Blood Pressure: హైబీపీ రాకూడదంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? రిస్క్ తగ్గాలంటే ఏ మార్పులు అవసరమంటే..
High Blood Pressure: బ్లడ్ ప్రెజర్ రాకముందే జాగ్రత్త పడితే.. చాలా ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. బీపీ రాకుండా ఉండాలంటే ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. అవేవో ఇక్కడ చూడండి.
హై బ్లడ్ ప్రెజర్ (బీపీ)తో కోట్లాది మంది బాధపడుతూ ఉంటారు. హైబీపీ ఉంటే మరికొన్ని దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే రిస్క్ పెరిగిపోతుంది. గుండె సంబంధిత రోగాలు, డయాబెటిస్, కంటి సమస్యలు లాంటి వాటికి హైబీపీ దారి తీస్తుంది. అందుకే హై బ్లడ్ ప్రెజర్ (రక్తపోటు) రాకుండా ముందుగానే జాగ్రత్తపడాలి. హైబీపీ వచ్చే రిస్క్ తగ్గాలంటే కొన్ని జాగ్రత్తలు ముందు నుంచే తీసుకోవాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. దీంతో హైబీపీ రిస్క్ తగ్గుతుంది. అవేంటంటే..
ఉప్పుతో పాటు మరికొన్ని తగ్గించాలి
రెగ్యులర్‌గా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అది హై బ్లడ్ ప్రెజర్‌కు దారి తీస్తుంది. అందుకే ఆహారాల్లో ఉప్పును తగ్గించాలి. అవసరానికి మంచి ఎక్కువ అసలు తీసుకోకూడదు. కావాలంటే కాస్త తక్కువే ఉండాలి. సోడియం ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్, ప్యాక్డ్ ఫుడ్‍లను ఎక్కువగా తినకూడదు.
రెగ్యులర్‌గా వ్యాయామం తప్పనిసరి
రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల బ్లడ్ ప్రెజర్ రిస్క్ బాగా తగ్గుతుంది. పూర్తిస్థాయి ఆరోగ్యానికి కూడా మంచిది. వారంలో కనీసం 150 నిమిషాలైనా ఇంటెన్స్‌గా ఉండే వ్యాయామాలు చేయాలి. వేగంగా నడవడం, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటివి కూడా చేస్తుండాలి. స్ట్రైంత్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్‍లు కూడా చేయడం మంచిది.
బరువు పెరగకుండా..
ఊబకాయం ఉంటే హై బ్లడ్ ప్రెజర్ వచ్చే రిస్క్ అధికంగా ఉంటుంది. అందుకే ఎత్తు తగ్గట్టుగా శరీర బరువు ఉండేలా మ్యానేజ్ చేసుకోవాలి. అధిక బరువు ఉండకుండా చూసుకోవాలి. వ్యాయామాలు చేయడం, పోషకాలు ఉండే ఆహారాలు తినడం వల్ల సరైన బరువు ఉండేలా చూసుకోవచ్చు.
ఇలాంటివి తినాలి
బ్లడ్ ప్రెజర్ రాకుండా అడ్డుకునే డైట్ ప్లాన్‍కు డ్యాష్ (డీఏఎస్‍హెచ్) అని కూడా ఉంది. దీంట్లో భాగంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్, కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు కచ్చితంగా తినాలి. సోడియం, సాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండేటివి ఈ డైట్‍లో తీసుకోవాలి. డ్యాష్ డైట్ పాటించడం వల్ల బ్లడ్ ప్రెజర్ రిస్క్ బాగా తగ్గుతుంది. అందుకే ప్రతీ రోజు తీసుకునే ఆహారంలో కూరగాయాలు, పండ్లు, తృణధాన్యాలతో పాటు పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఉండేలా జాగ్రత్త పడాలి. ప్రోటీన్ పుష్కలంగా ఉండే నట్స్, బీన్స్, ఫిష్, గుడ్లు లాంటివి తినాలి.
ధూమపానం, మద్యపానం వద్దు
ఎక్కువగా పొగతాగడం, మద్యం సేవించడం లాంటివి చేస్తే బ్లడ్ ప్రెజర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ అలవాట్లు చాలా రిస్క్. అందుకే వీటిని బాగా తగ్గించాలి. కుదిరితే సిగరెట్లు, బీడీలు తాగడం, మద్యం సేవించడం, పొగాకు ఉత్పత్తులు వాడడం పూర్తిగా మానేయాలి.
ఒత్తిడికి గురి కాకుండా..
ఒత్తికి గురైతే ఇప్పటికప్పుడే శరీరంలో బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. ఇదే ఒత్తిడి చాలా కాలం కొనసాగితే అది హైబీపీ వచ్చేందుకు కారణం అవుతుంది. అందుకే రోజువారి జీవితంలో ఒత్తిడి తగ్గేలా జాగ్రత్తలు తీసుకోవాలి. యోగా, ధ్యానం, డీప్ బ్రీత్ ఎక్సర్‌సైజ్‍లు చేయాలి. దేనికి ఒత్తిడికి గురవుతున్నామో గుర్తించి.. తగ్గించుకోవాలి. పుస్తకాలు చడవడం, ఇష్టమైన సంగీతం వినడం లాంటి వాటి వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది.
సంబంధిత కథనం