Amaravati : అమరావతికి భారీగా నిధులు.. అభివృద్ధి పరుగులు.. ఫలించిన ప్రభుత్వం ప్రయత్నాలు!
Amaravati : అమరావతిని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబుకు అమరావతి డ్రీమ్ ప్రాజెక్టు. కానీ.. నిధులు భారీగా అవసరం అవుతున్నాయి. దీంతో ప్రభుత్వం వివిధ సంస్థలు, బ్యాంకులను రుణాలు అడిగింది. తాజాగా ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ భారీగా రుణం మంజూరు చేసింది.
అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలక అప్‌డేట్ ఇది. అవును.. రాజధాని అభివృద్ధి కోసం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు భారీగా నిధులు మంజూరు చేసింది. అమరావతిని గ్రీన్ అండ్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి రుణం మంజూరు చేసినట్టు ఏడీబీ స్పష్టం చేసింది. మొత్తం 121.97 బిలియన్ల జపనీస్ యెన్‌లను మంజూరు చేసినట్టు ఏడీబీ వెల్లడించింది.
రాజధాని నిర్మాణానికి నిధులను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిధులు సమకూర్చుకునేందుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో.. వివిధ బ్యాంకుల నుంచి రూ. 15 వేల కోట్లు రుణం తీసుకునేలా వెసులుబాటు కల్పిస్తూ.. కేంద్రం బడ్జెట్‌లో ఆమోదం తెలిపింది. రూ. 15,000 కోట్లలో ప్రపంచబ్యాంకు, ఏడీబీ కలిసి రూ. 13,500 కోట్లను రుణంగా ఇస్తున్నాయి. మిగతా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూర్చనుంది. రూ. 13,500 కోట్ల రుణాన్ని ఐదేళ్లపాటు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఐదేళ్ల తర్వాత చెల్లింపు మొదలవుతుంది. ఆరు నెలలకు ఒక వాయిదా చొప్పున 23 సంవత్సరాలపాటు రుణం చెల్లించాలి.
ఈ నిధులతో ప్రభుత్వం కీలక పనులు చేపట్టనుంది. అమరావతి ప్రాంతాన్ని గ్రోత్ హబ్‌గా తీర్చిదిద్దడానికి, ఆ ప్రాంత వాసుల జీవన ప్రమాణాలు పెంచడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు మేలు చేయడానికి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఈ నిధులను ప్రభుత్వం వినియోగించనుంది.
ఈ రుణం మంజూరుపై ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఇండియా కంట్రీ డైరెక్టర్ మియో ఓకా కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ ఫీల్డ్ నగరాలను అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయిస్తున్నట్టు వివరించారు. భవిష్యత్తులోను మరిన్ని నగరాల అభివృద్ధి జరగబోతోందని.. వాటికి అమరావతి రోల్ మాడల్‌లో మారబోతోందని వ్యాఖ్యానించారు.
గ్రీన్ అండ్ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా.. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. పచ్చని ప్రదేశాలు ఉండేలా చూస్తారు. నీరు, పారిశుద్ధ్య సేవలు, తక్కువ కార్బన్ రవాణా సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. వరద ప్రమాదాలను తగ్గించడానికి డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరుస్తారు. పెట్టుబడిదారులను తీసుకురావడంలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తారు. ప్రైవేట్ పెట్టుబడిని సృష్టించి మహిళలు, యువతకు ప్రయోజనం చేకూర్చే కొత్త ఉద్యోగాలను సృష్టిస్తారు.