The Girlfriend Teaser: అస్సలు పడను.. రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ టీజర్ లాంచ్ చేసిన విజయ్ దేవరకొండ.. అతని వాయిస్ ఓవర్‌తోనే..
The Girlfriend Teaser: రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్ టీజర్ సోమవారం (డిసెంబర్ 9) రిలీజైంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ విజయ్ దేవరకొండనే ఈ టీజర్ లాంచ్ చేయడం విశేషం. అతని వాయిస్ ఓవర్ తోనే ఈ టీజర్ మొత్తం సాగుతుంది.
The Girlfriend Teaser: గర్ల్‌ఫ్రెండ్ టీజర్ ను బాయ్‌ఫ్రెండ్ లాంచ్ చేశాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తున్న మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. ఈ సినిమా టీజర్ ను సోమవారం (డిసెంబర్ 9) విజయ్ దేవరకొండ రిలీజ్ చేశాడు. అంతేకాదు ఈ సినిమా కోసం అతడు తన వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. నిమిషంన్నర నిడివి ఉన్న ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా, ఎన్నో ఎమోషన్స్ తో సాగింది.
ది గర్ల్‌ఫ్రెండ్ టీజర్
ఇదేదో పికప్ లైన్ కాదు కదా.. అస్సలు పడను.. ఇదీ ది గర్ల్‌ఫ్రెండ్ టీజర్ లో ఉన్న ఏకైక డైలాగ్. అది కూడా రష్మిక మందన్నా నోటి వెంట వస్తుంది. మిగిలిన 1.35 నిమిషాల టీజర్ మొత్తం విజయ్ దేవరకొండ పోయెటిక్ వాయిస్ ఓవర్ బ్యాక్‌గ్రౌండ్లో వినిపిస్తుండగా సాగుతుంది.
ఈ టీజర్ మొత్తం ఎన్నో ఎమోషన్స్ రష్మిక ముఖంపై కనిపిస్తుంటాయి. దీని ద్వారా అసలు మూవీ స్టోరీ ఏంటన్నది పెద్దగా రివీల్ కాకపోయినా.. యువతను ఆకట్టుకునేలా వివిధ ఎమోషన్స్ తో సాగే కథ అని మాత్రం స్పష్టమవుతోంది. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
ది గర్ల్‌ఫ్రెండ్ టీజర్ ఎలా ఉందంటే?
ది గర్ల్‌ఫ్రెండ్ టీజర్ మొదట్లోనే రష్మిక తన కొత్త కాలేజీ హాస్టల్ జీవితాన్ని గడపడానికి రావడం చూడొచ్చు. టీజర్ మొదటి నుంచీ బ్యాక్‌గ్రౌండ్లో విజయ్ దేవరకొండ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. నయనం నయనం కలిసే తరుణం.. ఎదనం పరుగే పెరిగే వేగం.. నా కదిలే మనసుని అడిగా సాయం.. ఇక మీదట నువ్వే దానికి గమ్యం.. అంటూ విజయ్ పోయెటిక్ వాయిస్ ఓవర్ ఈ టీజర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విసిరిన నవ్వుల వెలుగుని చూశా.. నవ్వాపితే పగలే చీకటి తెలుసా అంటూ అప్పటి వరకూ ఎంతో సంతోషంగా సాగిపోయిన ఆమె జీవితం.. ఒక్కసారిగా మారిపోవడం చూడొచ్చు. విజయ్ చెప్పిన ఈ డైలాగుల ద్వారానే మూవీ కథేంటన్నది చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు. ఇదేం పికప్ లైన్ కాదు.. అస్సలు పడను అంటూ టీజర్ చివర్లో మాత్రం రష్మిక ఓ డైలాగ్ చెబుతుంది.
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ గురించి..
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మేల్ లీడ్ గా దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. అనూ ఇమ్మాన్యుయేల్ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. అల్లు అరవింద్ మూవీని సమర్పిస్తున్నాడు. ఖుషీ సినిమాలో మంచి మ్యూజిక్ అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
టీజర్లోనే అతడు మరోసారి తన మెలోడీతో మనసులు హత్తుకునే ప్రయత్నం చేశాడు. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఈ మధ్యే పుష్ప 2తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న రష్మిక.. ఆ తర్వాత ఈ గర్ల్‌ఫ్రెండ్ మూవీతో రాబోతోంది. హిందీలో చావా అనే మూవీలో సినిమాలోనూ ఆమె నటిస్తోంది.