Manchu Family Controversy: మంచు ఫ్యామిలీ వివాదం కేసులో ఒకరు అరెస్ట్.. పైచేయి సాధించిన మంచు మనోజ్
Manchu Mohan Babu Manager Arrest: మంచు మనోజ్‌పై దాడి.. ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని మాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మోహన్ బాబు మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి జరిగిన గొడవతో..?
మంచు ఫ్యామిలీ వివాదంలో బుధవారం తొలి అరెస్ట్ జరిగింది. గత ఆదివారం నుంచి జరుగుతున్న ఈ ఫ్యామిలీ వివాదం తొలుత ప్రెస్‌నోట్‌లతో మొదలై.. ఆ తర్వాత పోలీసులకి ఫిర్యాదులు.. భౌతిక దాడులు, గన్ సరెండర్, ఆసుపత్రుల్లో చేరికతో పీక్స్‌కి చేరింది. అయితే.. ఈ వివాదంలో మంచు మనోజ్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మోహన్ బాబు మేనేజర్ వెంకట కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మనోజ్‌పై దాడి.. కేసు నమోదు
జల్‌పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి వద్ద మంగళవారం రాత్రి గొడవ జరరగా.. మంచు మనోజ్‌పై బౌన్సర్లు దాడికి తెగబడ్డారు. గేటుని బలవంతంగా తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లిన మంచు మనోజ్.. చిరిగిన చొక్కాతో బయటికి వచ్చాడు. అదే సమయంలో మీడియాపై మంచు మోహన్ బాబు దాడి చేయడంతో.. ఒక రిపోర్టర్‌కి తీవ్ర గాయమైంది. ఈ నేపథ్యంలో మంచు మోహన్ బాబుపై కూడా కేసు నమోదైంది. మంచు విష్ణు, మోహన్ బాబు, మనోజ్‌ను విచారణకి రావాల్సిందిగా రాచకొండ సీపీ ఈరోజు ఆదేశించినా.. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన మోహన్ బాబు.. అతని వెంట ఉన్న మంచు విష్ణు విచారణకి వెళ్లలేదు. కేవలం మంచు మనోజ్ మాత్రమే హాజరయ్యారు.
సీసీ ఫుటేజీ మాయం
మోహన్ బాబు మేనేజర్ వెంకట కిరణ్ తనపై దాడి చేశాడని.. అలానే సీసీటీవీ ఫుటేజీని మాయం చేశాడని గత సోమవారం పహాడీషరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేయగా.. ఆ కేసు విచారణలో భాగంగా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మనోజ్ ఫిర్యాదు చేయగానే కిరణ్ పరారీలోకి వెళ్లగా.. పోలీసులు గాలించి అదుపులోకి తీసుకున్నారట. అలానే జల్‌పల్లి మంగళవారం రాత్రి జరిగిన గొడవపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అక్కడ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అయితే.. గొడవ జరిగిన సమయంలో సీసీటీవీ ఫుటేజీలు లేకపోవడంతో.. ఆ ఫుటేజీని ఎవరు మాయం చేశారు? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
నెగటివ్ అయిపోయిన మోహన్ బాబు
వాస్తవానికి మంచు మనోజ్.. తనకి పహాడీషరీఫ్ పోలీసులు సహకరించడం లేదని మంగళవారం ఆరోపణలు గుప్పించారు. తాను రక్షణ కోసం తెచ్చుకున్న బౌన్సర్లను పోలీసులు బలవంతంగా పంపించేశారని కూడా మండిపడ్డారు. అయితే.. మోహన్ బాబు క్షణికావేశంలో మీడియాపై దాడి చేయడంతో.. ఇప్పుడు పరిస్థితులు మంచు మనోజ్‌కి కాస్త అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ వివాదంపై కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడుకోవడానికి తాను సిద్ధమని మంచు మనోజ్ ఈరోజు ప్రకటించారు.