Rashmika on Allu Arjun: అల్లు అర్జున్ దమ్మున్నోడు.. మరే హీరో ఆ పని చేయలేడు: రష్మిక మందన్నా కామెంట్స్ వైరల్
Rashmika on Allu Arjun: అల్లు అర్జున్ దమ్మున్నోడంటూ రష్మిక మందన్నా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పుష్ప 2 మూవీ ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ అందుకున్న సందర్భంలో బన్నీని ఆకాశానికెత్తుతూ రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
Rashmika on Allu Arjun: అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన పుష్ప 2 మూవీ ఓవైపు రికార్డులు తిరగరాస్తుంటే.. తన కోస్టార్ బన్నీపై రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. ముఖ్యంగా పుష్ప 2 మూవీ జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ చీర కట్టుకొని నటించడాన్ని ప్రస్తావిస్తూ.. మరెవరూ అలా చేయలేరని ఆమె కొనియాడింది.
అల్లు అర్జున్ దమ్మున్నోడు
పుష్ప 2 మూవీలో జాతర సీక్వెన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా అందులో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు, చేసిన యాక్షన్, చెప్పిన డైలాగులు ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. అభిమానులనే కాదు ఆ సీన్ రష్మిక మందన్నా కూడా తెగ నచ్చేసింది. ఈ సీక్వెన్స్ చేసిన బన్నీ దమ్మున్నోడంటూ తాజాగా పింక్‌విల్లా ఇంటర్వ్యూలో చెప్పింది. "ఇంత బాగా ఈ సీన్ చేయగలిగిన ఏకైక నటుడు అల్లు అర్జున్ సర్ మాత్రమే.
నా జీవితంలో మళ్లీ ఇలాంటి సీక్వెన్స్ చూస్తానని అనుకోవడం లేదు. అసలు ఇంత దమ్ము, పవర్, ఆల్ఫానెస్ ఉన్న హీరో ఓ చీర కట్టుకొని, చీరలోనే డ్యాన్స్ చేసి, ఆ చీరలోనే యాక్షన్ సీక్వెన్సెస్ చేసి, చీరలోనే డైలాగ్స్ చెబితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సినిమాలో 21 నిమిషాల పాటు అతడు చీర కట్టుకొనే కనిపిస్తాడు. అసలు ఏ మగాడు ఆ పని చేయగలడో చెప్పండి. అతన్ని నేను ఎంతో గౌరవిస్తాను. ఆరాధిస్తాను. జీవితం మొత్తం అతన్ని సపోర్ట్ చేస్తాను" అని రష్మిక అనడం విశేషం.
నువ్వు లేకుండా నేనిలా నటించేవాన్నే కాదు: బన్నీ
నిజానికి అంతకుముందు రష్మిక మందన్నా గురించి కూడా అల్లు అర్జున్ ఎంతో గొప్పగా చెప్పాడు. పుష్ప 2 మూవీ ప్రమోషన్లలో భాగంగా అతడు మాట్లాడుతూ.. రష్మిక లేకుండా ఈ మూవీ అసలు సాధ్యమయ్యేది కాదని, ఆమె సపోర్ట్ లేకపోతే తాను అలా నటించేవాడినే కాదని బన్నీ అనడం గమనార్హం. పుష్ప మూవీ తర్వాత రష్మిక తన ఫ్యామిలీలాగా మారిపోయిందని చెప్పాడు. అసలు అమ్మాయంటే రష్మికలాగా ఉండాలని, పుష్ప 2 షూటింగ్ కు ఆమె ఎప్పుడు వచ్చినా ఆ రోజంతా చాలా ఆనందంగా గడిచిపోయేదని అతడు అన్నాడు.
ఇక పుష్ప 2 మూవీ విషయానికి వస్తే.. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ మూవీ ఊహించినట్లే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. అత్యంత వేగంగా రూ.1000 కోట్ల మార్క్ అందుకున్న ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఆరు రోజుల్లోనే ఈ ఊహకందని మార్క్ అందుకున్న పుష్ప 2.. రానున్న రోజుల్లో మరెన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి. నిజానికి పుష్ప 2 అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందని ప్రమోషన్ల సమయంలోనే రష్మిక అంచనా వేసింది. ఆమె చెప్పినట్లే ఒక్కో రికార్డును తిరగరాస్తూ దూసుకెళ్తోంది.