33.60 కోట్లు

* టెక్స్ టైల్ పార్క్ కు భూములు ఇచ్చిన రైతులకు 863 ఇందిరమ్మ ఇండ్లు: రూ. 43.15 కోట్లు

* హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం: రూ.85 కోట్లు

* పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు ఫోర్ లైన్ రోడ్డు విస్తరణ : రూ. 65 కోట్లు

* నయీమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణం: రూ.8.3 కోట్లు

* వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ టవర్: రూ. 32.50 కోట్లు

* ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం: రూ.80 కోట్లు

* భద్రకాళి ఆలయం వద్ద పాలిటెక్నిక్ కాలేజీకి కొత్త బిల్డింగ్ నిర్మాణం: రూ.28 కోట్లు

* గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్ల నిర్మాణం : రూ. 49.50

* వరంగల్ ఉర్దూ భవన్, షాదీ ఖానా : రూ.1.50 కోట్లు

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)