Rohit Sharma: రోహిత్ శర్మకి అదే పెద్ద శాపం.. కోహ్లీతో పోల్చి చూస్తే హిట్‌మ్యాన్ టెస్టు ప్లేయరే కాదన్న మాజీ క్రికెటర్
IND vs AUS 3rd Test: రోహిత్ శర్మ అధిక బరువుపై మరోసారి చర్చ మొదలైంది. టెస్టుల్లో గత ఏడాదికాలంగా హిట్‌మ్యాన్ వరుసగా విఫలమవుతున్నాడు. దాంతో.. టెస్టుల్లో ఆడేందుకు అతను అనర్హుడంటూ..?
టెస్టు క్రికెట్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్‌తో గత కొన్ని రోజుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో కనీసం ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయిన హిట్‌మ్యాన్.. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టుల్లో విఫలమవుతూ మాజీ క్రికెటర్లకి టార్గెట్‌గా మారాడు.
రోహిత్ శర్మ ఇలా టెస్టుల్లో విఫలం అవ్వడానికి కారణం అతని అధిక బరువు అని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్ తేల్చి చెప్పేశాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన మూడు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సింగిల్ డిజిట్ స్కోరుకే ఔట్ అయిపోయాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 14 నుంచి గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.
రోహిత్ బెల్లీ ఫ్యాట్‌పై వెటకారం
రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై వెటకారం చేసిన డారిల్ కల్లినన్.. అసలు టెస్టు క్రికెట్‌కే హిట్‌మ్యాన్ అనర్హుడని తేల్చి చెప్పేశాడు. ‘‘రోహిత్ శర్మని ఓసారి తీక్షణంగా చూడండి. అధిక బరువు.. బెల్లీ ఫ్యాట్‌తో ఐదు రోజుల ఫార్మాట్‌లో ఆడే ఫిట్‌నెస్ అతనికి ఉన్నట్లు కనిపించడం లేదు. విరాట్ కోహ్లీతో పోల్చి చూస్తే అతను టెస్టు ప్లేయర్‌గా అస్సలు కనిపించడు’’ అని డారిల్ కల్లినన్ చెప్పుకొచ్చాడు.
టెస్టుల్లో చివరిగా ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ 8 ఇన్నింగ్స్‌ల్లో కనీసం డబుల్ డిజిట్ స్కోరుని కూడా టచ్ చేయలేకపోవడం అతని పేలవ ఫామ్‌కి ఇది నిదర్శనం. ఈ ప్రభావం అతని ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌పై కూడా పడింది. ఆరేళ్లలో తొలిసారి బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ టాప్-30లో చోటు కోల్పోయాడు. రోహిత్ పేలవ ఫామ్ ప్రభావం వ్యక్తిగతంగా అతని కెరీర్‌పైనే కాదు.. భారత్ జట్టుపై కూడా పడుతోందని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.
రోహిత్ త్యాగం వృథా
గత వారం ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో రోహిత శర్మ తన ఓపెనర్ స్థానాన్ని కేఎల్ రాహుల్‌కి త్యాగం చేసి నెం.6లో బ్యాటింగ్‌కి దిగాడు. కానీ.. బ్యాటింగ్ స్థానం మారినా.. రోహిత్ బ్యాట్ నుంచి పరుగులు రాలేదు. మళ్లీ సింగిల్ డిజిట్ స్కోరు వెక్కిరించింది. దాంతో మూడో టెస్టులో మళ్లీ ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఆడే అవకాశం ఉంది.
సిరీస్ సమం
ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటికే పెర్త్, అడిలైడ్ వేదికగా రెండు టెస్టులు ముగిశాయి. తొలి టెస్టులో భారత్ జట్టు 295 పరుగుల తేడాతో విజయం సాధించగా.. రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో సిరీస్ ప్రస్తుతం 1-1తో సమం అయ్యింది.