Visakha Hospital: విశాఖలో దారుణం..తలకు స్కాన్ చేయడానికి మహిళ బట్టలిప్పాలన్న టెక్నిషియన్..సీఎం ఆదేశాలతో అరెస్ట్
Visakha Hospital: విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తలకు గాయమై స్కానింగ్ కోసం వచ్చిన మహిళను బట్టలిప్పాలని సూచించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించిన ఆస్పత్రి ల్యాబ్ టెక్నిషియన్ కటకటాల పాలయ్యాడు. ఈ ఘటనసై సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు వేగంగా స్పందించారు.
Visakha Hospital: తలకు గాయమై స్కానింగ్ కోసం వచ్చిన మహిళను విశాఖపట్నంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రి టెక్నిషియన్ అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపింది. డిసెంబర్ 9వ తేదీ సోమవారం రాత్రి 7.30గంటలకు తలకు గాయం కావడంతో విశాఖపట్నంలోని గోపాలపట్నం ప్రాంతానికి చెందిన మహిళ చికిత్స కోసం రామ్‌నగర్‌లో ఉన్న కేర్ ఆస్పత్రికి వచ్చారు.
ఆమెను పరీక్షించిన వైద్యులు తలకు స్కానింగ్ చేయాలని సిఫార్సు చేయడంతో ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగానికి ఆమె వెళ్లారు. అక్కడ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న పి.ప్రకాష్ ఆమె ధరించిన దుస్తులు తొలగించాలని చెప్పాడు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మహిళలకు స్కానింగ్ చేసే సమయంలో మహిళా అటెండర్లు, రేడియాలజీ సిబ్బంది తగిన సూచనలు చేస్తారు.
అక్కడ టెక్నిషియయ్ మాత్రమే ఉండటంతో పాటు తలకు దెబ్బ తగిలితే దుస్తులు ఎందుకు తొలగించాలని బాధితురాలు ప్రశ్నిం చారు. గుండెకు కూడా స్కానింగ్ రాశారని, అందుకు దుస్తులు తొలగించాల్సి ఉంటుందని ఆమె శరీరంపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తిం చాడు. దీంతో ఆందోళనకు గురైన మహిళ కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. అక్కడే ఉన్న కుటుంబసభ్యులకు విషయం చెప్పడంతో ఆగ్రహానికి గురై అతడికి దేహశుద్ధి చేసి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విశాఖలో స్కానింగ్ సెంటర్‌లో మహిళను సిబ్బంది వేధింపులకు గురిచేసిన వ్యవహారం వెలుగు చూడటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.తలకు గాయం తగిలిన మహిళపై అసభ్యంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా అసభ్యంగా ప్రవర్తించిన స్కానింగ్ సెంటర్ సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
సీఎం చంద్రబాబు ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన 3వ టౌన్ పోలీసులు సదరు స్కానింగ్ సెంటర్ ఇన్ ఛార్జ్ ప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పీఎన్‌సీ 74, 76 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి రిమాండ్ విధించగా విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.
ఈ ఘటనపై సీఎంఓ ఆదేశాలతో 3టౌన్ సీఐ రమణయ్య ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రకాష్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆసు పత్రి యాజమాన్యం వివరణ ఇచ్చింది.