క్యాలెండర్ మారుస్తున్నారు సరే.. దాని స్థానాన్ని మారుస్తున్నారా లేదా? మారిస్తేనే మంచి ఫలితాలట!
పాత క్యాలెండర్లను తీసేసి కొత్త క్యాలెండర్లు పెట్టాల్సిన సమయం వచ్చేస్తుంది. ఈ సమయంలో క్యాలెండర్ లేదా పంచాంగం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాస్తు ప్రకారం క్యాలెండర్ ఉంచే స్థలాన్ని బట్టి దాని ఫలితాలు ఉంటాయి. ఏ దిశలో ఉంచితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందామా?
కొత్త సంవత్సరం వచ్చేస్తుంది ఇళ్లు, ఆఫీసుల్లో పాత క్యాలెండర్లను తొలగించి కొత్త వాటిని వేలాడదీయాల్సిన సమయం కూడా వచ్చేస్తుంది. సాధారణంగా కొత్త క్యాలెండర్ ను మనం పాత క్యాలెండర్ ఉంచే చోటులోనే పెట్టేస్తుంటాం. కానీ అలా చేయకూడదట. ఇది ఆర్థిక నష్టాన్ని సూచిస్తుందట. క్యాలెండర్ స్థానాన్ని ఎప్పుడూ మారుస్తూ ఉండాలి. ఎందుకంటే క్యాలెండర్ అనేది సమయం, వ్యవధిని సూచిస్తుంది. కాబట్టి దాన్ని ఉంచే స్థానం చాలా ప్రాముఖ్యత సంతరించుకుని ఉంటుంది. వాస్తు సూత్రాల ప్రకారం సానుకూల శక్తిని, శాంతి, శ్రేయస్సు, ధనాన్ని ఆకర్షించడంలో క్యాలెండర్ ప్లేస్‌మెంట్ కీలక పాత్ర పోషిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. క్యాలెండర్ అంటే పంచాంగాన్ని పెట్టే దిశను బట్టి ఫలితాలు రకరకాల ఫలితాలు ఉంటాయట. క్యాలెండర్ ను వేరు వేరు స్థానల్లో వేలాడదీయడం వల్ల భిన్నమైన ఫలితాలను ఆస్వాదించవచ్చట. కుటుంబ సంబంధాలు, వ్యాపారా లాభాలను మెరుగుపరుచుకునేందుకు క్యాలెండర్ దిశ కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందట. వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి..
క్యాలెండర్ ను ఏ దిశలో ఉంచితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?
జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం.. క్యాలెండర్ లేదా పంచాంగాన్ని తూర్పు దిశలో ఉంచడం మంచిది. ఇది వృద్ధి, విజయాలకు సంబంధించిన దిశ. అలాగే క్యాలెండర్ మీద సూర్యోదయ చిత్రం ఉంటే అది అదృష్టాన్ని రెట్టింపు చేస్తుందని నమ్మకం.
శాస్త్రాల ప్రకారం ఉత్తర దిక్కు కుబేరుడికి చెందినది. ఉత్తారాన ఉంచే క్యాలెండర్ లో ఆకుపచ్చ చిత్రాలు, నీటి జలపాతాలు, వివాహ చిత్రాలు ఉంచడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా శుభం కలుగుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం పశ్చిమ దిశ శక్తికి సహజ ప్రసరణ ప్రాంతం. పశ్చిమాన క్యాలెండర్ వేలాడదీయడం వ్యాపార సంబంధిత ఉన్నతికి అవసరం. వ్యాపార సంస్థల్లో క్యాలెండర్లు ఎప్పుడూ పశ్చిమ దిశలో ఉండేలా చూసుకొండి. ఇది ఆర్థిక శ్రేయస్సును ఆకర్షిస్తుంది.
క్యాలెండర్ లేదా పంచాంగాన్ని దక్షిణాన వేలాడదీయడం అశుభమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది ఆదాయానికి ఆటంకం కలిగేలా చేస్తుంది. ఇంట్లోని వ్యక్తులు వివిధ వ్యాధుల బారిన పడతారు. కనుక ఈ దిశలో క్యాలెండర్ ను ఉంచకూడదు.
మరో ముఖ్య విషయం ఏంటంటే క్యాలెండర్ ను ఎప్పుడూ ప్రధాన ద్వారం కనుచూపు మేరలో ఉంచకూడదు. ఇది ఇంట్లోకి ప్రవేశించే సానుకూల శక్తులను అడ్డుకుంటుంది. అలాగే తలుపు వెనకాల, కిటికీల్లో ఉంచడం కూడా మంచిది కాదు. తలుపు వెనకాల క్యాలెండర్ వేలాడదీయడం వల్ల జీవితానికి హాని కలుగుతుంది.
జంతువులు, విచారకరమైన, భయంకరమైన చిత్రాలు ఉన్న క్యాలెండర్లను ఇంట్లో ఉంచకూడదు. ఇవి ఇంట్లోకి ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి.ఇంట్లో చికాకులు, గొడవలను తెచ్చిపెడతాయి.
క్యాలెండర్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎంచుకోవాల్సిన అంశాలను గురించి తెలుసుకున్ారు కదా.. పాటించండి సంతోషంగా జీవించండి.