Exercise: ఈ ఎక్సర్‌సైజ్‍ ప్రతీ రోజు తప్పక చేయాలి.. బరువు తగ్గడం నుంచి మోకాళ్ల దృఢత్వం వరకు ప్రయోజనాలు ఇవే-do step up exercise daily for stability to weight loss ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Exercise: ఈ ఎక్సర్‌సైజ్‍ ప్రతీ రోజు తప్పక చేయాలి.. బరువు తగ్గడం నుంచి మోకాళ్ల దృఢత్వం వరకు ప్రయోజనాలు ఇవే

Exercise: ఈ ఎక్సర్‌సైజ్‍ ప్రతీ రోజు తప్పక చేయాలి.. బరువు తగ్గడం నుంచి మోకాళ్ల దృఢత్వం వరకు ప్రయోజనాలు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 10, 2024 06:00 AM IST

Exercise: కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‍లను క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు దక్కుతాయి. అలాందే స్టెప్అప్ ఎక్సర్‌సైజ్‍. ఇవి చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఈ వ్యాయామం వివరాలు ఇవే..

Exercise: ఈ ఎక్సర్‌సైజ్‍ ప్రతీ రోజు తప్పక చేయాలి.. బరువు తగ్గడం నుంచి మోకాళ్ల దృఢత్వం వరకు ప్రయోజనాలు ఇవే (Photo: Freepik)
Exercise: ఈ ఎక్సర్‌సైజ్‍ ప్రతీ రోజు తప్పక చేయాలి.. బరువు తగ్గడం నుంచి మోకాళ్ల దృఢత్వం వరకు ప్రయోజనాలు ఇవే (Photo: Freepik)

ఫిట్‍నెస్‍తో పాటు ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. మన ఫిట్‍‍నెస్ గోల్‍కు తగ్గట్టుగా ఎక్సర్‌సైజ్‍లు చేయాలి. అయితే, కొన్ని రకాల వ్యాయమాలు ప్రతీ రోజు క్రమం తప్పకుండా చేయాలి. ఈ జాబితాలో ‘స్టెప్అప్ ఎక్సర్‌సైజ్‍’ మొదటి వరుసలో ఉంటుంది. రోజూ ఈ వ్యాయామం చేయడం వల్ల శరీరానికి చాలా లాభాలు ఉంటాయి. ఆ విషయాలను ఇక్కడ తెలుసుకోండి.

స్టెప్అప్ ఎక్సర్‌సైజ్‍ అంటే..

మందున్న ఎత్తైన ఉపరితలంపై ఓ కాలును మోపి చేసేదే స్టెప్అప్ ఎక్సర్‌సైజ్‍. అంటే ముందున్న ఏదైనా బాక్స్, బెంచ్, మెట్లు లాంటి ఎత్తైన వాటిపై ఓ కాలును ఉంచి.. దానిపై భారం వేసి పూర్తి శరీరాన్ని లేపాలి. ఆ తర్వాత కాస్త ఎగిరినట్టుగా చేసి శరీరాన్ని కిందికి దింపి ఇంకో కాలిని నేలపై మోపాలి. ఇలా చేస్తూనే ఉండాలి. కాసేటికి కాలు మార్చి కూడా చేయవచ్చు. దీన్ని స్టెప్‍అప్ ఎక్సర్‌సైజ్‍ అంటారు. దీనివల్ల శరీరానికి చాలా లాభాలు కలుగుతాయి.

కాళ్ల బలాన్ని పెంచుతాయి

స్టెప్అప్ ఎక్సర్‌సైజ్‍ ప్రతీ రోజు చేయడం వల్ల కాళ్ల బలం పెరిగి.. కండలు కూడా ఎక్కువవుతాయి. దిగువ శరీర కండరాలకు కూడా ఈ వ్యాయామం మేలు చేస్తుంది. దీనివల్ల ఇతర వ్యాయామాలను కూడా ప్రభావవంతంగా, చురుగ్గా చేయగలరు. ఫిట్‍నెస్ గోల్ చేరేందుకు స్టెప్అప్ ఎక్సర్‌సైజ్ ఉపయోగపడుతుంది.

స్థిరత్వం అధికం

స్టెప్అప్ ఎక్సర్‌సైజ్‍లు రెగ్యులర్‌గా చేస్తే కాళ్లతో పాటు శరీరం స్థిరత్వం, బ్యాలెన్స్ మెరుగవుతాయి. ఈ వ్యాయమంలో శరీరాన్ని ఓకే కాలిపై పైకి లేపేందుకు చాలా కంట్రోల్ కావాలి. దీనివల్ల బ్యాలెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా వృద్ధాప్యం చేరాక కూడా ఈ బ్యాలెన్స్ బాగా ఉండేందుకు ఈ వ్యాయామం ఉపయోగపడుతుంది.

బరువు తగ్గేందుకు..

స్టెప్అప్ ఎక్సర్‌సైజ్‍ చేస్తే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. దీనివల్ల బరువు తగ్గేందుకు కూడా ఈ వ్యాయామం ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇది మంచిది. వెయిట్ ట్రైనింగ్‍లో కూడా స్టెప్అప్ ఎక్సర్‌సైజ్‍ను యాడ్ చేసుకుంటే బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది.

మోకాళ్లకు దృఢంగా..

స్టెప్అప్ ఎక్సర్‌సైజ్‍ కాలిలోని ప్రతీ కండరంపై మంచి ప్రభావం చూపుతుంది. ఇది చేయడం వల్ల మోకాలి దృఢత్వం త్వరగా పెరుగుతుంది. మోకాళ్ల నొప్పుల ప్రమాదాన్ని ఇది తగ్గించదలదు. నడుము కూడా ఈ వ్యాయామం మంచి చేస్తుంది.

చేసేందుకు సులువు

స్టెప్‍అప్ ఎక్సర్‌సైజ్‍ చేసేందుకు చాలా సులభం. కావాలంటే శరీర భారాన్ని మోసే కాలిని మోపే వస్తువు పొడవును సౌలభ్యానికి తగ్గట్టుగా ఎంపిక చేసుకోవచ్చు. ఈ వ్యాయామాన్ని ఎక్కడైనా చేయవచ్చు. బాక్స్, బెంచ్, మెట్లు ఇలాంటివి ఉండే చాలు. పెద్దగా పరికరాలు కూడా అవసరం లేదు.

Whats_app_banner